వెంటాడే ఉద్యమాల వెన్నెల

ABN , First Publish Date - 2021-09-14T05:39:09+05:30 IST

సెల‌బ్రిటీల గురించి వ‌ల్లె వేయ‌డం లోకానికి ఒక ఫ్యాష‌న్. ఎంతమంది గ్రామీణ పోరాట యోధులు త‌మ అనారోగ్యాన్ని, వైక‌ల్యాన్ని అధిగ‌మించి, జ‌న పోరాట జ‌వ‌నాశ్వాన్ని ప‌రుగు లెత్తించినారో ఎవ‌రికి తెలుసు...

వెంటాడే ఉద్యమాల వెన్నెల

సెల‌బ్రిటీల గురించి వ‌ల్లె వేయ‌డం లోకానికి ఒక ఫ్యాష‌న్. ఎంతమంది గ్రామీణ పోరాట యోధులు త‌మ అనారోగ్యాన్ని, వైక‌ల్యాన్ని అధిగ‌మించి, జ‌న పోరాట జ‌వ‌నాశ్వాన్ని ప‌రుగు లెత్తించినారో ఎవ‌రికి తెలుసు? అలాంటి ఒకానొక యోధుడు జలగం జనార్ధన్ (జన్ను). గుండె పంపింగ్ 25శాతం మాత్రమే ఉన్నా జీవిత గడియారాన్ని వేగంగా ఉరకలెత్తించిన సూపర్ రోబో జన్ను. మ‌న‌ కాల‌పు మట్టి మనిషి జన్ను. ‘జ‌న్ను సార్‌’ అన‌డం నాకు ఇష్టం లేదు. కానీ పొరుకుల సారైనా, బాలగోపాల్ సారైనా, వి.వి. సారైనా మన కోసం జీవితాలను అంకితం చేసిన ఈ కాలం యోధులు వీళ్ళు. జన్ను ఇదే కోవకు చెందుతాడు. వీరి వ్యక్తిత్వం ముందు మనసు మోకరిల్లుతుంది. పోలీసుల చేతిలో జన్ను అనుభవించిన చిత్రహింసలకు లెక్క లేదు. వాటి తీవ్రత వల్ల వచ్చిన ఫిట్స్, ఆస్తమా అనారోగ్యాలతోనే ఆయన విప్లవోద్యమంలో నిలిచాడు. ఉద్యమాల వ‌నంలో పోరాట పంట‌ల‌ను చీల్చి వాటాలు పంచుకునే పోకడల మ‌ధ్య జ‌న్ను ఒక మొండిగోడ‌. జన్ను రూపుదిద్దిన జనతంత్రమే విప్లవ పార్టీకి ఆయువుపట్టయింది. ఆయన నేతృత్వంలో నల్లగొండలో 1990లో మతో న్మాద వ్యతిరేక సదస్సు, దేవరకొండలో బహిరంగ సభ, సూర్యాపేటలో వందలాది సభలు విజయవంతమయ్యాయి. ఒకవైపు రైతు కూలీ సంఘం, మరోవైపు విప్లవ పార్టీ, ఇంకో వైపు ప్రజా సంఘాలు... ఇలా తాను పాలుపంచుకొన్న ప్రతీ నిర్మాణానికీ వెన్నెముకగా నిలిచాడు. 1956 మే 7న మొదలైన జీవిత ప్రస్థానం ఈ ఏడాది మే 21న ముగిసింది. ఆయ‌న మ‌రణం నల్లగొండ ఉద్యమ శ్రేణుల‌కు ఎంతో దుఃఖాన్ని మిగిల్చింది. గాంధీ మెడిక‌ల్ కాలేజీలో 1988లో నేను పీజీ చేస్తున్నప్పుడు ఆయనతో పరిచయం మొదలైంది. మా ఇద్దరికీ ఆస్తమా ఉంది. ఊపిరి గొట్టాల్లో ప్రాణ‌వాయువు కోసం తండ్లాట ఎట్లుంట‌దో ఇద్దరికీ తెలుసు. అందుకే నేను నకిరేకల్‌కు వ‌చ్చినాక ఆయన ముషీరాబాద్ జైల్లో ఉంటే ఇన్‌హేలర్లు తీసుకెళ్ళి కలిసాను. గుండె బ‌లహీనపడినా ఏనాడూ బేల‌గా జావ‌గారని జ‌న్ను నా దృష్టిలో ఎప్పుడూ సెల్ఫ్‌లోడెడ్ గ‌న్నే. ఎక్కడో వ‌రంగ‌ల్ జిల్లాలో జ‌న్ను చిన్నాలును మ‌న జ‌న్ను రాజ‌కీయం మొద‌లు పెట్టిన రోజుల్లోనే చంపేసిండ్రు. ‘జ‌న్ను చిన్నాలో... జ‌న్ను చిన్నాలో’ పాటను స‌లంద్ర య‌స్‌.పి హాల్‌లో గొంతెత్తి పాడేవాడు. ఆ జ‌న్నుకు కొన‌సాగింపుగా నల్లగొండ నోచుకున్న మరో జనజ్వాల ఈ జనార్ధన్. ఆయ‌న విస్తరించిన ఉద్యమ క్షేత్రాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సింది ఆయ‌న రాజ‌కీయ వార‌సులే. మొక్కుబ‌డి నివాళి కంటే కార్యాచరణతో క‌సిగా పని చేయడమే వారి బాధ్యత. నేడు సూర్యాపేటలో జరగనున్న జన్ను సార్ సంస్మరణ సభ దీనికి ఒక ఆరంభం కావొచ్చు.

డా. చెరుకు సుధాక‌ర్‌

Updated Date - 2021-09-14T05:39:09+05:30 IST