ప్రమాదకరంగా మూసీ నాలా.. భయాందోళనలో ప్రజలు

ABN , First Publish Date - 2020-09-24T12:27:00+05:30 IST

రాంరెడ్డినగర్‌ నుంచి దేవేందర్‌నగర్‌ వరకు నాలుగు కిలో మీటర్ల పొడవునా పారుతున్న..

ప్రమాదకరంగా మూసీ నాలా.. భయాందోళనలో ప్రజలు

  • పట్టించుకోని అధికారులు 
  • ఫెన్సింగ్‌ ఏర్పాటు జాప్యంతో పొంచి ఉన్న ప్రమాదం

హైదరాబాద్/రామంతాపూర్‌ : రాంరెడ్డినగర్‌ నుంచి దేవేందర్‌నగర్‌ వరకు నాలుగు కిలో మీటర్ల పొడవునా పారుతున్న మూసీ నాలా మృత్యుకుహరంగా మారింది. వర్షాలు కురిసినప్పుడల్లా పొంగిపొర్లే మూసీ నాలాకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాలాలో గుర్తు తెలియని మృత దేహాలు, జంతువుల కళేబరాలు కొట్టుకువచ్చిన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు.


నాలా వెంబడి ఫెన్సింగ్‌ ఏర్పాటు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టిం పు లేని ధోరణితో వ్యవహరిస్తున్నారని, అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యతను వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాలాలో వ్యర్ధ పదార్ధాలతో నిండి తే పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఫెన్సింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


త్వరలో నాలా ఫెన్సింగ్‌ పనులు 

మూసీ నాలాలో చెత్తాచెదారం, వ్యర్థాల తొలగింపు పనులు జరుగుతున్న నేపథ్యంలో నాలా ఫెన్సింగ్‌ పని వాయిదా పడింది. నాలా శుద్ధి ప్రక్రియ ముగిసిన వెంటనే ఫెన్సింగ్‌ పనులను ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. - భేతి సుభా‌ష్‌రెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే. 


క్షేత్రస్థాయిలో పరిశీలన 

మూసీ నాలాతో పాటు సర్కిల్‌ పరిధిలోని ఓపెన్‌ నాలాలు అన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతాం. ఇప్పటికే పలు నాలాలపై స్లాబ్‌లతో పాటు బాక్స్‌ డ్రెయిన్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మూసీ నాలా వెంబడి ఫెన్సింగ్‌ ఏర్పాటు పనులను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

- అరుణకుమారి, డిప్యూటీ కమిషనర్‌, ఉప్పల్‌ మున్సిపాలిటీ.

Updated Date - 2020-09-24T12:27:00+05:30 IST