మోపాడు దడ

ABN , First Publish Date - 2021-12-02T07:19:48+05:30 IST

జిల్లాలో కీలక నీటివనరు మోపాడు ప్రాజెక్టుకు లీకేజీల ప్రమాదం పొంచి ఉంది. రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నిండుకుండలా మారింది.

మోపాడు దడ
మోపాడు అలుగును పగులుగొడుతున్న ఎక్స్‌కవేటర్‌

రిజర్వాయర్‌ కట్టకు ఐదు చోట్ల భారీ లీకులు

25ఏళ్ల క్రితం జరిగిన ఘోరకలిని గుర్తు చేసుకుంటున్న బాధితులు 

8 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

సురక్షిత ప్రాంతాలకు తరలింపు 

నీటిని బయటకు పంపేందుకు అలుగును పగులగొట్టిన వైనం

మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిని 

అడ్డుకున్న పోలీసులు

జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయరైన మోపాడు మళ్లీ దడ పుట్టిస్తోంది. దీంతో 25ఏళ్ల నాటి ఘోరకలిని గుర్తుచేసుకుంటూ కట్టకింద గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌ కట్టకు ఐదుచోట్ల భారీ లీకులు ఏర్పడ్డాయి. వీటిని కట్టడి చేసేందుకు బుధవారం ఉదయం నుంచి ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో  పని చేస్తున్నా సమస్య కొలిక్కి రాలేదు. నీరు ఆగడం లేదు. దీంతో మోపాడు, ఎల్‌ఎన్‌పురం, పుట్టంనాయుడుపల్లి, మోపాడు కొండారెడ్డిపల్లి తదితర గ్రామాలతోపాటు, ప్రధాన కాలువ వెంబడి ఉన్న పలు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హడలిపోయిన ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకుని కట్టుబట్టలతో మోపాడు బంగ్లా, లక్ష్మీనరసాపురం జడ్పీహైస్కూళ్లలో తలదాచుకుంటున్నారు. అయితే బాధితులకు కనీస అవసరాలు సమకూర్చే విషయంలోనూ అఽధికారులు విఫలమయ్యారు.  విషయం తెలిసి దాతలు భోజన వసతి ఏర్పాటు చేశారు. మోపాడు పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు కట్ట వద్దకు చేరుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

పామూరు, డిసెంబరు 1 : జిల్లాలో కీలక నీటివనరు మోపాడు ప్రాజెక్టుకు లీకేజీల ప్రమాదం పొంచి ఉంది. రెండురోజులుగా  కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నిండుకుండలా మారింది. అయితే రిజర్వాయర్‌ కట్టకు పలుచోట్ల లీకులు ఏర్పడ్డాయి. వీటి ద్వారా నీరు బయటకుపోతుండటంతో కట్ట కింద ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెరువు లోతట్టు ప్రాంతంలో వందలాది ట్రాక్టర్ల ద్వారా మట్టిని తెచ్చి లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నీటిమట్టం తగ్గిస్తే లీకులు తగ్గుతాయనే ఆలోచనతో రిజర్వాయర్‌ అలుగు ప్రాంతాన్ని యంత్రాలతో పగులగొట్టి నీటిని బయటకు పంపిస్తున్నారు. ఎవరూ ఎలాంటి భయాందోళనలు చెందవద్దని, కట్ట తెగిపోదని అధికారులు ధైర్యం చెబుతున్నారు. తాము శాయశక్తులా సహాయక చర్యలు చేపడుతున్నామని, అయినా మోపాడు కాలువకట్ట కింద ఉన్న గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని జేసీ మురళి, సబ్‌కలెక్టర్‌ అపరాజితాసింగ్‌, డీఎస్పీ కండే శ్రీనివాసులు సూచించారు. 


రంగంలోకి దిగిన అధికారులు

రిజర్వాయర్‌ కట్టకు ఐదు చోట్ల లీకేజీలు ఏర్పడి నీరు బయటకు పోతుండటాన్ని గమనించిన స్థానికులు అఽధికారులకు సమాచారం ఇచ్చారు. లీకులను అరికట్టేందుకు అప్రమత్తమైన ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, డీఈఈ రవికుమార్‌, తహసీల్దార్‌ సీహెచ్‌ ఉష, డీఎస్పీ కండే శ్రీనివాసులు, ఎంపీపీ గంగసాని లక్ష్మి, జడ్పీటీసీ సబ్యుడు చప్పిడి సుబ్బయ్యలు సహాయక చర్యలు చేపట్టారు. అయినా లీకుల నుంచి వచ్చేనీరు ఉధృతి తీవ్రమైంది. లీకు ఉన్న ప్రాంతం వద్ద మట్టిని తోలి చదును చేసినా ఫలితం లేదు. సహాయక చర్యలు చేపడుతున్న ప్రాంతానికి జేసీ వెంకటమురళి, సబ్‌కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ వచ్చి పరిశీలించి ఎటువంటి ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజలు ఎవ్వరూ భయాందోళన చెందవద్దని, ముందస్తుగా సురక్షితప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. బాధితులకు అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం బాధితులు తలదాచుకుంటున్న శిబిరాల వద్దకు వెళ్లి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. కట్టకు వచ్చిన ప్రమాదం ఏమీలేదని, అనవసర భయాందోళన చెందవద్దని, అధికారులు సహాయక చర్యల కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారని, మరో రెండురోజుల పాటు సహాయక చర్యలు జరుగుతాయని అధికారులు తెలిపారు. 


నిండిన ఆనందం  మరుసటిరోజే ఆవిరి..

మోపాడు రిజర్వాయర్‌కు ఇటీవల కురిసిన భారీవర్షాలతో 12ఏళ్ల అనంతరం  సమృద్ధిగా నీరుచేరి గత రెండురోజుల నుంచి అలుగు పారుతోంది. దీంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో కట్టకు ఐదుచోట్ల లీకులు ఏర్పడ్డాయన్న విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రిజర్వాయర్‌లో 25 అడుగుల మేర నీటిమట్టం ఉన్నప్పుడు లీకులు బయటపడలేదని,  ప్రస్తుతం 30 అడుగుల మేర నీరు చేరటంతో లీకులు ఏర్పడ్డాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని సహాయక చర్యలు చేపట్టినా లీకేజీలు అదుపులోకి రాలేదు. దీంతో కట్ట బలహీనపడి గండిపడే ప్రమాదం ఉందని ప్రచారం మొదలైంది. దీంతో గ్రామ ప్రజలను ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరిగ్గా 25ఏళ్ల క్రితం మోపాడుకు సంబంధించిన జలప్రళయం దాటికి 179మంది జలసమాధి అయిన ఘోరకలిని గుర్తుచేసుకుంటూ ప్రజలు హడలిపోతున్నారు. 


నాటి విషాదాన్ని గుర్తు చేసుకుని హడలిపోతున్న ప్రజలు

1996లో అతి భారీవర్షాలకు అలుగుకట్టపై 10 అడుగుల మేర వరదనీరు ప్రవహించింది. ఆనాటి ఘటనలో మోపాడు కట్ట తెగిందనే ప్రచారంతో మోపాడు, కొత్తపల్లి, ఎస్సీ కాలనీ, వాకంవారిపల్లి తదితర గ్రామ ప్రజలు అలుగు మీదుగా మల్లప్పగొంది కొండకు చేరుకుని ప్రాణాలు దక్కించుకోవాలనుకున్నారు. అదే ఆశతో జోరున కురిసే వాన, కారుచీకట్లను సైతం లెక్కచేయకుండా అలుగు దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఉధృతిగా ఉన్న అలుగు 179 మందిని బలి తీసుకుంది. ఆనాటి సంఘటనను బాధితులు గుర్తుచేసుకుంటూ బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రిజర్వాయర్‌ కట్ట తెగితే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరనే భయంతో ఇళ్లకు తాళాలు వేసుకుని ఐదు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరళివెళ్లారు. 


పోలీసుల తీరుపై మండిపడ్డ ఉగ్ర

మోపాడుకు లీకులు ఏర్పడ్డాయన్న సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సహాయక  చర్యలను పరిశీలించేందుకు మంగళవారం కట్ట వద్దకు చేరుకున్నారు. పనులు జరిగే ప్రాంతానికి వెళుతుండగా పామూరు ఎస్‌ఐ సురేష్‌ తన సిబ్బందితో అడ్డుకున్నారు. తాను మాజీ ఎమ్మెల్యేనని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం నా బాధ్యత అని, సహాయక చర్యలకు తమవంతు సహకారం అందించేందుకే వెళ్తున్నామని ఉగ్ర చెప్పారు. నీవు వెళ్తే జరిగే పనులకు ఆటంకం కలుగుతుందని ఎస్‌ఐ వాదించారు. దీంతో ఉగ్ర తనను ఏకవచన పదజాలంతో సంభోదించడంపై మండిపడ్డారు. ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చెరువు కట్టకు ప్రమాదం సంభవిస్తే అందుకు పామూరు ఎస్‌ఐ బాధ్యత వహించాలని ఉగ్ర అన్నారు. అధికార పార్టీ నాయకులను, వారి వాహనాలను కట్ట మీదకు ఎలా అనుమతిస్తున్నారంటూ పోలీసుల తీరును ఎండగట్టారు. అనంతరం మోపాడు, కంభాలదిన్నె గ్రామాల్లో బాధితులతో మాట్లాడుతూ అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మనుషుల ప్రాణాల కన్నా చెరువులోని చేపలపైనే అధికారపార్టీ నాయకులకు ప్రేమ ఎక్కువగా ఉందంటూ నినాదాలు చేశారు. 








Updated Date - 2021-12-02T07:19:48+05:30 IST