ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2020-12-05T03:55:59+05:30 IST

ఫార్మా రంగంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి తెలిపారు.

ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి

ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి


పరవాడ, డిసెంబరు 4: ఫార్మా రంగంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. రాంకీ ఫార్మాసిటీకి చెందిన రాంకీ కమర్షియల్‌ హబ్‌లో శుక్రవారం ఫార్మా కంపెనీల ప్రతినిధులకు ‘పరిశ్రమల్లో ఉపాధి శిక్షణ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు పరిశ్రమల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలతోనూ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. దీని కోసం ఇప్పటికే సమగ్ర పరిశ్రమ సర్వే చేపట్టామని, దీని ద్వారా పరిశ్రమలకు ఎంత మంది నిరుద్యోగులు అవసరమవుతారో, వారికి ఎలాంటి శిక్షణ ఇప్పించాలో తెలియజేశామన్నారు. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా లక్షా 75 వేల మందికి ఉపాధిఽపై శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. డిగ్రీ, ఇంటర్‌, డిప్లొమా చదివిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫార్మా పరిశ్రమల్లో అవసరం మేరకు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు ఇక్కడే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ, రాంకీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాంకీ మేనేజింగ్‌  డైరెక్టర్‌ లాల్‌ కృష్ణ, జెన్‌పీసీ అసోసియేషన్‌ ప్రతినిధులు సుబ్బారావు, శివరాంప్రసాద్‌, డీవీ రామకోటి రెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఈడీ, సీజీఎం రవి, సీనియర్‌ మేనేజర్‌ గోపినాథ్‌, 50 మంది శిక్షకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:55:59+05:30 IST