మారెళ్ల సభ విజయంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం

ABN , First Publish Date - 2022-01-20T04:29:26+05:30 IST

ముండ్లమూరు మండలంలోని మారెళ్లలో మంగళవారం రాత్రి ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంచనాలకు మించి సభకు రావటంతో టీడీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా నూతన ఉత్సాహం వచ్చింది

మారెళ్ల సభ విజయంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం
విగ్రహావిష్కరణలో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

ముండ్లమూరు, జనవరి 19 : మండలంలోని మారెళ్లలో  మంగళవారం రాత్రి ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంచనాలకు మించి సభకు రావటంతో టీడీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా నూతన ఉత్సాహం వచ్చింది. టీడీపీ దర్శి ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ బాధ్యతలు తీసుకున్న తరువాత పెద్ద స్థాయిలో జరిగిన సభ కావటం, అనుకున్న దాని కంటే ఎక్కువ మంది సభకు హాజరై విజయవంతం చేయటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. అసెంబ్లీ ఎన్నికలకు రెండు సంవత్సరాల సమయం ఉండటంతో మారుమూలైన మారెళ్ల గ్రామంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీఆర్‌ వర్థంతి సందర్భంగా టీడీపీ నాయకులు అద్దంకి, కొండపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు దామ చర్ల జనార్దన్‌, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు హాజరు కావటంతో పాటు వారు ప్రసంగించిన తీరు సైతం క్యాడర్‌లో జోష్‌ పెంచింది. పై పెచ్చు ఈ కార్యక్రమానికి గతంలో టీడీపీలో ఉండి 2019లో వివిధ కారణాలతో వైసీపీలో చేరిన వారు సైతం మళ్లీ మనసు మార్చుకొని మంగళవారం జరిగిన వర్ధంతి సభలో కన్పించటంతో టీడీపీకి మండలంలో పూర్వ వైభవం సంతరించుకున్నట్లయింది.  టీడీపీ ఇన్‌చార్జ్‌గా పమిడి రమేష్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించటం, కార్యకర్తలకు అండగా ఉండటంతో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు చిన్నచిన్న లోపాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి సభకు వచ్చారు. 7 గంటలకు ప్రారంభమైన ర్యాలీ 8:30 గంటల వరకు సమయం వరకు పట్టింది. మండలంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలే కాకుండా టీడీపీపై అభిమానం ఉన్న క్యాడర్‌ అంతా మారెళ్ళ రావటం ఉత్సాహాన్ని పెంచింది. తెలుగుదేశానికి పట్టు ఉన్న ముండ్లమూరు మండలంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు వైసీపీ ఆధీనంలోకి వెళ్లటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఎట్టకేలకు మారెళ్లలో ఎన్‌టీఆర్‌ వర్థంతి సందర్భంగా పార్టీ నాయకులు సభ నిర్వహించటం, దీనికి భారీగా పార్టీ కార్యకర్తలు హాజరు కావటంతో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం సంతరించుకుందని అంటున్నారు. సభను అడ్డుకొనేందుకు అధికార పార్టీలో కొందరు ప్రయత్నాలు చేయటంతో పాటు సభకు వెళితే ప్రభుత్వ పథకాలు నిలిపి వేస్తామని కొందరు పరోక్షంగా గ్రామాల్లోని నాయకులు హెచ్చరించినా వాటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా రావటం విశేషం.  మండలంలోని తమ్మలూరులో బీసీ వర్గానికి చెందిన యువకులు ఉమామహేశ్వర అగ్రహారంలో ఓసీ వర్గానికి చెందిన వారు, బీసీ వర్గానికి చెందిన వారు 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆపార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా మారెళ్ళ సభలో పాల్గొనటం మరో విశేషం. 


Updated Date - 2022-01-20T04:29:26+05:30 IST