మరిన్ని అంతర్జాతీయ ఒప్పందాలు

ABN , First Publish Date - 2020-08-02T06:20:29+05:30 IST

మహిళా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దాదాపు రెండున్నరేళ్ల క్రితం 2018 మార్చి 8న వియ్‌ హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

మరిన్ని అంతర్జాతీయ ఒప్పందాలు

  • 6 నెలల్లో జిల్లాల్లో 4 కేంద్రాలు
  • రెండేళ్లలో 85 స్టార్ట్‌పలకు ప్రాణం
  • వియ్‌ హబ్‌ సీఈఓ దీప్తి రావుల 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహిళా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దాదాపు రెండున్నరేళ్ల క్రితం 2018 మార్చి 8న వియ్‌ హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోనే మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంక్యుబేటర్‌ ఇదే. టీ-హబ్‌ టెక్నాలజీ స్టార్ట్‌ప్స కోసం ఏర్పాటు చేస్తే.. అన్ని రంగాల్లోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వియ్‌ హబ్‌ అండగా నిలుస్తుందని ఆ సంస్థ సీఈఓ దీప్తి రావుల చెబుతున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వియ్‌ హబ్‌ మద్దతుతో కార్యరూపం దాల్చిన స్టార్టప్స్‌, ఆయా స్టార్ట్‌పలు సమీకరించిన నిధులు మొదలైన విషయాలను దీప్తి ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.


ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు సాయం ఎలా?

కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ప్లాట్‌ఫామ్‌గా వియ్‌ హబ్‌ మద్దతిస్తుంది. నిధుల సమీకరణ, మార్గదర్శనం, స్టార్టప్‌ నిర్వహణ, దాన్ని అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాలు అందిస్తుంది. అన్ని రంగాల్లోని మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవచ్చు. కంపెనీలు, ప్రభుత్వాలు, విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇంక్యుబేషన్‌, యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాం. మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తాం. ఎంపిక చేసిన మహిళలకు ఉచితంగా ప్రోగ్రామ్‌లలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తాం.


ఇప్పటివరకు ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు?

కార్పొరేట్లు, ప్రభుత్వ సంస్థలు, ఇంక్యుబేటర్లు మొదలైన వాటితో 40-45 సహకార ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇందు లో 12 అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. పీ అండ్‌ జీ, హెచ్‌డీఎ్‌ఫసీ, సేల్స్‌ఫోర్స్‌, పీడబ్ల్యూసీ, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వియ్‌ హబ్‌తో కలిసి పని చేస్తున్నాయి. ఆంత్రప్రెన్యూరల్‌ వ్యవస్థ బలోపేతం చేయడానికి 50కే వెంచర్స్‌, 10,000 స్టార్ట్‌పలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌తో కలిసి సామాజిక ఆంత్రప్రెన్యూర్‌ యాక్సిలరేటర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జర్మనీ ప్రభుత్వంతో కలిసి ప్రాజెక్ట్‌ హర్‌ అండ్‌ నౌ పేరుతో ఇంక్యుబేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాం.


  ఎన్ని స్టార్ట్‌పలు ప్రాణం పోసుకున్నాయి?

ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 85 స్టార్ట్‌పలు రూపుదిద్దుకున్నాయి. వియ్‌ హబ్‌ ప్లాట్‌ఫామ్‌పై మొదటి ఏడాదిలోనే స్టార్ట్‌పలు రూ.7 కోట్ల నిధులను సమీకరించాయి. ఇవన్నీ దాదాపు టెక్నాలజీ ఆధారిత స్టార్ట్‌పలే. హెల్త్‌కేర్‌, ఎడ్యుటెక్‌ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.


భవిష్యత్‌ ప్రణాళికలు ?

మరిన్ని అంతర్జాతీయ సహకార ఒప్పందాలతో స్టార్టప్‌ ఎక్స్ఛేంజీ కార్యక్రమాలను ప్రారంభించాలనుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింతగా గుర్తించి ప్రోత్సహించడానికి వచ్చే ఆరు నెలల్లో జిల్లా ప్రధాన కేంద్రాల్లో 4-5 కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. జర్మన్‌ ఆర్థిక సహకారం, అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత నైపుణ్యాల అభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్‌ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం ద్వారా అమలు చేస్తున్న గ్రామీణ ఆంత్రప్రెన్యూర్‌ కార్యక్రమం ప్రాజెక్ట్‌ హర్‌ అండ్‌ నౌ ద్వారా మొదటి విడతలో 30 మంది వ్యాపార ఆలోచనలను ఎంపిక చేసి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. బూట్‌ క్యాంపుల్లో 3,500 మంది పాల్గొంటే.. 1230 దరఖాస్తుల నుంచి 113 మంది దరఖాస్తులను ఎంపిక చేశాం. వారిలో 30 మందికి చివరిగా ఎంపిక అయ్యారు. రెండో విడతలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో  120 మందిని ఎంపిక చేయనున్నాం. సెప్టెంబరు నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుంది. వారికి దాదాపు 7 నెలల పాటు శిక్షణ ఇస్తాం. వీరితో పాటు అర్బన్‌ ఆంత్రప్రెన్యూర్‌ కార్యక్రమం కింద శిక్షణ ఇచ్చేందుకు మరో 26 మందిని ఎంపిక చేశాం.

Updated Date - 2020-08-02T06:20:29+05:30 IST