Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేటీఎం... రెండో త్రైమాసికంలో మరిన్ని నష్టాలు...

న్యూఢిల్లీ /ముంబై : పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మరింతగా  నష్టాలపాలైంది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ నష్టం రూ. 473 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ. 436.7 కోట్ల నష్టం నమోదైందని కంపెనీ వెల్లడించింది. ఈ జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ మొత్తం ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 49.6 శాతం పెరిగి రూ. 1.086.4 కోట్లు ఆర్జించింది.   


గత ఆర్థిక సంవత్సరంలో జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి రూ. 492.4 కోట్లుగా నమోదైన పేటీఎం చెల్లింపుల ప్రాసెసింగ్‌ చార్జీలు... ఈ ఆర్ధిక సంవత్సరంలో అదే కాలానికి 36 శాతం పెరిగి రూ. 670 కోట్లకు చేరుకున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాల ఖర్చులు వార్షిక ప్రాతిపదికన 35 శాతం పెరిగి, రూ.386.5 కోట్లకు, సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌, డేటా సెంటర్‌ నిర్వహణ వ్యయాలు 56.5 శాతం పెరిగి రూ. 112.9 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ మర్చంట్‌ బేస్‌ 1.85 కోట్ల నుంచి 2.3 కోట్లకు పెరిగింది. పేటీఎం నిర్వహించిన చెల్లింపుల మొత్తం...  ఈ రెండో త్రైమాసికంలో రూ. 1,95,600 కోట్లు. క్రితం ఆర్థికసంవత్సరం ఇదేకాలంలో ఈ మొత్తం రూ. 94,700 కోట్లు మాత్రమే. ఎంటీయూ(మంత్లీ ట్రాన్సాక్టింగ్‌ యూజర్స్‌) క్రితం ఏడాదితో పోల్చితే 33 శాతం వృద్ధితో 57 లక్షలకు చేరుకున్నట్లు పేటీఎం వివరించింది.


ఈ రెండో త్రైమాసికంలో 28 లక్షల రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది. పేటీఎం నష్టాల బాట పట్టేందుకు...చెల్లింపుల ప్రాసెసింగ్‌ చార్జీలు పెరగడం   కారణమైంది. అలాగే టెక్నాలజీపై ఖర్చు పెంచినట్లు, అదే సమయంలో తమ సేవలు వినియోగించుకునే వ్యాపార సంస్థల సంఖ్యను పెంచుకునే యత్నాల్లో ఉన్నట్లు కంపెనీ వివరించింది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాక కంపెనీ ప్రకటించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలివి. పద్ధినిమిదవ తేదీన కంపెనీ షేర్లను స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేసింది. ఈ నెలలో ఐపీఓ ద్వారా పేటీఎం రూ. 18,300 కోట్లను సమీకరించింది. 

Advertisement
Advertisement