ఇది చాలా బాధ కలిగిస్తోంది: ఆంథోనీ ఫౌచీ

ABN , First Publish Date - 2021-08-03T17:35:21+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం చాలా బాధ కలిగిస్తోందని ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌచీ అన్నారు.

ఇది చాలా బాధ కలిగిస్తోంది: ఆంథోనీ ఫౌచీ

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం చాలా బాధ కలిగిస్తోందని ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌచీ అన్నారు. వైరస్ వ్యాప్తిని ఇప్పుడే కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇది మరింత విజృంభించే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా టీకాలు వేసుకోని వారి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడిలో ప్రధాన అస్త్రం టీకా మాత్రమేనని మరోసారి ఫౌచీ గుర్తు చేశారు. కనుక అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం అని తెలిపారు. మళ్లీ దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగితే మునుపటిలా లాక్‌డౌన్ ఆంక్షలు తప్పవని ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను హెచ్చరించారు. 


సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీపీ) వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం మాస్కు ధరించడం తప్పనిసరి అని చెప్పిన రోజుల వ్యవధిలోనే ఫౌచీ ఇలా కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గడిచిన కొన్ని రోజులుగా అగ్రరాజ్యంలో కొత్త కేసులు ఘణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీకాలు తీసుకోని వారి వల్లే భారీగా వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కోవిడ్ బారినపడుతున్నారనేది వారి వాదన. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారు వీలైనంత త్వరగా వేసుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో మహమ్మారి విజృంభణ తారస్థాయికి చేరి, మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.              

Updated Date - 2021-08-03T17:35:21+05:30 IST