మరింత స్వచ్ఛంగా..

ABN , First Publish Date - 2021-06-20T05:10:15+05:30 IST

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నూతన పారిశుధ్య విధానం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌-2016 క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా అన్ని పురపాలక సంఘాల్లో మూడు రకాల చెత్తను ప్రజల నుంచి సేకరించాలని నిర్ణయించింది.

మరింత స్వచ్ఛంగా..
చెత్తను సేకరిస్తున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు

స్వచ్ఛ పట్టణాల కోసం మూడంచెల విధానం 

8 నుంచి అమలుకు నిర్ణయం

సాలూరు, జూన్‌ 19: స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నూతన పారిశుధ్య విధానం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌-2016 క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా అన్ని పురపాలక సంఘాల్లో మూడు రకాల చెత్తను ప్రజల నుంచి సేకరించాలని నిర్ణయించింది. నూతన విధానంపై ఈ నెల 24 వరకు ప్రజలతో మాట్లాడుతూ ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించనుంది. పురపాలక సంఘాల్లో ప్రారంభించనున్న క్లాప్‌పై ఇప్పటికే అవగాహన సదస్సులు ప్రారంభించింది. తడి, పొడి చెత్తతో పాటు హానికరమైన చెత్తను కూడా సేకరించే విధానంపై పురపాలక సంఘాలు కరపత్రాలను సిద్ధం చేశాయి. కుళ్లిపోయే స్వభావం ఉన్న తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలోనూ, పొడి చెత్తను నీలిరంగు, హానికరమైన చెత్తను ఎరుపురంగు డబ్బాల్లో వేర్వేరుగా వేసి పురపాలక సంఘం పారిశుధ్య సిబ్బందికి అందజేయాలి. దీనిపై వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కుళ్లిపోయే స్వభావం కలిగిన కూరలు, మాంసం, చేపలు, కూరగాయల తొక్కు, కొబ్బరి బొండాలు,  టీ,కాఫీ పొడులు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ సంచులు, పాలిథిన్‌ కవర్లు, పాన్‌పరాగ్‌ వ్యాపర్లు, సబ్బు కవర్లు, బ్యాటరీలు ఇలా వ్యర్థాలన్నీ మూడు రకాల చెత్త బుట్టల్లో వేర్వేరుగా వేయాలి. బుట్టలను త్వరగా పంపిణీ చేసి జూలై 8 నుంచి కొత్త పారిశుఽధ్య విధానం అమలు చేస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నగర పాలక సంస్థతో పాటు పురపాలక సంఘాల్లో మూడు చెత్త డబ్బాల విధానంతో పాటు గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను నిర్మిస్తారు. చెత్తపై భారీగా పన్ను వేసిన ప్రభుత్వం ఆయా పురపాలక సంఘాల్లో నూతన పారిశుధ్య విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సచివాలయాల పరిధిలో కొత్త విధానంపై అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-06-20T05:10:15+05:30 IST