Abn logo
Jun 14 2021 @ 14:13PM

నేటి నుంచి మరిన్ని సడలింపులు

  • టీ షాపులు, ఈ-సేవా కేంద్రాలకు అనుమతి
  • సెలూన్లు, బ్యూటీపార్లర్ల ప్రారంభం


చెన్నై : కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా చెన్నై సహా 27 జిల్లాల్లో సోమవారం నుంచి కొత్త సడలింపులతో లాక్‌డౌన్‌ అమలులోకి రానుంది. ఈ లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, టీషాపులు, ఈ-సేవాకేంద్రాలు పనిచేయడానికి అనుమతిచ్చారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ అధికమవటంతో గత మే 10 నుంచి రెండు వారాలపాటు కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేశారు. ఈ కఠిన లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మే 24 నుంచి 31 వరకు, 31 నుంచి ఈనెల 7వ తేదీ వరకు సడలింపులతో లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మరో వారంపాటు మరికొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. 


కరోనా కేసులు అధికంగా ఉన్న కోయంబత్తూరు, నీలగిరి, తిరుప్పూరు, ఈరోడ్‌, కరూరు, నామక్కల్‌, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై జిల్లాల్లో తక్కువ సడలింపులతోనూ, తక్కిన 27 జిల్లాల్లో ఎక్కువ సడలింపులతోనూ సోమవారం నుంచి లాక్‌డౌన్‌ కొనసాగనుంది. చెన్నై సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు (ఉ.6 నుంచి సా. 5 గం. వరకు), టాస్మాక్‌ మద్యం దుకాణాలు (ఉ.10. నుంచి సా. 5. గం. వరకు), మిక్సీ, గ్రైండర్ల రిపేరు షాపులు, సెల్‌ఫోన్‌ రిపేరు షాపులు, మిక్సీ గ్రైండర్‌, టీవీలు విక్రయించే దుకాణాలు (ఉ. 9 నుంచి మ. 2గం. వరకు) పనిచేయనున్నాయి.


ఐటీ సంస్థలలో 20 శాతం ఉద్యోగులు మాత్రమే పనిచేయడానికి అనుమతించారు. ఈ సడలింపులకు తోడు రాష్ట్రమంతటా టీ దుకాణాలు, ఈ-సేవా కేంద్రాలను తెరిచేందుకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. టీ దుకాణాల్లో కస్టమర్లను అనుమతించకుండా పార్సిల్‌ విక్రయాలు మాత్రమే జరపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోయంబత్తూరు సహా 11 జిల్లాల్లో మద్యం దుకాణాలు, సెలూన్లు తెరిచేందుకు అనుమతించలేదు. ఎలక్ర్టీషియన్లు, ప్లంబర్లు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఈ-రిజిస్టర్‌తో ఇళ్ల వద్దకు వెళ్ళి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేయడానికి అనుమతించారు. కుమ్మర్లు, బైకు, కారు మెకానిక్‌లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు మట్టి పాత్రల తయారీ, వాహనాల మరమ్మతు పనులు చేపట్టేందుకు అనుమతించారు.


స్వీట్‌షాపులకు అనుమతి

చెన్నై సహా 27 జిల్లాల్లో సోమవారం నుంచి మిఠాయిల దుకాణాలు తెరిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతిం చింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మిఠాయిల దుకాణాలు, చేగోడీలు, పకోడీల దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. ఇక ప్రజల అవసరాల దృష్ట్యా ఈ-సేవా కేంద్రాలు కూడా సోమవారం నుంచి పనిచేయనున్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంబంధిత అన్ని రకాల సేవలు పొందటానికి ఈ -సేవాకేంద్రాలు దోహదపడతాయని పేర్కొన్నారు.