Abn logo
Jul 31 2021 @ 02:19AM

విలీనం పేరుతో 300 బడుల మూత

కొత్త చదువుల    గందరగోళం

చిత్తూరు(సెంట్రల్‌), జూలై 30: వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో చేపడుతున్న మార్పులు విద్యార్థులు, టీచర్ల పాలిట శాపంగా మారబోతున్నాయి. నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ) అమలుపై ఆగమేఘాల మీద కసరత్తు జరుగుతోంది. ఇందువల్ల జిల్లాలో దాదాపు 300 ప్రాథమిక పాఠశాలలు మూసేయబోతున్నారు. ప్రాథమిక పాఠశాలకు 250 మీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలగానీ, ఉన్నత పాఠశాలగానీ ఉంటే ఆ ప్రాథమిక బడిలోని 3,4,5 తరగతులను పై బడుల్లో విలీనం చేస్తారు. ఇట్లాంటి బడులు జిల్లాలో 250 నుంచి 300 వరకు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర అధికారులకు పంపారు.పైలట్‌ ప్రాజెక్టు కింద 10 నుంచి 20 బడులను తొలుత ఎంపిక చేసి ఆ పాఠశాలల్లో విలీనం విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఈ ప్రక్రియ ఆగస్టు 10వ తేదీలోపు పూర్తి  చేయనున్నారు. విలీనం చేసిన పాఠశాలల్లో  టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఆగస్టు 15లోపు పూర్తి చేస్తారు. సింగిల్‌ మీడియం అజెండాగా చేపట్టే ఈ ప్రక్రియలో తరగతికి ఒక టీచర్‌ చొప్పున తొలుత డిప్యుటేషన్‌, ఆపై రేషనలైజేషన్‌ విధానంలో నియమిస్తారు. కాగా ఎన్‌ఈపీ ద్వారా విలీనమైన బడులకు రెండో విడత నాడునేడులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో పాటూ ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికే వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనతో ఉన్నాయి. దీంతో విలీన ప్రక్రియ వివరాలను బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.