కరోనా.....1004

ABN , First Publish Date - 2021-05-06T07:14:25+05:30 IST

జిల్లాలో గతేడాది మే నుంచీ ఇప్పటి వరకూ సంభవించిన కొవిడ్‌ మరణాలు సరిగ్గా ఏడాది వ్యవధిలో వెయ్యి దాటేశాయి.

కరోనా.....1004

జిల్లాలో వెయ్యి దాటిన కొవిడ్‌ మరణాలు

సెకండ్‌ వేవ్‌లో 154 మందిని బలిగొన్న కరోనా

తాజాగా 1756 పాజిటివ్‌ కేసుల నిర్ధారణ

కరోనాతో మదనపల్లెలో భార్యాభర్తలు..

సత్యవేడు హెడ్‌నర్సు, చిత్తూరు అర్బన్‌ హౌసింగ్‌ ఏఈలు మృతి

తిరుపతి రుయాలో 21 కొవిడ్‌ మృతదేహాలకు ఎమ్మెల్యే అంత్యక్రియలు

మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో రెమిడెసివర్‌ ఇంజక్షన్ల కొరత

రేణిగుంటలో కొవిడ్‌ బెడదతో మూతపడిన ఐవోబీ

కుప్పం షాహీ గార్మెంట్స్‌లో మహిళా కార్మికుల ఆందోళన


తిరుపతి, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గతేడాది మే నుంచీ ఇప్పటి వరకూ సంభవించిన కొవిడ్‌ మరణాలు సరిగ్గా ఏడాది వ్యవధిలో వెయ్యి దాటేశాయి. బుధవారం ఉదయానికి జిల్లాలో కొవిడ్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1004కు చేరుకుంది. జిల్లాలో గతేడాది మే నెలలో తొలి కరోనా మరణం నమోదైన సంగతి తెలిసిందే. ఆ నెలలో కేవలం ఇద్దరు మాత్రమే వైరస్‌ బారిన పడి మరణించగా తొలి దశలో గతేడాది చివరి వరకూ 850 మంది బలయ్యారు. సెకండ్‌ వేవ్‌గా పరిగణిస్తున్న ఈ ఏడాది విషయానికొస్తే జనవరిలో ఆరుగురు, ఫిబ్రవరిలో ఇద్దరు, మార్చిలో 18 మంది, ఏప్రిల్‌లో 109 మంది చనిపోయారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 21 మంది మృతి చెందారు. కాగా గడచిన 24 గంటల్లో మరో 1756 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే వ్యవధిలో వైరస్‌ బారిన పడి మరో ఆరుగురు మృతి చెందారు. తాజా కేసులతో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 130885కు చేరుకోగా బుధవారం ఉదయానికి యాక్టివ్‌ పాజిటివ్‌ల సంఖ్య 19400కు చేరింది. కొత్తగా గుర్తించిన కేసులు తిరుపతి నగరంలోనే 247, తిరుపతి రూరల్‌లో 143 వున్నాయి. మదనపల్లె మండలంలో 95, చిత్తూరులో 69, పుంగనూరులో 65, బంగారుపాలెంలో 62, చంద్రగిరిలో 61, ఏర్పేడులో 45, పలమనేరులో 42, కుప్పంలో 41, పీలేరులో 38, ఎర్రావారిపాలెంలో 37, శాంతిపురంలో 34, రామకుప్పంలో 33, పుత్తూరు, తంబళ్లపల్లె, గంగవరం మండలాల్లో 32 చొప్పున, రేణిగుంట, కేవీపల్లె మండలాల్లో 31 చొప్పున, బైరెడ్డిపల్లెలో 30, తవణంపల్లెలో 27, పెద్దపంజాణిలో 26, ములకలచెరువులో 25, కార్వేటినగరం, రొంపిచెర్ల, శ్రీకాళహస్తి మండలాల్లో 24 వంతున, చిన్నగొట్టిగల్లు, కలికిరి మండలాల్లో 23 వంతున, నగరి, పాకాల, పులిచెర్ల మండలాల్లో 20 చొప్పున, వెదురుకుప్పంలో 18, పీటీఎంలో 17, సోమల, శ్రీరంగరాజపురం మండలాల్లో 16 వంతున, జీడీనెల్లూరు, గుడుపల్లె మండలాల్లో 15 వంతున, కలకడ, సదుం మండలాల్లో 14 చొప్పున, బి.కొత్తకోట, వడమాలపేట మండలాల్లో 12వంతున, బీఎన్‌ కండ్రిగ, వి.కోట మండలాల్లో 10 చొప్పున, సత్యవేడులో 9, గుడిపాల, పాలసముద్రం మండలాల్లో 8 వంతున, రామచంద్రాపురం, రామసముద్రం, తొట్టంబేడు మండలాల్లో 7 వంతున, గుర్రంకొండ, పెద్దమండ్యం, పూతలపట్టు మండలాల్లో 6 వంతున, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో 5 చొప్పున, ఐరాల, కురబలకోట మండలాల్లో 4 చొప్పున, కేవీబీపురం, నిమ్మనపల్లె, విజయపురం మండలాల్లో 3 చొప్పున, చౌడేపల్లె, పెనుమూరు మండలాల్లో 2 వంతున, నారాయణవనం, వరదయ్యపాలెం, యాదమరి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.


కరోనాతో దంపతుల మృతి

పెద్దమండ్యం మండలం కురవపల్లెకు చెందిన దంపతులుకావలి నారాయణ (65), పాపులమ్మ (60)  20 ఏళ్ళుగా మదనపల్లెలో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు కొడుకులు. పది రోజుల కిందట పాపులమ్మకు కరోనా సోకింది. వారంగా ఆమె పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఎక్కడా ఆక్సిజన్‌ బెడ్డు దొరక్కపోవడంతో ఇంట్లోనే వుంచి చికిత్స చేయిస్తున్నారు. ఆ క్రమంలో భర్త నారాయణ కూడా అవే లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యాడు. బుధవారం వేకువజామున 4.30 గంటలకు పాపులమ్మ మరణించగా కుమారులు ఆమె మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో స్వగ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసి తిరిగి మదనపల్లెకు చేరుకునే సరికి తండ్రి నారాయణ కూడా మృతి చెందారు.దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


సత్యవేడులో హెడ్‌నర్సు, చిత్తూరులో అర్బన్‌ హౌసింగ్‌ ఏఈ ....

సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలో హెడ్‌ నర్సుగా పనిచేస్తుండిన షంషాద్‌ బేగం కొవిడ్‌ బారిన పడ్డారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. అలాగే నగరి మున్సిపల్‌ కార్యాలయంలో అర్బన్‌ హౌసింగ్‌ ఏఈగా పనిచేస్తూ ఇటీవలే చిత్తూరు ప్రధాన కార్యాలయానికి బదిలీ అయిన సుబ్రమణ్యం కరోనాతో తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బుధవారం మృతి చెందారు. రేణిగుంటలో సిబ్బందికి కరోనా సోకడంతో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు మూతపడింది. శ్రీకాళహస్తిలో ముక్కంటి దేవస్థానం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఇద్దరు వృద్ధులకు కరోనా సోకింది.


Updated Date - 2021-05-06T07:14:25+05:30 IST