ఈ వీడియోకు అయిదు మిలియన్లకు పైగా వ్యూస్...

ABN , First Publish Date - 2021-10-24T05:30:00+05:30 IST

చీమలు మనకెన్నో విషయాల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. కలిసికట్టుగా వెళ్లడం, ఫుడ్ తెచ్చుకుని పొదుపు చేసుకోవడం, విరామమెరుగక పని చేయడం తదితర అంశాలను చీమలు మనకు నేర్పుతాయి.

ఈ వీడియోకు అయిదు మిలియన్లకు పైగా వ్యూస్...

హైదరాబాద్ : చీమలు మనకెన్నో విషయాల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.  కలిసికట్టుగా వెళ్లడం, ఫుడ్ తెచ్చుకుని పొదుపు చేసుకోవడం, విరామమెరుగక పని చేయడం తదితర అంశాలను చీమలు మనకు నేర్పుతాయి. ఇక విషయానికొస్తే... తాజాగా ఓ వ్యక్తి మూడు చీమలకు సంబంధించిన ఓ 16 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన వారికెవరికైనా ఓ సందేహం రాకమానదు. ఆరు నెలల సావాసం చేస్తేనే వారు... వీరైతే... కొన్ని శతాబ్దాలుగా చీమలు కూడా మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. మరి మన బుద్దులు కాస్తో కూస్తో వాటికి అబ్బకుండా ఉంటాయా ? అన్నట్టుగా ఆ వీడియో ఉంది. బెన్ ఫిలిప్స్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఐదు మిలియన్ల మందికి పైగా చూశారు. ఇక దీనిపై కామెంట్లు, సెటైర్స్‌కు కొదవ లేదు.  


ఆ వీడియోలో ఏముందంటే.. 

మూడు చీమలు ఒక ఇనుప రాడ్‌పై నుంచి దానిపైనున్న రాడ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఆ ఆకు కాస్త ఎత్తులో ఉండటంతో చివరకు ఒక చీమ తాను నిలబడి, తన మీదుగా రెండు చీమలను ఆకుపైకి ఎక్కించేస్తుంది. ఆ తరువాత ఆ రెండు చీమలు తమను ఆకుపైకి ఎక్కించిన చీమ కనీసం చూడకుండా వెళ్లిపోతాయి. కింద నుంచి చీమ సాయం కోసం పైకి అలాగే చూస్తూ ఉండిపోయింది. 


ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆ చీమ ఎంతగా బాధపడిందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల నుంచి చీమలు కూడా నేర్చుకుంటున్నాయని.. అవి కూడా వాడుకుని వదిలేస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు. అవసరం తీరాక మనిషైనా, ఇతర జీవులైనా ఒకటేనని ఈ వీడియో నిరూపించిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో... నైతికతతో పాటు, భావాల సంగతిని పక్కనపెడితే ఎన్నో పాఠాలు, గుణపాఠాలను నేర్పుతోందనడంలో సందేహం లేదు కదా..!

Updated Date - 2021-10-24T05:30:00+05:30 IST