ఐదేండ్లు దాటినా అడ్రస్ లేని ‘పాలమూరు-– రంగారెడ్డి’

ABN , First Publish Date - 2020-06-19T05:39:45+05:30 IST

దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీరుతెన్నులు ఒకసారి చూస్తే అసలు లక్ష్యాలు నెరవేరుతున్నాయా లేక ప్రాజెక్టు ఉనికే ప్రమాదంలో పడిందా అనే సందేహాలు తలెత్తున్నాయి...

ఐదేండ్లు దాటినా అడ్రస్ లేని ‘పాలమూరు-– రంగారెడ్డి’

పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వచ్చే నాలుగు సంవత్సరాలలోనైనా తెరాస ప్రభుత్వం పూర్తి చేయాలనుకుంటున్నదా? ఈ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పరిణామాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే, కృష్ణా బేసిన్‌కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటే పాలమూరుతో పాటు లబ్ధిదారులైన రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి శ్రేయస్కరం.


దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీరుతెన్నులు ఒకసారి చూస్తే అసలు లక్ష్యాలు నెరవేరుతున్నాయా లేక ప్రాజెక్టు ఉనికే ప్రమాదంలో పడిందా అనే సందేహాలు తలెత్తున్నాయి. ఈ పథకం లబ్ధి దారులు ప్రధానంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలు. పాలమూరులో 6.71 లక్షల ఎకరాలకు, రంగారెడ్డిలో 5.30 లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాలో 1.23 లక్షల ఎకరాలకు సాగు నీళ్లిచ్చే లక్ష్యంతో రూ. 35,200 కోట్ల అంచనా వ్యయంతో, 2015 జూన్‌ 11న దేవరకద్ర నియోజకవర్గం కరివెన దగ్గర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన నాడు పాలమూరు ప్రజలకు కెసిఆర్ మూడు సంవత్సరాలలోపే నీళ్లు తెచ్చి చూపిస్తా అని బహిరంగంగా మాట ఇచ్చారు. ఇప్పటివరకు ప్రాజెక్టు మొత్తంగా పదిశాతం పనులు కూడా పూర్తి చేయలేదు. ఉదండాపూర్ రిజర్వాయర్ దాటినాక కెనాల్ పనులకు గాని, టన్నెల్ పనులకు గాని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులకు గాని, మొత్తం ప్రాజెక్టులో నీళ్లిచ్చే కాలువలకు కనీసం టెండర్లు కూడా పిలవలేదు. ఇక రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీళ్లిచ్చే ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు, రిజర్వాయర్ పనులకు టెండర్లు పిలవలేదు. ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 3,854 ఎకరాల భూసేకరణ చేయాల్సివుంది.


ఐదు సంవత్సరాలు గడిచినా, కనీసం కరివెన వరకు 30% పనులు కూడా పూర్తిచేయలేదు. గెస్ట్ హౌజ్ కట్టుకొని, కుర్చీవేసుకొని కూసోని, పదిహేనురోజులకొకసారి వచ్చి ఇక్కడే నిద్రగూడా పోతా! అన్న కెసిఆర్ గడిచిన ఐదేళ్ళలో ఒకే ఒక్కసారి వచ్చారు. హన్వాడ మండలం హేమసముద్రం కాడ 10టీఎంసీల ప్రాజెక్టును కడతామని చెప్పిన కెసిఆర్ దాని ఊసెత్తట్లేదు. భూనిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం, సర్కారు జీతం అన్న కేసీఆర్ ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. భూమికి - భూమి ఎకరం ఎన్ని లక్షలకైనా కొంటానన్న సీఎం గజం భూమి కొనలేదు. పాలమూరు ప్రజల సమక్షంలో తానే స్వయంగా ప్రాజెక్టు డిజైన్ చేశానని కేసీఆర్‌ చెప్పారు. మరి, మొదటి పంపుహౌజ్ ఉపరితల పంప్ హౌజ్ గా నిర్ణయించి, ఇప్పుడు భూగర్భ పంపుహౌజ్‌గా ఎన్నివందల కోట్ల కమిషన్ కోసమని మార్చారని రాజకీయవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆయనే చేసిన ప్రాజెక్టు డిజైన్ ఈ రోజు మార్చవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రజలు అడుగుతున్నారు. గడిచిన ఐదేళ్ళలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఖర్చు చేసింది రూ.7,000 కోట్లు మాత్రమే. పనులు ఆలస్యమైనందువల్ల, అంచనా వ్యయం రూ .35,200 కోట్ల నుండి అమాంతం దాదాపు రూ.65,000 కోట్లకు పెరిగింది. పెరిగిన అంచనా వ్యయం రూ. 30,000 కోట్లు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలపై భారం కానుంది. 


నీటి కేటాయింపుల్లో కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించిన 30 వరదదినాలను కుట్రలో భాగంగానే 60 వరద దినాలకు మార్చారు. అసలు మొత్తం ప్రాజెక్టుకు కావాల్సిన నీరు 145 టీఎంసీలు. అందులో 120 టీఎంసీలు 12.3 లక్షల ఎకరాల సాగుకోసం. 20 టీఎంసీ హైదరాబాదు నగర తాగునీటి అవసరాలకు. 5 టీఎంసీ దారిలో ఉండే గ్రామాలు, పరిశ్రమల అవసరాలకు. కానీ ఇందులో జీవో 105 ద్వారా మొత్తంగా కేటాయించింది కేవలం 90 టీఎంసీ మాత్రమే. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చిన ముప్పై రోజులకే వరద నీటి లభ్యత కష్టం అనుకుంటే, వాస్తవానికి దూరంగా ఇలా వరద దినాలను 60కి పెంచి ప్రాజెక్టు సామర్ధ్యాన్ని రోజుకు 1.5 టీఎంసీకి కుదించడం పాలమూరును ఎడారిగా మార్చే కుట్రగానే భావించాలి. అసలు వాటా నీరే ఇలా తక్కువగా కేటాయించడంతో  పాటు, ఈ ప్రాజెక్టు నుండి డిండి ప్రాజెక్టుకు ప్రతీ రోజు 0.5 టీఎంసీ నీరు ఇచ్చే మరో కుట్రకు కేసీఆర్‌ తెరలేపారు. మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రులు, శాసన సభ్యులు, జిల్లా నాయకులందరూ కలిసి నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ప్రత్యేకంగా చేయాలని విన్నవించినా కూడా కేసీఆర్ తన కుట్రలు కొనసాగిస్తూ 24--–-09–-2016న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే 0.5 టీఎంసీలు తరలించమని జీవో 806 జారీ చేశారు. కుట్రకు ప్రధాన సాక్ష్యం ఇదే. మహబూబ్ నగర్ టీఆర్‌ఎస్‌ నాయకులు 22–-02-–2016 నాడు కెసిఆర్‌కు ఒక ఉత్తరం రాసి పాలమూరుకు రోజుకు 3 టీఎంసీలు పెంచాలని విన్నవిస్తే ‘అసెంబ్లీలో అడిగినట్టు పెంచుదాం’ అని చెప్పారు కెసిఆర్‌. అలా పెంచకపోగా, మొన్న ఏప్రిల్‌ 8న ప్రభుత్వం ఒక టీఎంసీకి కుదించమని చీఫ్ ఇంజనీర్ గారిని ప్రభుత్వం ఆదేశించింది. 


2019–-2020 సంవత్సరానికి గాను కృష్ణానది జలాల బోర్డు నిర్ణయించిన ప్రకారం తెలంగాణకు నీటి కేటాయింపులు 333 టీఎంసీలు. వాస్తవానికి వాడుకున్నది 273 టీఎంసీలు మాత్రమే. హక్కులో భాగంగా వచ్చే నీటిలోనే కెసిఆర్  అసమర్థత వల్ల 60 టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ కేటాయింపులకంటే ఎక్కువ నీటిని వాడుకుంటూ, కొత్తగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 80వేల క్యూసెక్కులకు పెంచుకుంటూ, సంగమేశ్వరం వద్ద రాయలసీమ పంపింగ్ సిస్టం ద్వారా రోజుకు మరో 3 టీఎంసీలు ఎత్తిపోస్తూ మొత్తంగా రోజుకు 10 టీఎంసీల జల దోపిడీకి కుట్రలు పన్నుతున్నది. ఇందుకు భిన్నంగా కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల సామర్థ్యాన్ని రోజుకు 1 టీఎంసీగా తగ్గిస్తూ అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయానికి పరిష్కారంగా పాలమూరు-రంగారెడ్డి పథకంలో రోజూకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలని, వెంటనే నిధులు విడుదల చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, జూరాలను ఆధారంగా చేసుకొని 30 వరద దినాలకుగాను రోజుకు 5 టీఎంసీల చొప్పున 150 టీఎంసీలు తోడుకునేలా కొత్త ప్రాజెక్టులు రూపకల్పన చేయాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు డిండికి సంబంధం లేకుండా నీటి కేటాయింపులు చేయాలన్న డిమాండ్ ప్రజల్లో బలంగా మొదలైంది. 


ఇక, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ లిమిటెడ్ ఏర్పాటు ఆధారంగా నిధుల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాలను పరిశీలిద్దాం. కాళేశ్వరం మరియు పాలమూరు ఉమ్మడి ప్రాజెక్టుల రుణ సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ లిమిటెడ్ (KIPCL). కానీ ఉమ్మడి ప్రాజెక్టుల కోసమని పొందిన రుణం మొత్తం రూ 30,000 కోట్లలో పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించింది రూ 1,250 కోట్లు మాత్రమే. అంటే కేవలం 4 శాతం. ఈ విధంగా, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుపై తెరాస ప్రభుత్వానికి ఉన్న సవతి తల్లి ప్రేమ స్పష్టమవుతోంది. తెచ్చిన రుణం కూడా బడ్జెటేతర రుణాల కింద 11 శాతం వడ్డీతో తెచ్చారు. ఇంత అధిక వడ్డీతో దేశంలో ఏ ప్రభుత్వ సంస్థా రుణం తీసుకోదు. అసలు కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో, ఏ నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపు జరిపారు, ఎంత శాతం నిధులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసమని రుణం ఇచ్చే సంస్థలకు తెలిపారో ప్రజలకు స్పష్టం చేయాలి. KIPCL ఏర్పాటు ప్రక్రియ, రుణ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను వచ్చే అసెంబ్లీలో బహిర్గతం చేయాలి. పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వచ్చే నాలుగు సంవత్సరాలలోనైనా తెరాస ప్రభుత్వం పూర్తి చేయాలనుకుంటున్నదా? 


మూడు సంవత్సరాలలో కరివెన పనులు పూర్తి చేస్తామని చెప్పిన కెసిఆర్  ఐదేళ్ళయినా చేయలేకపోయారు కాబట్టి వెంటనే పాలమూరు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ముఖ్యమంత్రిగా బహిరంగ సభలో ప్రకటించిన పనులను సరిపడా నిధులున్నా పూర్తి చేయని సీఎంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట తప్పి కెసిఆర్ మరోసారి విశ్వసనీయత కోల్పోయారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉండికూడా పాలమూరు ప్రజలకు ద్రోహం తలపెట్టడం సిగ్గుచేటు. పాలమూరు నుండి గెల్చిన ముఖ్యమంత్రి గారి వ్యవహారమే ఈ విధంగా ఉన్నప్పుడు ఆ జిల్లా ప్రజల, రైతుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుందనేది నగ్నసత్యం. పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పరిణామాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే, కృష్ణా బేసిన్‌కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటే పాలమూరుతో పాటు లబ్ధిదారులైన రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి శ్రేయస్కరం. కృష్ణా బేసిన్‌కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రజలను మమేకం చేస్తూ పోరాటానికి దిగుతాము.

చల్లా వంశీచంద్ రెడ్డి

మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి

Updated Date - 2020-06-19T05:39:45+05:30 IST