అమిత్ షాతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా భేటీ

ABN , First Publish Date - 2021-10-06T19:47:40+05:30 IST

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కేంద్ర హోం

అమిత్ షాతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మిశ్రా కుమారుడు ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతుల మరణాలకు కారణమైనట్లు ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. మిశ్రా తన పదవికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.


ఇదిలావుండగా అజయ్ మిశ్రా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తాను ఎటువంటి ఒత్తిడిలోనూ లేనని తెలిపారు. ఈ కేసుపై విచారణ జరుపుతామని, కుట్ర పన్నినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మౌర్య లఖింపూర్ ఖేరీ పర్యటనను నిరసిస్తూ ఆదివారం రైతులు నిరసన తెలిపారు. ఆ సమయంలో నిరసనకారులపై నుంచి ఓ కారు దూసుకెళ్ళడంతో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఈ కారులో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన హత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. అయితే ఆయనను అరెస్టు చేయలేదు. ఆ కారు తనదేనని అజయ్ మిశ్రా అంగీకరించారు. అయితే సంఘటన స్థలంలో తాను కానీ, తన కుమారుడు కానీ లేనట్లు చెప్తున్నారు. 


అమిత్ షాను కలవడానికి ముందు అజయ్ మిశ్రా బుధవారం నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయంలో సుమారు అర గంట సేపు గడిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అధికారిక పనులు చేసిన తర్వాత ఆయన తన కార్యాలయం నుంచి వెళ్ళిపోయినట్లు తెలిపాయి. 


Updated Date - 2021-10-06T19:47:40+05:30 IST