దోమా.. దోమా.. చంపొద్దే!

ABN , First Publish Date - 2021-03-03T07:05:08+05:30 IST

స్వచ్ఛ బెజవాడ నినాదాలకే పరిమితమయింది. మురుగు ముంగిట్లో పేరుకుపోతోంది.

దోమా.. దోమా.. చంపొద్దే!
నగరంలోని ఈఎస్‌ఐ సమీపంలో దోమల ఆవాస కేంద్రంగా మారిన డ్రెయిన్‌

నగరంలో పెరిగిపోతున్న దోమలు

ఉత్పత్తి కేంద్రాలు కాల్వలే

నివారణకు నెలకు రూ.4కోట్లకు పైగా ఖర్చు

వీఎంసీ ఖర్చు ఏడాదికి రూ.కోటి 

అవినీతి ఊబిలో అధికారులు

నాయకుల్లో ఉదాసీనత

పారిశుధ్యంపై దృష్టి సారించని సిబ్బంది


స్వచ్ఛ బెజవాడ నినాదాలకే పరిమితమయింది. మురుగు ముంగిట్లో పేరుకుపోతోంది. యూజీడీ నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ఇంట్లో పనిచేసుకుంటున్నా... కూర్చుని టీవీ చూస్తున్నా.. పిల్లలను చదివిస్తున్నా... బ్యాటింగ్‌ తప్పని సరి అయిపోయింది. ఈ బ్యాటింగ్‌ ఆట కాదు. స్వైర విహారం చేస్తున్న దోమలపై సామాన్యులు చేసే బ్యాటింగ్‌. నగర పౌరులకు లేని స్వేచ్ఛ దోమలకు దొరికింది. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల నాయకులు.. దోమల నివారణ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకునే అధికారులు బెజవాడను దోమల నగరంగా మార్చేశారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/చిట్టినగర్‌)

68.73 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విజయవాడ నగరంలో 2.09 లక్షలకుపైగా ఆవాసాలు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం సుమారు కోటీ 82 లక్షల గ్యాలన్ల వాడకపు నీరు డ్రెయినేజీల్లోకి చేరుతోంది. దీనికితోడు నిత్యం 200 టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలు మురుగు కాల్వల్లోకి చేరుతున్నాయని అంచనా. ఇదంతా ఒక ఎత్తు కాగా, మురుగుకాల్వల్లోరోజుకు కొన్ని వందల కిలోల సిల్టు పోగవుతోంది. నిత్యం కాల్వలను శుభ్రపరచాల్సిన వీఎంసీ సిబ్బంది పనులు జరుగుతున్నట్టు రికార్డుల్లో రాసుకోవడానికే పరిమితమవుతున్నారు. ఫలితంగా చెత్త, వ్యర్థాలతో పేరుకుపోతున్న డ్రెయినేజీలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. 


దోమల నివారణకు రూ.4కోట్లు వ్యయం!

దోమ బతికేది 20 నుంచి 30 రోజులు.. ఈ అల్పప్రాణి నగరవాసులతో చెడుగుడు ఆడేస్తోంది. దోమ దెబ్బ ఎలాంటిదో విజయవాడ నగరవాసులకు తెలుసు. నగరంలో ప్రతి కుటుంబం సగటున నెలకు రూ.100 నుంచి 300 వరకు దోమల నుంచి రక్షించుకునేందుకే ఖర్చు చేస్తున్నారు. నగరంలో సుమారు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయనుకుంటే నెలకు నగరవాసులు చేసే ఖర్చు రూ.2 నుంచి 4 కోట్లు వరకు ఉంటుంది. వీటికి తోడు నగరంలో దోమల నివారణకు నగరపాలక సంస్థ ప్రతియేటా సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తోంది. దోమల మందులు ఎబెట్‌, ఎంఎల్‌ ఆయిల్‌, తదితరాలను కొనుగోలు చేసి పిచికారీ చేస్తోంది. అలాగే 325 మంది మలేరియా సిబ్బంది యాంటిలార్వా ఆపరేషన్‌ పనులు చేపడుతున్నా, ఫాగింగ్‌, పవర్‌ స్ర్పే పనులు ఓ ప్రణాళిక ప్రకారం లేకపోవడంతో యాంటీ లార్వా పనులు అంత ఫలితాన్ని ఇవ్వడంలేదు. 


సర్వం దోమల మయం

నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ దోమలు దడ పుట్టిస్తున్నాయి. నగరంలో సుమారు 35 ప్రాంతాలను సమస్యాత్మాక ప్రాంతాలుగా మలేరియా విభాగం గుర్తించింది. చిట్టినగర్‌, కొత్తపేట, విద్యాధరపురం. అయ్యప్పనగర్‌, సింగ్‌నగర్‌, పాయకాపురం, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించి చర్యలు చేపడుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు.


ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం 

ఎప్పటికప్పడు యాంటి లార్వా ఆపరేషన్‌ పనులు చేపడుతున్నాము. డ్రైయిన్లలో పవర్‌ స్ర్పే, ఫాగింగ్‌, నీరు నిల్వ ప్రాంతాలను పరిశీలించి ఫైరత్రం స్ర్పేయింగ్‌, డ్రెయిన్లలో ఆయిల్‌ బాల్స్‌ వదులుతున్నాం. నవంబర్‌ - జనవరి మధ్య చల్లదనం కారణంగా దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి దోమలు తగ్గిపోతాయి.     - ఎండి.ఇక్బాల్‌, బయాలజిస్ట్‌, వీఎంసీ



Updated Date - 2021-03-03T07:05:08+05:30 IST