Advertisement
Advertisement
Abn logo
Advertisement

మనుషుల్ని చూడలేని డబుల్‌ మ్యుటెంట్‌ దోమలు!

ఎడిస్‌ ఈజిప్టై దోమలపై అమెరికా శాస్త్రజ్ఞుల ప్రయోగం

న్యూయార్క్‌: డెంగీ, ఎల్లోఫీవర్‌ వంటి జ్వరాలకు కారణమైన వైర్‌సలను వ్యాపింపజేస్తూ, ఏటా కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్న ఎడిస్‌ ఈజిప్టై దోమలు.. మనుషుల్ని అసలు గుర్తించలేకపోతే? ఎదురుగా ఉన్నా మనపై వాలి కుట్టకపోతే? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అమెరికాకు చెందిన క్యాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు దీన్ని సాధ్యం చేశారు. ఆ రకం దోమల్లో రెండు జన్యుమార్పులు చేయడం ద్వారా.. అవి తమ చుట్టూ మనుషులు ఉన్నా గుర్తించలేని విధంగా వాటిలోని కాంతిని గ్రహించే ప్రొటీన్లను తొలగించారు. వారు ఈ ప్రయోగాలు చేయడానికి దోమల లక్షణాలనే లక్ష్యంగా చేసుకున్నారు. అవేంటంటే.. దోమలు సాధారణంగా కొందరిని మాత్రమే ఎక్కువగా కుడతాయి. ఉదాహరణకు ఒక గుంపులో ఉన్న నలుగురైదుగురు వ్యక్తుల్లో ఒకరిద్దరినే ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే.. మన శ్వాస నుంచి వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌, మన శరీర ఉష్ణోగ్రత, ఆర్ద్రత, శరీరం నుంచి వచ్చే దుర్వాసన, ధరించే దుస్తులు.. ఇలా దోమ కాటు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా దోమలు మన శ్వాస నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌కు ఆకర్షితమై మనదగ్గరకు వచ్చేస్తాయి. వేడి, దుర్వాసన వంటివి దానికి అదనపు సంకేతాలు. ఇవేవీ లేనప్పుడు అవి ఎక్కువగా.. ముదురు రంగు దుస్తులకు ఆకర్షితమై వాటిని ధరించినవారిపై వాలి కుడతాయి. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు 1937లోనే గుర్తించారు. క్యాలిఫోర్నియా వర్సిటీ పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చర్‌ ఇన్‌పెంగ్‌ ఝాన్‌, న్యూరోబయాలజిస్ట్‌ క్రెగ్‌ మోంటెల్‌ దీని ఆధారంగానే తన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దోమలు ముదురు రంగు దుస్తులు ధరించినవారిపై ఎక్కువగా వాలడానికి కారణం.. వాటిలో ఉండే ఐదు లైట్‌ సెన్సింగ్‌ రిసెప్టార్లలో ఏదో ఒకటి అయి ఉంటుందనే ఊహతో ప్రయోగాన్ని ప్రారంభించారు. తొలుత రోడోప్సిన్‌ ప్రొటీన్‌ ఓపీ1ను.. క్రిస్పర్‌-కాస్‌ 9 అనే జీన్‌ ఎడిటింగ్‌ విధానం ద్వారా తొలగించారు. అది దోమల చూపునకు సంబంధించి కీలకమైన ప్రొటీన్‌. అనంతరం, ఆ మ్యుటేషన్‌ను వేలాది దోమల గుడ్లలోకి ఇంజెక్ట్‌ చేశారు. తద్వారా ఓపీ 1 ప్రొటీన్‌లేని దోమలు తయారయ్యాయి. 

కానీ, ప్రయోగంలో భాగంగా వాటిని ఒక కేజ్‌లోకి వదిలి, గట్టిగా శ్వాస వదిలితే (కార్బన్‌ డయాక్సైడ్‌కు ఆకర్షితమై) నేరుగా వెళ్లి అక్కడ ఉన్న నల్ల రంగు చుక్కపై వాలాయి. పక్కనే ఉన్న తెల్ల రంగు చుక్కపై ఏదీ వాలలేదు. దీంతో వారు రోడోప్సిన్‌ ప్రొటీన్‌ ఓపీ2ను తొలగించి మళ్లీ అదే ప్రయోగం చేశారు. ఈసారి కూడా దోమలన్నీ నలుపు చుక్కపైనే వాలాయి. మూడోసారి.. రెండు ప్రొటీన్లనూ తొలగించి ప్రయోగం చేయగా.. అవి ఏ చుక్కపైనా వాలకుండా గాల్లోనే అయోమయంగా తిరగడం ప్రారంభించాయి. అప్పుడు శాస్త్రజ్ఞులకు.. ‘‘అవి పూర్తిగా గుడ్డివి అయ్యాయా? లేక మనుషులను మాత్రమే గుర్తించలేకపోతున్నాయా?’’ అనే అనుమానం వచ్చింది. దీన్ని నిర్ధారించుకోవడానికి మరో మూడు పరీక్షలు చేయగా.. మూడింటిలోనూ అవి చూడగలవనే తేలింది. దీంతో తమ ప్రయోగం విజయవంతమైందని వారికి అర్థమైంది. దీంతో.. ‘‘ఇవి మా తొలి ట్రాన్స్‌జెనిక్‌ దోమలు’’ అని వారు ప్రకటించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement