అన్నింటికన్నా ఆకాశం మిన్న

ABN , First Publish Date - 2020-09-23T06:46:16+05:30 IST

ఆత్మజ్ఞానం కోసం సనత్కుమారుని వద్దకు వెళ్లిన నారదునికి.. నామ జ్ఞానం కంటే గొప్పది వాక్కు, వాక్కు కంటే గొప్పది మనసు, మనసు కంటే గొప్పది సంకల్పం అని ఆ

అన్నింటికన్నా ఆకాశం మిన్న

ఆత్మజ్ఞానం కోసం సనత్కుమారుని వద్దకు వెళ్లిన నారదునికి.. నామ జ్ఞానం కంటే గొప్పది వాక్కు, వాక్కు కంటే గొప్పది మనసు, మనసు కంటే గొప్పది సంకల్పం అని ఆ మహర్షి బోధించాడు. సంకల్పం కన్నా గొప్పది ఇంకేదైనా ఉందా అని నారదుడు ప్రశ్నించగా.. ‘‘సంకల్పం కంటే చిత్తం గొప్పది. ఒక వస్తువును మొదటిసారిగా చూసినప్పుడు దాని యొక్క జ్ఞానం చిత్తంలో ఏర్పడుతుంది. ఇది తెలివికి సంబంధించినది. ఆ విషయాన్ని ఆలోచించినప్పుడు సంకల్పం కలుగుతుంది. కాబట్టి సంకల్పం, మనసు, వాక్కు మొదలగు వానికి చిత్తమే ఆధారం. చిత్తమే అనుభూతి’’ అని తెలిపాడు.


అప్పుడు నారదుడు.. ‘చిత్తం కంటే శ్రేష్ఠమైనది ఏది’ అని ప్రశ్నించగా.. ‘‘చిత్తం కంటే ధ్యానం మిన్న. చిత్తం యొక్క అనుభూతులు అనేకం. ఽకానీ, ద్యానం యొక్క అనుభూతి ఒకటే. ఒకే అనుభవం నిరంతరంగా ఉండటమే ధ్యానం. ఈ సృష్టిలో భూమి, అంతరిక్షం, జలం, పర్వతాలు ధ్యానమగ్నమై ఉన్నట్లుగా తోస్తాయి. లోకంలో మానవులు ధ్యాన మహిమ చేతనే మహత్మ్యాన్ని పొందుతారు’’ అని వివరించాడు. ధ్యానం కంటే గొప్పదేదైనా ఉందా అని నారదుడు అడిగితే.. ఽ‘ద్యానం కంటే విజ్ఞానం గొప్పది. విజ్ఞానమంటే శాస్త్రార్థ విషయ జ్ఞానము. శాస్త్ర విషయాలను తెలుసుకుని ఇష్ట దైవాన్ని గూర్చి ధ్యానం చేస్తారు. కాబట్టి ధ్యానం కంటే విజ్ఞానం గొప్పది’’ అని చెప్పాడు.


‘‘విజ్ఞానం కంటే గొప్పది ఏది?’’ అని నారదుడు అడగ్గా.. ‘‘విజ్ఞానం కంటే బలం గొప్పది. విజ్ఞానం మానసికమైనది. శారీరక బలం, మానసిక బలం, ఆత్మబలం అని బలం మూడు విధాలు. విజ్ఞానవంతుడు బలవంతుడైతేనే ఏమైనా చేయగలుగుతాడు. కర్మలనాచరించడానికి బలం కావాలి. బలం వల్లనే భూమి, అంతరిక్షము అన్ని లోకాలు, మనుషులు, అన్ని ప్రాణులు స్థిరపడి ఉన్నాయి. భగవంతుని నియమ రూప బలం వలననే ఈ లోకాలన్నీ తమ తమ పరిధులలో నిలిచి ఉన్నాయి. అట్టి బలం కంటే అన్నం గొప్పది. ఎవరైనా పది రోజులు అన్నం తినకుండా ఉంటే.. జీవించి ఉన్నప్పటికీ వారి శక్తులన్నీ సన్నగిల్లిపోతాయి. చూపు, వినికిడి, మాట్లాడే శక్తి తగ్గిపోతాయి.  ఆలోచించే శక్తి కూడా తగ్గుతుంది. వారు మరల అన్నం తినడం మొదలుపెడితేనే బలాన్ని చేకూర్చుకుంటారు. కాబట్టి బలం కంటే అన్నం గొప్పది’’ అని సనత్కుమారుడు బోధించాడు.




అప్పుడు నారదుడు ‘‘అన్నం కంటే గొప్పది ఇంకేదైనా ఉందా?’’ అని ప్రశ్నించగా.. ‘‘అన్నం కంటే  జలం గొప్పది. వర్షం లేకుండా అన్నం లేదు. వర్షాలు బాగా కురిసినప్పుడు అంతా జలమయమై కనిపిస్తుంది. పంటలు బాగా పండుతాయి. వర్షం లేకుంటే కరువు ఏర్పడుతుంది. కాబట్టి అన్నం కంటే జలం గొప్పది. అట్టి జలం కంటే తేజస్సు శ్రేష్ఠమైనది. తేజస్సు వాయువుతో కలిసి ఆకాశాన్ని తపింపజేస్తుంది. దీంతో ఎండలు ఎక్కువైతాయి. తదుపరి వర్షాలు. తేజస్సే ఆకాశంలో విద్యుత్తుగా ప్రకాశించి మెరుపులు, ఉరుములను కలుగజేస్తుంది. తేజస్సు తన శక్తిని ముందు చూపించి తర్వాత వర్షింపజేస్తుంది. కాబట్టి జలం కంటే తేజస్సు గొప్పది’’ అని బోధించాడు.


‘‘తేజస్సు కంటే గొప్పనైనది ఏది?’’ అని నారదుడు ప్రశ్నించగా.. ‘‘తేజస్సు కంటే ఆకాశం గొప్పది. ఆకాశం తేజస్సునకు ఆశ్రయం. ఆకాశంలోనే సూర్యచంద్రులు, విద్యుత్తు, నక్షత్రాలు, అగ్ని ఉన్నాయి. ఆకాశం శబ్ద గుణం కలది. ఆకాశం లేకుంటే శబ్దం వినిపించదు. ఏ కర్మలకైనా ఆకాశమే కారణం. కాబట్టి, నారదా! నీవు ఆకాశాన్ని ఉపాసించు. ఆకాశమును బ్రహ్మగా తలచి ఉపాసించేవాడు బాధలు లేనట్టి విశాల లోకాల సిద్ధిని పొందుతాడు’’ అని సనత్కుమారుడు నారదునకు ఉపదేశించాడు. 


- జక్కని వేంకటరాజం

Updated Date - 2020-09-23T06:46:16+05:30 IST