మృతుల్లో మగాళ్లు ఎక్కువ!

ABN , First Publish Date - 2021-06-22T09:23:21+05:30 IST

తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో జననాలు పెరుగుతున్నాయి. మరణాలు తగ్గుతున్నాయి.

మృతుల్లో మగాళ్లు ఎక్కువ!

  • మహిళలతో పోలిస్తే భారీగా నమోదు.. 
  • 2019లో మొత్తం మృతులు 2,28,294 మంది
  • పురుషులు 1,32,311.. స్త్రీలు 95,983
  • వయసు పెరిగేకొద్దీ పెరుగుతున్న మరణాలు
  • రాష్ట్రంలో జననాలు అప్‌.. మరణాలు డౌన్‌
  • బస్తీల్లో మగ, పల్లెల్లో ఆడపిల్లలు ఎక్కువ
  • పట్టణాల్లో  పిల్లల మరణాలు ఆందోళనకరం
  • కేంద్ర జనగణన విభాగం నివేదికలో వెల్లడి


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో జననాలు పెరుగుతున్నాయి. మరణాలు తగ్గుతున్నాయి. ఈ మరణాల్లోనూ అత్యధికులు వృద్ధులే చనిపోతున్నారు. ముఖ్యంగా 55 దాటిన తర్వాత మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువ గా ఉంటోంది. ఇంకా చెప్పాలంటే, వయసు పెరిగే కొద్దీ మరణాల శాతం కూడా పెరుగుతూ వస్తోంది. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ మరణిస్తున్నారు. మృతుల్లో 1,32,311 మంది పురుషులు కాగా, 95,983 మంది మహిళలు. పట్టణ ప్రాంత మగవారిలో కంటే పల్లెల్లోని పురుషులు ఎక్కువగా మరణిస్తున్నారు. రాష్ట్రంలో 2019లో 6,30,083 మంది జన్మిస్తారని అం చనా వేయగా, 8,41,268 మంది పుట్టారు. అలాగే, 2,34,883 మంది చనిపోతారని అంచనా వేస్తే.. 2,28,294 మంది మరణించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏటా క్రమేపీ జననాల సంఖ్య పెరుగుతున్నట్లు జనగణన గణాంకాలు సూచిస్తున్నాయి. 2018 వరకు సగటున ఏడాదికి ఆరు లక్షల మంది జన్మించా రు. 2018లో 6,52,791 మంది జన్మిస్తే, 2019లో  8,41,268 మంది పుట్టారు. కేంద్ర జన గణన విభాగం తాజాగా విడుదల చేసిన 2019 జనన, మరణ లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది.


జననాల విషయం ఇలా..

రాష్ట్రంలో 2019లో 8,41,268 మంది జన్మించా రు. వారిలో 4,30,652 మంది అబ్బాయిలు. 4,10,616 మంది అమ్మాయిలు. కొన్ని జిల్లాల్లో మగ పిల్లల కంటే ఆడ పిల్లల జననాలే ఎక్కువగా నమోదయ్యాయి. 

పట్టణ ప్రాంతాల్లో మగపిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు ఎక్కువగా పుడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1,13,282 మంది అమ్మాయిలు జన్మిస్తే, అబ్బాయిలు 1,11,807 మందే జన్మించారు. పట్టణ ప్రాంతాల్లో 3,18,845 మంది అబ్బాయిలు జన్మిస్తే, అమ్మాయిలు మాత్రం 2,97,334 మందే జన్మించారు.


రాష్ట్రంలో పుట్టిన వెంటనే బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకుంటున్న వారి శాతం చాలా ఎక్కువగా ఉం టోంది. 2019లో 6,16,927 మంది పుట్టిన వెం టనే వారి కుటుంబ సభ్యులు బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకోగా, 21 రోజుల్లోపు మరో 1,86,313 మం ది, నెల రోజుల్లోపు 24,827 మంది, ఏడాది తర్వాత 13,201 మంది తీసుకున్నారు.


జన్మించిన నెల రోజుల్లోనే 95 శాతం మంది బర్త్‌ రిజిష్ట్రేషన్‌ చేయిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతాల్లో బర్త్‌ రిజిస్ట్రేషన్‌ శాతం 88 ఉంటే, 2019 నాటికి అది 100 శాతానికి చేరింది.


చిన్నారుల మరణాల్లో పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. రాష్ట్రంలో అప్పుడే పుట్టిన చిన్నారులు గత ఏడు సంవత్సరాల్లో 31,635 మంది మరణించారు. సగటున ఏటా 4,519 మంది మృత్యువాత పడ్డారు. 2019లో 6,349 మంది చిన్నారులు మృతి చెందితే, వారిలో గ్రామీణ ప్రాంతాల్లో 2,306, పట్టణ ప్రాంతాల్లో 4,043 మంది ఉన్నారు. 


మరణాల విషయానికొస్తే..

రాష్ట్రంలో 2019లో మొత్తం 2,28,294 మంది మరణించారు. వారిలో ఎక్కువగా 65 దాటినవారే ఉన్నారు. వయసుల వారీగా చూస్తే.. ఏడాదిలోపు 6,349 మంది, నాలుగేళ్లలోపు 836 మంది, 5-14 మధ్య వయస్కులు 1,619 మంది, 15-24 మధ్య 3,299 మంది, 25-34 మధ్య 5,819 మంది, 35-44 మధ్య 10,478 మంది, 45-54 మధ్య 20,781 మంది, 55-64 మధ్య 39,994 మంది, 65-69 మధ్య 91,161 మంది, 70 పైబడిన వారు 47,958 మంది మరణించారు.


గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులు పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగా చనిపోతున్నారు. 55-69 మధ్య వయస్కుల్లో పల్లెల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు.


మరణాలు ఎక్కువగా హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మరణాల్లో గ్రేటర్‌ వాటా 29 శాతం. అంటే, 65,676 మంది చనిపోయారు.


పట్టణ ప్రాంత పురుషుల కంటే గ్రామీణ ప్రాంత మగవారే ఎక్కువ మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మగవారు 68,316 మంది చనిపోగా,  ఆడవారు 43,309 మంది మరణించారు. అదే పట్టణ ప్రాంతాల్లో 64,175 మంది పురుషులు చనిపోతే, ఆడవారు 52574 మంది.

Updated Date - 2021-06-22T09:23:21+05:30 IST