Most‌ వాంటెడ్స్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-01T15:30:57+05:30 IST

వరుస నేరాలతో హల్‌చల్‌ చేస్తూ మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన ఇద్దరు ఘరానా దొంగలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పక్కాగా స్కెచ్‌ వేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మరో దొంగ పరారీలో

Most‌ వాంటెడ్స్‌ అరెస్ట్‌

నగరంలో దోచి.. బీదర్‌లో అమ్మేస్తున్నారు.. 

హైదరాబాద్‌ సిటీ: వరుస నేరాలతో హల్‌చల్‌ చేస్తూ మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన ఇద్దరు ఘరానా దొంగలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పక్కాగా స్కెచ్‌ వేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మరో దొంగ పరారీలో ఉన్నాడు. నిందితులు మొత్తం 57 దొంగతనాలు చేసినట్లు నిర్ధారించారు. వారి నుంచి కేజీ బంగారం, 7.5 కేజీల వెండి సహా మొత్తం రూ. 55 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 


కర్ణాటక బీదర్‌కు చెందిన సయ్యద్‌ మోసిన్‌ అలియాస్‌ అషు 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. లగ్జరీ జీవితానికి అలవాటుపడి డబ్బు సంపాదనకు చోరీల ప్లాన్‌ వేశాడు. చిన్న ఐరన్‌ రాడ్‌, స్ర్కూడ్రైవర్‌నే ఆయుధాలుగా చేసుకున్నాడు. షేర్‌ ఆటోల్లో తిరుగుతూ ఖరీదైన ఇళ్లను రెక్కీ చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి అర్ధరాత్రి చొరబడి బంగారం, వెండి, నగదు దోచేసేవాడు. ఇలా 2003 నుంచి 2015 వరకు ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 39 చోరీలు చేశాడు. 2015లో మార్కెట్‌ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. 2016లో మోసిన్‌పై పీడీయాక్ట్‌ కూడా నమోదైంది. 2017లో జైలు నుంచి బయటకు వచ్చిన మోసిన్‌ స్నేహితుడు షేక్‌ మహమూద్‌తో కలిసి మళ్లీ చోరీలు మొదలు పెట్టాడు. 2017 నుంచి ఇప్పటి వరకు సైబరాబాద్‌, సంగారెడ్డిలో కలిపి 24 చోరీలు చేశాడు. ఎక్కడా పోలీసులకు చిక్కలేదు. దాంతో వారు పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారారు. ఇటీవల మియాపూర్‌ ఆర్సీపురం, నార్సింగి, రాజేంద్రనగర్‌ పరిధిలో వరుస చోరీలు జరుగుతుండటంతో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సీరియ్‌సగా తీసుకున్నారు. సీసీఎస్‌, మియాపూర్‌ క్రైమ్‌ టీమ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. క్రైమ్‌ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యామ్‌బాబు పర్యవేక్షణలో సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు,  టెక్నికల్‌, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ను సేకరించారు. నిందితులు పాత నేరస్థులుగా గుర్తించారు. పక్కాగా నిఘా పెట్టారు. ప్రధాన నిందితుడు సయ్యద్‌ మోసిన్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు షేక్‌ మహమూద్‌ పరారీలో ఉన్నాడు. 


బైక్‌పై కొడుకును ఎక్కించుకొని రెక్కీ

స్థానికులకు, పోలీసులకు అనుమానం రాకుండా ఆరేళ్ల కొడుకును బైక్‌పై ఎక్కించుకొని పలు కాలనీల్లో రెక్కీ చేసి, అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతున్న మరో మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ ఆటకట్టించారు ఆర్‌సీపురం పోలీసులు. జహీరాబాద్‌ రామ్‌నగర్‌కు చెందిన కెలావత్‌ శంకర్‌ చౌహాన్‌ అలియాస్‌ దాముల చౌహాన్‌ 11 చోరీలు చేసి 2020లో చందానగర్‌ పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్‌ సీపీ  నిందితుడిపై పీడీయాక్టు నమోదు చేశారు. 2021లో జైలు నుంచి విడుదలైన చౌహాన్‌ తిరిగి మళ్లీ చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల ఆర్‌సీపురం, నార్సింగి పరిధిలో 3 చోరీలు చేశాడు. పోలీసుల పక్కా నిఘాతో వలలో చిక్కాడు. ఈ ఘరానా దొంగలు నగరంలో దోచేసిన సొత్తును బీదర్‌కు తరలించి అక్కడ రొంగు కృష్ణచారి అనే రిసీవర్‌ ద్వారా అమ్మేసి సొమ్ము చేసుకునేవారని పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2021-12-01T15:30:57+05:30 IST