మొతేరాలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2021-02-23T09:27:58+05:30 IST

మూడో టెస్టు ప్రాక్టీస్‌ కోసం భారత్‌ -ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మొతేరా స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా ‘ఇది..

మొతేరాలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా..

ఎదుట నిలిచింది చూడు!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం

1,10,000 వేల సామర్థ్యం

రేపటి నుంచే మొతేరాలో టెస్ట్‌ పోరు


మూడో టెస్టు ప్రాక్టీస్‌ కోసం భారత్‌ -ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మొతేరా స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా ‘ఇది కలా.. నిజమా’ అనే భ్రాంతిలో ఉండిపోయారు. అప్రయత్నంగానే వారి నోటి నుంచి ‘మై..గాడ్‌’ అనే మాట వెలువడింది. వారి ఆశ్యర్యానికి కారణం ఉంది. ఎందుకంటే సర్దార్‌ పటేల్‌ స్టేడియం సామర్థ్యం అక్షరాలా లక్షా 10 వేలు. ప్రపంచ క్రికెట్‌లో ఇంత భారీ కట్టడం ఎక్కడా లేదు. మొత్తం క్షుణ్ణంగా పరిశీలించడానికి ఓ రోజంతా సరిపోయే ఈ స్టేడియాన్ని 63 ఎకరాల్లో నిర్మించారు. పెవిలియన్‌ నుంచి ఆటగాడు గ్రౌండ్‌లో అడుగుపెట్టడానికే 80కి పైగా మెట్లు దిగాల్సి ఉన్న మొతేరా గురించి ఆసక్తికర విషయాలు..


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియాన్నే మొతేరా పేరుతోనూ పిలుస్తుంటారు. 1982లో గుజరాత్‌ ప్రభుత్వం సబర్మతీ నది పక్కనవున్న మొతేరా అనే ప్రాంతంలో 100 ఎకరాలు కేటాయించడంతో.. కేవలం తొమ్మిది నెలల్లోనే 49 వేల సామర్థ్యంతో పాత స్టేడియం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇందులో 12 టెస్టులు, 23 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్‌ జరిగాయి. భారత్‌లో ఐసీసీ ప్రపంచకప్‌ ఎప్పుడు నిర్వహించినా ఈ స్టేడియానికి ఓ మ్యాచ్‌ అయినా దక్కేది.


63 ఎకరాల వైశాల్యంతో ఉన్న ఈ భారీ మొతేరా స్టేడియంలో ఎక్కడా పిల్లర్లు కనిపించవు. పునర్‌ నిర్మాణానికి అయిన ఖర్చు సుమారుగా రూ.800 కోట్లు. లోపలికి వెళ్లేందుకు నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయి. 

11 పిచ్‌లున్న ఏకైక స్టేడియం ఇదొక్కటే. ఇందుకోసం ఎరుపు, నలుపు మట్టిని వాడారు. అలాగే బౌలింగ్‌ యంత్రంతో కూడిన ఆరు ఇండోర్‌ పిచ్‌లున్నాయి. దీనికి తోడు చిన్న పెవిలియన్‌ ఏరియాతో రెండు ప్రాక్టీస్‌ గ్రౌండ్స్‌ అందుబాటులో ఉండడం విశేషం.

అలాగే సంప్రదాయ మాస్ట్‌ లైట్స్‌ కాకుండా స్టేడియంలోని పైకప్పునకే ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లను అమర్చారు. ఈ కారణంగా రాత్రి జరిగే మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల నీడలు కూడా కిందపడవు.

3 వేల కార్లు.. 10 వేల ద్విచక్ర వాహనాలను సులువుగా పార్కింగ్‌ చేయవచ్చు.

అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌, ట్రక్స్‌ స్టేడియంలోకి నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇండోర్‌ క్రికెట్‌ అకాడమీతో పాటు 200మీ. జాగింగ్‌ ట్రాక్‌ కూడా ఉంది. 76 కార్పొరేట్‌ బాక్సుల్లో 25 మంది చొప్పున కూర్చోవచ్చు.

స్టేడియంలో నాలుగు డ్రెస్సింగ్‌రూమ్‌లుండగా.. ఒక్కోదానికి రెండు జిమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే డ్రెస్సింగ్‌ రూమ్‌ సింథటిక్‌ రబ్బర్‌ ఫ్లోరింగ్‌తో ఉంటుంది. దీంతో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు ఇందులోనే వామప్‌, రన్నింగ్‌ చేసేందుకు వీలుంటుంది.

8సెం.మీ భారీ వర్షం కురిసినా 30 నిమిషాల్లోపే మ్యాచ్‌ ఆరంభమయ్యేలా ఇక్కడి డ్రైనేజి వ్యవస్థను రూపొందించారు.

ప్రత్యేకంగా మీటింగ్‌ గది, కోచ్‌ క్యాబిన్‌తో పాటు ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లకు చికిత్స చేసేందుకు ఫిజియో కార్నర్‌ కూడా ఉంది.

50 డీలక్స్‌ గదులు, ఐదు సూట్స్‌తో కూడిన క్లబ్‌ హౌస్‌, 3డీ మినీ థియేటర్‌, ఒలింపిక్‌ స్థాయి స్విమ్మింగ్‌పూల్‌, జిమ్నాజియం, స్క్వాష్‌ కోర్టు, ఆటగాళ్లు రిలాక్స్‌ అయ్యేందుకు ఉపయోగపడే ‘స్టీమ్‌ అండ్‌ సానా’ గది అదనం.

ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన బెర్ముడా గడ్డితో అవుట్‌ ఫీల్డ్‌ను ఏర్పాటు చేశారు.


ఇక ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పాత స్టేడియాన్ని కూలగొట్టి అక్టోబరు, 2015లో లక్షా 10 వేల కెపాసిటీతో అతి భారీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది గతేడాది ఫిబ్రవరిలోనే పూర్తయ్యింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌కు వచ్చిన వేళ ఈ స్టేడియాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటికే ఈ మైదానంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ నాకౌట్‌ మ్యాచ్‌లు జరగ్గా.. ఈనెల 24 నుంచి మూడో టెస్టు ద్వారా తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదిక కానుంది. అంతేకాకుండా చివరి టెస్టుతో పాటు ఐదు టీ20లు కూడా ఇక్కడే జరగనున్నాయి. ప్రస్తుతానికి 50 శాతం ప్రేక్షకుల (55వేలు)కు మాత్రమే అనుమతి ఉంది.

Updated Date - 2021-02-23T09:27:58+05:30 IST