ఆగిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు

ABN , First Publish Date - 2021-08-02T05:32:58+05:30 IST

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అయిన తరువాత తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలనే ఆశయంతో గత ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఆగిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు
జిల్లా వైద్యశాలలో ఆగివున్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం

మదనపల్లె క్రైం, ఆగస్టు 1: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అయిన తరువాత తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలనే ఆశయంతో గత ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. జీవీకే సంస్థ ఈ సేవలను నిర్వహించింది. అయితే ఆ సంస్థ ఒప్పంద గడువు గతనెల 31తో ముగియడంతో సేవలు ఆగిపోయాయి. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనాలు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 28 వాహనాల ద్వారా సేవలందేవి. అయితే కొనసాగింపుపై ఎలాంటి స్పందన లేకపోవడంతో సేవలు నిలిచి పోయాయి. కాగా జీవీకే సంస్థ వాహన డ్రైవర్లను తొలగించినట్లు తెలు స్తోంది. పైగా నాలుగునెలల నుంచి వేతనాలు విడుదల కాకపోవడంతో  వారు ఇబ్బంది పడుతున్నారు. సంస్థకు ఎనిమిది నెలలుగా బిల్లులు రాకపోవడంతో జీతాలు పెండింగ్‌లో ఉన్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కొత్త టెండర్లను ఆహ్వానించి సేవలను యధాతథంగా కొనసాగించాలంటూ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-08-02T05:32:58+05:30 IST