హైదరాబాద్‌లో అమానుషం.. నడిరోడ్డుపై తల్లిని కొట్టిన కొడుకు

ABN , First Publish Date - 2020-07-05T13:25:26+05:30 IST

ఆమె వయస్సు 70. ఈ వయస్సులో తల్లిని కంటిపాపలా చూసుకోవాల్సిన ఓ కొడుకు నడిరోడ్డుపై ఆమెపై చేయి చేసుకున్నాడు. కిందపడటంతో ఆమె తలకు, చేతికి గాయం కాగా, తల్లిని రోడ్డుపైనే వదిలేసి పోయాడు.

హైదరాబాద్‌లో అమానుషం.. నడిరోడ్డుపై తల్లిని కొట్టిన కొడుకు

పెన్షన్‌ డబ్బుల కోసమే... అడ్డుకున్న స్థానికులు

వాహనం వదిలి పరారీ 


హైదరాబాద్ (అమీర్‌పేట, జూలై 4- ఆంధ్రజ్యోతి):  ఆమె వయస్సు 70. ఈ వయస్సులో తల్లిని కంటిపాపలా చూసుకోవాల్సిన ఓ కొడుకు నడిరోడ్డుపై  ఆమెపై చేయి చేసుకున్నాడు. కిందపడటంతో ఆమె తలకు, చేతికి గాయం కాగా,  తల్లిని రోడ్డుపైనే వదిలేసి పోయాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ పక్కనే ఉన్న రామకృష్ణ రెసిడెన్సీ వద్ద శనివారం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన అరుణ (70)కు ముగ్గురు కొడుకులు.  భర్త వరంగల్‌లో, ఇద్దరు కొడుకులు సొంత ఊరిలోనే ఉం టున్నారు. చిన్న కొడుకు వేణు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక బ్రాహ్మణ వీధిలో ఉంటున్నాడు. అతడి వద్దే అరుణ ఉంటోంది. అయితే, ఆమెకు వృద్ధాప్య పెన్షన్‌ వస్తోంది. ఆ డబ్బులు డ్రా చేసేందుకు వేణు హోండా యాక్టివా వాహనంపై తల్లి అరుణను తీసుకుని శనివారం ఎన్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్దకు వచ్చాడు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ, అక్కడ తల్లిని వాహనంపై నుంచి కిందికి దింపి, కోపంతో ఊగిపోతూ రెండు చెంపలపై బలంగా కొట్టాడు. ‘బిడ్డా.. కొట్టకురా’ అంటూ ఆ తల్లి దీనంగా వేడుకుంది. కొడుకు కొట్టడంతో ఆ వృద్ధురాలు కిందపడింది. తలకు, కుడి చేతికి గాయమై రక్తం వచ్చింది. గమనించిన స్థానికులు అడ్డుకోగా వారినీ తిడుతూ, ఒకరిపై దాడికి దిగి పీక పిసికేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడి వారు ప్రతిఘటించి, దాడి చేసేందుకు ప్రయత్నించగా..వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. భయంతో వణికిపోతున్న వృద్ధురాలికి అక్కడి వారు సపర్యలు చేయడంతో కొంత తేరుకుని ఆకలిగా ఉందని చెప్పింది. దీంతో భోజనం తీసుకొచ్చి తినిపించారు. ఈ క్రమంలో ఆమె డబ్బుల కోసం కొడు కు, కోడలు పెడుతున్న బాధలను ఏకరువు పెట్టింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు వచ్చారు. 108 వాహనాన్ని రప్పించి, ప్రథమ చికిత్స చేయించిన అనంతరం ఆమెను వేణు ఉంటున్న ఇంటికి తీసుకువెళ్లి వదిలారు.

Updated Date - 2020-07-05T13:25:26+05:30 IST