Abn logo
Jul 30 2020 @ 01:46AM

5 వరకు అమ్మభాషలోనే

అన్ని పాఠశాలల్లో ఇదే అమలు చేయాలి..

జాతీయ విద్యా విధానానికి ఆమోదం

నైపుణ్యం, అవగాహన, వికాసమే ముఖ్యం

బట్టీకి స్వస్తి.. మార్కులకు తగ్గే ప్రాధాన్యం

10+2 విధానానికి స్వస్తి.. ఇక 5+3+3+4

మూడేళ్లు రాగానే పిల్లలకు ‘ప్రీస్కూల్‌’

ఆరో తరగతి నుంచే వృత్తి విద్య

ఏటా పరీక్షలు ఉండవు.. 3, 5, 8లోనే..

డిగ్రీ మధ్యలో మానేసినా సర్టిఫికెట్‌

వినూత్నమైన సబ్జెక్టులతో కాంబినేషన్‌

ఇకపై ఎంఫిల్‌ ఉండదు

దేశంలో అగ్రశ్రేణి విదేశీ సంస్థల క్యాంపస్‌లు

ఉన్నత విద్యకు దేశమంతా ఒకే ప్రవేశ పరీక్ష

కాలేజీలన్నీ 15 ఏళ్లలో ‘అటానమస్‌’ కావాలి

లా, వైద్య విద్య మినహా అన్నింటికీ ఒకే రెగ్యులేటరీ వ్యవస్థ

2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం


శాఖ పేరు మారింది..

‘కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ’ పేరును రాజీవ్‌ గాంధీ హయాంలో ‘మానవ వనరుల మంత్రిత్వ శాఖ’గా మార్చారు. ఇప్పుడు మళ్లీ దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా మార్చారు.


న్యూఢిల్లీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పుస్తకాల మోతకు సెలవు! ప్రతి ఏటా పరీక్షలకు స్వస్తి! బట్టీ కొట్టే చదువులకు మంగళం! మార్కుల వెంట పరుగులు ఉండవు! అన్ని పాఠశాలల్లో ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన... ఇక... అంతా కొత్త చదువే! ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ‘జాతీయ విద్యా విధానం-2020’ను ఆమోదించింది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల దాకా... దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. 2030 నాటికి జాతీయ స్థాయిలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. కొత్త విద్యా విధానంలో... మూడేళ్ల  వయసు నుంచే పిల్లల చదువు మొదలవుతుంది. ఇప్పటిదాకా అమలులో ఉన్న ‘10+2’ ఉండదు. 1 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు ఇకపై 5+3+3+4లో చదువులు సాగిస్తారు. ‘బోర్డు ఎగ్జామ్స్‌’కు ఇందులో ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇవి మార్కుల కోసం కాకుండా విద్యార్థి నైపుణ్యాన్ని, అవగాహనను, నేర్చుకున్న అంశాలను నిజ జీవితంలో ఉపయోగించే విధానాన్ని (నాలెడ్జ్‌ అప్లికేషన్‌)ను పరీక్షించేలా ఉంటాయి. అందులోనూ ప్రతి సంవత్సరం పరీక్షలు ఉండవు. 3, 5, 8 తరగతుల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, గ్రేడ్‌ 10, 12 బోర్డు పరీక్షలు కొనసాగుతాయి. వీటిని కూడా కొత్త విధానానికి అనుగుణంగా సమూలంగా మార్చుతారు. ఇక... సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ నుంచి ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌కు మార్చాలని నిర్ణయించారు. కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, ఆశాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త విద్యా విధానంలోని ముఖ్యమైన అంశాలివి... 


బాల్యం నుంచే బలంగా...

బుడి బుడి నడకలు దాటగానే పిల్లలు బడిలో ఉండాలని కేంద్రం నిర్ణయించింది. పిల్లలకు 3వ ఏడు రాగానే... ‘చిన్నారుల సంరక్షణ - విద్య (ఈసీసీఈ) మొదలవుతుంది. ప్రస్తుతం ఆరోఏట 1వ తరగతిలో చేరుతున్నారు. ఈ పద్ధతిని మార్చేసి... 3 నుంచి 18 ఏళ్ల వయసు వచ్చేదాకా... 5+3+3+4 పద్ధతిలో చదువు సాగుతుంది. 15 ఏళ్ల చదువులో... తొలి మూడేళ్లు అంగన్‌వాడీ లేదా ప్రీస్కూల్‌ బోధన ఉంటుంది. ఇది... 3-8 ఏళ ్ల వరకు, 8-11 ఏళ్ల వరకు, 11-14 ఏళ్ల వరకు, 14-18 ఏళ్ల వరకూ చదువుకునే విధంగా విద్యావిధానాన్ని రూపొందించారు. స్కూలు విద్య 12 ఏళ్లకే పూర్తయినప్పటికీ తొలి మూడేళ్లు అంగన్‌వాడీ లేదా ప్రీస్కూలింగ్‌ విద్యాబోధన ఉంటుంది. 


పిల్లల శారీరక, మానసిక వికాసంతోపాటు... మొత్తంగా సామాజిక, ఆర్థిక, భావోద్వేగ, నైతిక, సాంస్కృతికమైన అభివృద్ధి, కళలపట్ల ఆసక్తి, భావ ప్రకటన సామర్థ్యంలో అభివృద్ధి సాధించాలన్నది ఈసీసీఈ లక్ష్యం. దీనికి అనుగుణంగా 8 ఏళ్ల వయసు పిల్లలకు అవసరమైన కరిక్యులంను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తుంది. 


ఈసీసీఈలో చదువు ఆసక్తికరంగా సాగుతుంది. కళలు, కథలు, కవితలు, ఆటలు, పాటలు.... ఇలాంటి అంశాలను తగిన విధంగా సిలబ్‌సలో చేర్చుతారు. 


ఈసీసీఈని సమర్థంగా అమలు చేసేందుకు వీలుగా... అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, ప్రీప్రైమరీ పాఠశాలలు, ప్రీ-స్కూల్స్‌ను బలోపేతం చేస్తారు. అందులో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.


మూడేళ్ల వయసు రాగానే... పిల్లలను ‘ప్రిపరేటరీ క్లాస్‌’లో చేర్చాలి. ప్రతి బాలవాటికలో ఈసీసీఈ అర్హత ఉన్న టీచర్‌ పని చేస్తారు. 10+2  అర్హత ఉన్న వారికి ఆరునెలల శిక్షణ ఇచ్చిన అనంతరం ఈసీసీఈ టీచర్‌గా నియమిస్తారు. అంతకంటే తక్కువ అర్హత ఉన్న వారు ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా చేయాల్సి ఉంటుంది. 


ప్రతి ఒక్కరికీ అక్షరాలు, అంకెలు తెలిసి ఉండటాన్ని అత్యంత ప్రాధాన్య, అత్యవసర కార్యక్రమంగా నిర్ణయించారు. ఈ లక్ష్యం సాధించేందుకు... కేంద్ర విద్యాశాఖ ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ’ని ఏర్పాటు చేస్తుంది. 


అన్ని పాఠశాలల్లో ఐదో తరగతి వరకు మాతృభాషలో లేదా స్థానిక ప్రాంతీయ భాషలోనే  విద్యా భోదన సాగాలి. వీలైతే 8వ తరగతి వరకు ఇదే పద్ధతి కొనసాగాలి.  సంస్కృతం కూడా అన్ని స్థాయిల్లో  ఒక బోధనా భాషగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. 


కొత్తగా జాతీయ అసె్‌సమెంట్‌ సెంటర్‌, పరఖ్‌ (పెర్‌ఫామెన్స్‌ అసె్‌సమెంట్‌, రివ్యూ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ హోలిస్టిక్‌   డెవల్‌పమెంట్‌ - విద్యార్థి సమగ్ర వికాసంపై సమీక్ష వ్యవస్థ)ను ఏర్పాటు చేస్తారు. 


ప్రతి విద్యార్థికి ఒక రిపోర్ట్‌ కార్డ్‌ ఉంటుంది. ఇందులో మార్కులతోపాటు విద్యార్థి సమగ్ర  వికాసాన్ని పొందుపరుస్తారు. విద్యార్థి సామర్థ్యం, సహాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరు వివరాలు నమోదు చేస్తారు. 12వ తరగతి పూర్తయ్యేసరికి రిపోర్ట్‌ కార్డు చూడగానే విద్యార్థి సాధించిన నైపుణ్యం కూడా తెలుస్తుంది. 


6వ తరగతి నుంచే వృత్తి విద్యను ప్రవేశపెడతారు. 

పాఠశాలల్లో, ఉన్నత విద్యాసంస్థల్లోనూ రకరకాల భాషల్ని ప్రోత్సహిస్తారు. పాళీ, పర్షియన్‌, ప్రాకృత భాషలకు జాతీయ సంస్థను ఏర్పాటు చేస్తారు సెకండరీ స్థాయిలో కూడా అనేక విదేశీ భాషలను ప్రవేశపెడతారు. అయితే... ఏ దశలోనూ విద్యార్థులపై భాషలను బలవంతంగా రుద్దరు.


ఇక... ఎంఫిల్‌ కోర్సు ఉండదు.

బోర్డు పరీక్షలతోపాటు, యూనివర్సిటీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లకూ ప్రాధాన్యం తగ్గిస్తారు. 


ఉన్నత చదువులు కొనసాగించే వారి సంఖ్య (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) ఇప్పుడు  26.3 శాతం మాత్రమే. దీనిని 2035 నాటికి 50శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


అండర్‌ గ్రాడ్యుయేషన్‌ 3 లేదా నాలుగేళ్లు ఉంటుంది. దీని పాఠ్యాంశాలను సరళీకరిస్తారు. సబ్జెక్టుల కాంబినేషన్‌ను, వృత్తి విద్య కోర్సులతో కలిపి వినూత్నంగా ఎంచుకోవచ్చు.


కొత్త విద్యా విధానానికి తగినట్లుగా ‘అఫిలియేషన్‌’ పద్ధతిని మార్చుతారు. కాలేజీలన్నీ 15 సంవత్సరాల్లో దశల వారీగా ‘స్వయం ప్రతిపత్తి’ ఉన్న స్థాయికి లేదా ‘కాలేజ్‌ ఆఫ్‌ యూనివర్సిటీ’ స్థాయికి చేరుకోవాల్సిందే. 


ప్రపంచంలోని వంద అగ్రశ్రేణి విదేశీ విశ్వవిద్యాలయాలకు మన దేశంలో క్యాంప్‌సలు నెలకొల్పేందుకు అవకాశం కల్పిస్తారు. దేశంలో డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేదుకు జాతీయ విద్యా టెక్నాలజీ ఫోరమ్‌ (ఎన్‌ఈటీఎఫ్‌) ఏర్పరుస్తారు. 8 ప్రాంతీయ భాషల్లో తొలుత ఈ కోర్సులను అభివృద్ది పరుస్తారు. 


ప్రైవేట్‌, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలన్నింటికీ ఒకే విధమైన నిబంధనలు ఉంటాయి. డ్రీమ్డ్‌ యునివర్సిటీలు, కేంద్ర యూనివర్సిటీలు, ఇతర ప్రత్యేక సంస్థలకు వేరువేరు నిబంధనలు ఉండవు. అన్నింటిలోనూ ఒకే విధమైన ప్రమాణాలు పాటించాల్సిందే.


ఇక విద్యాసంస్థల అనుమతులకు తనిఖీలు ఉండవు. ఆన్‌ లైన్‌ లో స్వయం ప్రకటనలు పారదర్శకంగా చేయాల్సి ఉంటుంది. 


ఉన్నత విద్యలో ఇలా...

ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ కలిపి ఒకే ఒక్క నియంత్రణ సంస్థ ఉంటుంది. వాటిలో ప్రవేశాలకు ‘జాతీయ పరీక్షా సంస్థ’ (ఎన్‌టీఏ) కామన్‌ ఎంట్రెన్స్‌ను నిర్వహిస్తుంది. (న్యాయ, వైద్య విద్యకు మినహా.)

డిగ్రీని విద్యార్థులు మధ్యలోనే మానేయవచ్చు. మళ్లీ చేరవచ్చు. (మల్టిపుల్‌ ఎంట్రీ అండ్‌ ఎగ్జిట్‌) దానికి తగినట్లుగా సర్టిఫికెట్‌ను అందిస్తారు.


28 ఏళ్ల తర్వాత...

1986లో విద్యావిధానం రూపొందించారు. దానిని... 1992లో సవరించారు. నేటివరకూ అదే కొనసాగుతోంది. 2016, మేలో కొత్త విద్యావిధానం రూపకల్పనపై కేంద్ర మాజీ కేబినెట్‌ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని కమిటీ ఒక నివేదిక సమర్పించింది. అనంతరం ‘ఇస్రో’ మాజీ అధిపతి కె.కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని బృందం గత ఏడాది నివేదికను సమర్పించింది. ఈ ముసాయిదాను కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఆ తర్వాత ఎంపీలు, పార్లమెంటరీ కమిటీల నుంచి సూచనలు స్వీకరించారు. 2.5 లక్షల గ్రామ పంచాయతీల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించి జాతీయ విద్యా విధానం 2020ని రూపొందించారు. దీనిని 22 భాషల్లోకి అనువదించారు.


మరికొన్ని అంశాలు... 


విద్యారంగ వ్యయాన్ని త్వరలో జీడీపీలో 6 శాతానికి పెంచేందుకుచర్యలు తీసుకుంటారు. 


పరిశోధనా సంస్కృతిని అభివృద్ధి పరిచేందుకు జాతీయ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తారు..


అనువాదాలు, భాషాంతరీకరణకు భారతీయ సంస్థను నెలకొల్పుతారు.


సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.  మహిళా విద్యతో పాటు దివ్యాంగులపై దృష్టి సారిస్తా రు. వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలకు ప్రత్యే క విద్యామండలాలను ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో బాలభవన్‌ల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. 


పారదర్శక విధానం ద్వారా ఉపాధ్యాయులను నియమిస్తారు. ప్రతిభ, పనితీరు అంచనా ప్రాతిపదికగా వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.


2022 క ల్లా ఎన్‌సీఈఆర్‌టీ ఉపాధ్యాయులందరికీ ‘జాతీయ వృత్తి ప్రమాణాల’ను రూపొందిస్తుంది. ఉపాధ్యాయ శిక్షణకు జాతీయ పాఠ్యప్రణాళికను రూపొందిస్తారు. నాలుగేళ్ల బీఈడీ డిగ్రీ ఉంటేనే  బోధనకు కనీస డిగ్రీ లభిస్తుంది.


ఎప్పటికి ఏ లక్ష్యం...


2022: జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల (ఎన్‌పీఎస్‌టీ) రూపకల్పన జరగాలి.

2025: మూడు నుంచి ఆరేళ్ల వయసులో ఉన్న వారందరికీ  అక్షరాలు, అంకెలు తెలిసి ఉండాలి.

2025: కనీసం 50 శాతం మంది విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం ఉండాలి.

2030: వంద శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో సాధించాలి. కొత్త సంస్థలు


మేరు: ప్రతి జిలా లూదా సమీప జిల్లాల్లో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ వర్సిటీల ఏర్పాటు. 

ఎన్‌ఆర్‌ఎఫ్‌: అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పెంచేలా నేషనల్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ నెలకొల్పుతారు. 

ఎన్‌ఈటీఎఫ్‌: విద్యారంగంలో సాంకేతిక వినియోగం పెంచేందుకు నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఫోరం ఏర్పాటు చేస్తారు.


మాతృభాషలోనే ప్రాథమిక విద్య: వెంకయ్య 


హైదరాబాద్‌ సిటీ/న్యూఢిల్లీ: ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉన్నత విద్యలో తెలుగు తప్పనిసరిగా ఒక విషయంగా ఉండాలని, దీనివల్ల విద్యార్థుల్లో మాతృభాషపై ఆసక్తి, గ్రహణశక్తి పెరుగుతాయన్నారు. బుధవారం హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ‘జ్ఞాన సముపార్జన మాధ్యమం : మాతృభాష’ అనే అంశంపై వెబినార్‌ను వెంకయ్య ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించి మాట్లాడారు. ఆంగ్లభాషలో విద్యాభ్యాసంతో అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం సరికాదన్నారు. 2017 వరకు నోబెల్‌ బహుమతిని పొందిన వారిలో 90 శాతానికి పైగా మాతృభాషలో చదివిన వారేనని తెలిపారు. డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, వర్సిటీ ఉప కులపతి పొదిలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement