మదర్ ఆఫ్ కల్నల్ సంతోష్

ABN , First Publish Date - 2020-06-18T05:49:10+05:30 IST

గట్టు తెగి ఊళ్లు మునగకుండా గట్టుకి దన్నిచ్చి పగవానికి ఎదురు రొమ్మొడ్డి గట్టెంట రాత్రింబవలూ గస్తీ కాసే చెట్టు ఒరిగింది...

మదర్ ఆఫ్ కల్నల్ సంతోష్

గట్టు తెగి ఊళ్లు మునగకుండా

గట్టుకి దన్నిచ్చి

పగవానికి ఎదురు రొమ్మొడ్డి

గట్టెంట రాత్రింబవలూ గస్తీ కాసే

చెట్టు ఒరిగింది

నా చిట్టి తండ్రీ ఇక్కడ 

నా బొడ్డు పేగు తెగింది


ఓ నా చిన్ని తండ్రీ

అంతా మామూలుగా ఉంది

అదే సూర్యుడూ అదే చంద్రుడూ

అవే కక్షలూ అవే కాంక్షలూ

అవే గోడలూ అవే మనుషులూ

అవే వార్తలూ ప్రపంచమదే

నువు కాపాడిన ప్రపంచమిదే

నీవు లేని నాది కాని ప్రపంచమిదే


ఈ తెగని రాత్రి నిస్స్వప్నంగా

నేను నీతో...

నా కడుపున పండిన నీవనే

నా నిజంతో నా సంతోషంతో

నీ కోసం ఈ అనుక్షణిక నిరీక్షణ

నను నిలువనీక ముట్టడి చేస్తోంది


నిను కప్పిన మువ్వన్నెల జెండా తొలగించి

నీ తల నిమిరి నీ చక్కని చెక్కిలి ముద్దాడి

నీ తనువంతా తడిమి తడిమి

నే దిగమింగిన నిప్పుల కన్నీటి ప్రవాహం 

దహిస్తున్న నా గుండెల నిను అదిమి

నా లాలన ఆకాశానికి కట్టిన ఊయల నిను ఊచి

నీపై నా లాలసతో

ఉబికిన చెమటల తడిసిన నా కొంగులతో

మము గాచేందుకు చేసిన యుద్ధంలో 

ఎగసిన నీ గుండెలపై 

ఎండిన రక్తపు మరకల తుడిచీ

నిను గాంచేందుకు నిను పొందేందుకు

నా కడుపున నిను మరలా నిద్దుర పుచ్చేందుకు

నీ చివరి రాకకై నా నిరీక్షణ ఈ గాఢ నిరీక్షణ 

నిను గన్న కానుపు కన్న 

వర్ణించనలవి గాని వాంఛాపారమితమై

నను కమ్మేస్తోంది


ఈ దీర్ఘ రాత్రి

నా కనుల నీరు రానీయను

నా కనుపాప కరిగి పారిపోతుందని

ఈ దేశానికి అభిషేకించిన

నీ నెత్తురు పలుచన పడనీయను


నువు నాగుండెల పై పారాడిన

ఈ జాతి సంతోష పతాకం

నీ దేశానికి నీవిచ్చిన బలిదానం

నిను కోల్పోయిన వేదన లోనూ

నీకై పొంగుకొస్తున్న

నా చనుబాలకు నీ విచ్చిన


ఆత్మీయ గౌరవం

నువు తీర్చిన నా వాత్సల్యఋణం

ఇక ఈ దేశాన్నేమీ కోరను.

విప్పగుంట రామ మనోహర

Updated Date - 2020-06-18T05:49:10+05:30 IST