ఆదివాసీల అమ్మ!

ABN , First Publish Date - 2020-12-14T07:00:08+05:30 IST

‘మాది కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ) మండలంలోని పుల్లార అనే మారుమూల గిరిజన గ్రామం. నా చిన్నతనమంతా మా అమ్మమ్మ వాళ్ల ఊరైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌లోనే గడిచింది.

ఆదివాసీల అమ్మ!

వృత్తిరీత్యా ఆమె ఒక ఉపాధ్యాయురాలు. 

కానీ ఆదివాసీలకు ఆమె అమ్మగా మారారు. ఓవైపు బడిలో పాఠాలు బోధిస్తూనే, 

అడవి బిడ్డల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు ఆదిలాబాద్‌ జిల్లా మానవహక్కుల వేదిక అధ్యక్షురాలు 

ఆత్రం సుగుణ. ఆదివాసీల హక్కుల గొంతుగా ఆమె ప్రయాణం ఎలా మొదలైందో ‘నవ్య’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...



‘మాది కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ) మండలంలోని పుల్లార అనే మారుమూల గిరిజన గ్రామం. నా చిన్నతనమంతా మా అమ్మమ్మ వాళ్ల ఊరైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌లోనే గడిచింది. అక్కడికి సమీపంలోని తపాలపూర్‌ లో 10వ తరగతి వరకు చదువుకున్నా. నా 13వ ఏటనే ములిమడుగు (కొమ్ముగూడెం) గ్రామానికి చెందిన ఆత్రం భుజంగరావుతో వివాహం జరిగింది. ఆ తర్వాత నా భర్త ప్రోత్సాహంతో ఎంఏ. బీఈడీ చదివాను. 2008లో టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ప్రభుత్వ పాఠశాలలో సోషల్‌ సబ్జెక్టు బోధిస్తున్నా! అదంతా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆదివాసీల బాధలను అతి దగ్గర నుంచి చూశాను. అప్పటి నుంచి వారి కోసం ఏదైనా చేయాలన్న తపన నాలో మొదలైంది. ఉపాధ్యాయురాలుగా బాధ్యతగా నిలబడి.... వారి హక్కుల కోసం కలబడేందుకు సిద్ధమయ్యాను.


ఆ సంఘటన నన్ను కదిలించింది

1995లో మా గ్రామ వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్‌)లో సభ్యురాలిగా పని చేశా.

 అప్పుడే అందరితో కలిసి అడవి భూముల్లో మొక్కలు నాటి సంరక్షించాం. మాఊరికి చెందిన కొందరు ఆదివాసులు అడవిలోని చెట్లను నరికి పోడు వ్యవసాయం చేసుకునేవారు. పోడు సాగు చేస్తున్నందుకు అటవీ శాఖాధికారులు వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో మా గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బతికేందుకే భూమిని సాగు చేసుకుంటున్న ఆదివాసీలను అధికారులు అడ్డుకోవడం ఏమిటి? అనే ప్రశ్న నన్ను వెంటాడింది. ఆ ప్రశ్న నన్ను వారి హక్కుల కోసం పోరాడేలా చేసింది.


అప్పుడే ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచాను. తరువాత బీడీ కార్మికుల సంఘం అవ్వాల్‌ కమిటీలోనూ పని చేశాను. ఆ తర్వాత తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షురాలిగా తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ జిల్లా చైర్మన్‌గా, ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశా. ప్రస్తుతం టీపీటీఎఫ్‌ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా పని చేస్తూ ఆదివాసీల సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నాను. భార్యాభర్తల గొడవలు మొదలుకొని భూ సమస్యల పరిష్కారం, మద్యపాన నిషేధం.. ఇలా స్థానిక మహిళలతో కలిసి ఎన్నో ఉద్యమాలు చేశాను. నా సేవలను గుర్తించిన తేనా (తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌) ప్రశంసా పత్రంతో పాటు రూ.50వేల నగదును అందించింది. ఆ మొత్తాన్ని నేరుగా పేద గర్భిణులకే అందించాను. ఆదివారం, సెలవు దినాల్లో మారుమూల గ్రామాల్లోకి వెళ్లి ఆదివాసీల సమస్యలు తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపిస్తున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో ఆకలితో అలమటిస్తున్న గిరిజనులకు ఆహార వస్తువులను సరఫరా చేశా. కనీసం మంచి నీటి సౌకర్యం లేక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారికి అండగా నిలిచాను. 35మంది అనాథ పిల్లలను హైదరాబాద్‌లోని దుండిగల్‌ స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో చేర్పించాను. టైగర్‌ జోన్‌లో ఉన్న ఆలీనగర్‌, దొంగపల్లి, రాంపూర్‌, మైసాంపేట్‌, గండిగోపాల్‌పేట్‌ గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో ధైర్యాన్ని నింపాను. 


తప్పును ఎత్తి చూపితే తప్పంటున్నారు

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపితే తప్పంటున్నారు. సాటి మనిషిగా పేద ప్రజలకు సేవ చేయడం తప్పెలా అవుతుంది? ఇప్పటికే తెలంగాణ ఉద్యమం, ఆదివాసీలతో కలిసి పోరాటాలు చేసినందుకు కేసులు పెట్టారు. ఇప్పుడు దేశద్రోహం కేసును పెట్టి పూర్తిగా నా గొంతును నొక్కాలని చూస్తున్నారు. సామాజిక న్యాయం, ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేయకుండా నన్ను అడ్డుకుంటున్నారు. నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. దీనిని రుజువు చేస్తే నా కుటుంబమంతా ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ విషయాలను తెలుసుకుంటే మంచిదని భావిస్తున్నా. 


ఆయనే నాకు స్ఫూర్తి!

మానవహక్కుల కోసం తన జీవితాన్నే ధారపోసిన బాలగోపాల్‌ నాకు స్ఫూర్తి. ఆయనతో పాటు ప్రొఫెసర్‌ బుర్రరాములు నాకు ఆదర్శం. ఆదిలాబాద్‌ ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగు పడడానికి బాలగోపాల్‌ ఎంతో కృషి చేశారు. ఆయన చొరవతోనే మారుమూల గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి. ఆదివాసీల గుండెకాయలాంటి జీవో నెంబర్‌ 3 రావడానికి ఆయనే కారణం. ఆదివాసీ సమాజానికి బాలగోపాల్‌ ఎంతో చేశారు. ఆయన స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాను.’’

 నవ్య డెస్క్‌


ఆదివారం, సెలవు దినాల్లో మారుమూల గ్రామాల్లోకి వెళ్లి ఆదివాసీల సమస్యలు తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపిస్తున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో ఆకలితో అలమటిస్తున్న గిరిజనులకు ఆహార వస్తువులను సరఫరా చేశా. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారికి అండగా నిలిచాను.

Updated Date - 2020-12-14T07:00:08+05:30 IST