మాతృభాష– మహాత్ముని మాట

ABN , First Publish Date - 2020-02-21T07:22:46+05:30 IST

వ్యక్తి ఏ భాషా జాతీయతకు, ఏ సాంస్కృతిక వారసత్వానికి, ఏప్రాంతానికి చెందినవాడో అతని భాష చెప్తుంది. వ్యక్తుల అస్తిత్వం వారి మాతృభాష వల్లనే రుజువవుతుంది...

మాతృభాష– మహాత్ముని మాట

వ్యక్తి ఏ భాషా జాతీయతకు, ఏ సాంస్కృతిక వారసత్వానికి, ఏప్రాంతానికి చెందినవాడో అతని భాష చెప్తుంది. వ్యక్తుల అస్తిత్వం వారి మాతృభాష వల్లనే రుజువవుతుంది. మాతృభాషను పదిలపరచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడు. ‘‘విద్య గ్రామీణుల అవసరాలు తీర్చేదిగా ఉండాలి. విద్యాబోధన మాతృ భాషలో జరగాలి. కొల్లగొట్టుకుతినే సామ్రాజ్యవాదులకు సహాయకారిగా ఉండకూడదు’’ అని మహాత్మగాంధీ 1937లో మాతృభాషపై తన మనోభీష్టాన్ని చాటారు. 


‘‘మన ప్రభుత్వాలు, వాటి కార్యాలయాలు తగిన జాగ్రత్త పడకపోతే ఆంగ్లభాష హిందుస్థానీ స్థానాన్ని ఆక్రమించగలదు. భారత దేశంలో ప్రాంతీయ భాషల సంపదను పునరుజ్జీవింపచేయటం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. మన కోర్టుల్లోనూ, స్కూళ్ళల్లోను, సచివాలయాలలోనూ ఈ మార్పు తప్పని సరికావాలి’’ అని గాంధీ 1939లోనే కోరారు.


‘‘భాషాసమస్య ప్రభుత్వాలు, విద్యావేత్తలు పరిష్కరించవలసిన సమస్యకాదు. ఒక ప్రాంతానికి చెందిన పిల్లలకు ఏస్థాయిలో ఏ భాషలో బోధించాలో వారు నిర్ణయించకూడదు. దేశీయ ‘పరిస్థితులు, జనాభిప్రాయాలను అనుసరించి బోధించాలి’’ అని ఆయన అన్నారు.


‘‘స్వాతంత్రం వచ్చిన తర్వాత బోధనా భాష సమస్య పరిష్కారం చేసి ముందుతరానికి బాసటగా నిలవాలి. విద్యావేత్తలు తదనుగుణంగా పాఠ్యగ్రంథాలు తయారు చేస్తారు. విద్యాఫలితాలు దేశీయావసరాలకు తగినట్టుగా ఉంటాయి’’ విద్యావంతులం మాతృభాషా సమస్యతో సతమతమైతే మనం కలలుగనే ‘‘స్వేచ్ఛాయుత భారతావనిని సాధిం చలేమని నా భయం’’ అన్నారు. మాతృభాషను అన్ని స్థాయిలలో ప్రభుత్వ భాషగా, బోధనాభాషగా కొనసాగించాలని ఆనాడే మహాత్ముడు ఉద్బోధించారు. 


‘‘స్వతంత్ర భారతావనిలో మాతృ భాష సభ్యసించినవారే మనకు కావాలి. విదేశీ భాష చదివి, దేశంలో పరాయివారిలా తిరిగేవాళ్ళు మనకు అనవసరం. ప్రజల భాషలో మంచి చెడ్డలు చెప్పేవారు కావాలి. మన ఉత్తమ భావాలను భార్యలే అర్థం చేసుకోలేని స్ధితిలో నేడు పడి ఉన్నాం’’ అని యంగ్‌ ఇండియా పత్రిక, 1929జులై 4 నాటి సంచికలో రాశారు. అప్పటి పరిస్థితే కాదు. 90ఏళ్ళ అనంతరం నేడు కూడా  మహాత్ముడి మనోవ్యథకు చిత్రిక పట్టే పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి తప్పని సరిగా మాతృభాషా మాధ్యమంలోనే 1నుంచి పదవ తరగతి వరకు, అవసరమైతే ఇంటర్‌, డిగ్రీ దాకానైనా తప్పని సరిగా కొనసాగించాలి. 


మాతృభాషని ప్రేమించడం, బోధనామాధ్యమంగా కొనసాగించడం అంటే ఆంగ్లాన్ని ద్వేషించడం కాదు. సాంకేతికత పెరిగాక ప్రపంచం కుగ్రామం అయింది. అందర్నీ కలిపే భాష ఆంగ్లం అనే విషయంలో గాంధీజీకి, మనకూ అభిప్రాయబేధం ఏమీలేదు. పరాయి భాష వారితో మాట్లాడటానికి అవసరమైనంత నైపుణ్యత బాలల హక్కుగా భావించి ఇంగ్లీషు నేర్పుదాం. అంతేగాని బోధనా మాధ్యమంగా మాతృభాషను పక్కనపెట్టి, ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి మళ్ళీ ఉపాధ్యాయులను తయారు చేయడం, 1 నుంచి 10వ తరగతి దాకా పాఠ్యాంశాలు సవరించి ఆంగ్లమాధ్యమ ప్రణాళికను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థిని మాతృభాషా మాధ్యమం నుంచి ప్రభుత్వం పక్కదోవ పట్టించడం సహేతుకం కాదు.


మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగాఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ తెలుగు పాలనా భాషగా, బోధనాభాషగా పూర్తి స్ధాయిలో కార్యరూపం దాల్చలేకపోవడానికి పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలే కారణం. పేద, మధ్య తరగతి ప్రజల మధ్య ఆంగ్ల, మాతృభాషా మాధ్యమాలంటూ తంపులు పెట్టి ఒకరంటే ఒకరికి పొసగకుండా చేసి తమ పబ్బం గడుపుకొంటున్నారు. మాతృభాషనే బోధనామాధ్యమంగా కొనసాగించేలా తెలుగు వారందరూ ఉద్యమించాలి. ‘‘మన దేశ ప్రజల్లో నూటికి 80% వ్యవసాయం, నూటికి 10%  పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ పరిస్థితిలో పిల్లలకు మనది కాని సారస్వతాన్ని బోధించి జీవితంలో దేనికీ పనికిరానివారిగా తయారు చేస్తున్నారు. ఇలా చదువుకున్న వీరంతా శరీర కష్టానికి తాళలేని వారుగా గుమాస్తాలు గానో, దుబాసీలుగానో మాత్రమే పనికివస్తారు’’ అని ఆనాడే గాంధీజీ చెప్పారు. ప్రస్తుతం కూడా మనం ఈ స్థితిలోనే ఉన్నందుకు విచారించాలి. అందుకని గాంధీ మాటలను అనుసరిస్తూ మాతృ భాష పరిరక్షణ కోసం, మాతృభాషా మాధ్యమం కోసం కృషి చేయడం మన కర్తవ్యం.

(డాక్టర్‌ జి.వి. పూర్ణచందు పుస్తకం నుంచి కొన్ని విశ్లేషణలు)

డాక్టర్‌ రామతీర్థ

మాతృభాష పరిరక్షణ వేదిక


(నేడు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం) 

Updated Date - 2020-02-21T07:22:46+05:30 IST