జీవనమంత్రం: ఆ ఒక్క చిన్నతప్పు మనిషిని చెడుదారి పట్టిస్తుంది.. మరి అప్రమత్తంగా ఎలా ఉండాలంటే..

ABN , First Publish Date - 2021-11-24T17:39:49+05:30 IST

ఒకరోజు వర్ధమాన మహావీరుడు ప్రవచనాలు..

జీవనమంత్రం: ఆ ఒక్క చిన్నతప్పు మనిషిని చెడుదారి పట్టిస్తుంది.. మరి అప్రమత్తంగా ఎలా ఉండాలంటే..

ఒకరోజు వర్ధమాన మహావీరుడు ప్రవచనాలు చేస్తుండగా శిష్యులంతా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. కొందరు శిష్యులు తమకు వచ్చిన సందేహాలు చెబుతుండగా, మహావీరుడు వాటికి సమాధానాలిస్తున్నారు. ఒక శిష్యుడు లేచి నిలబడి.. ‘ఒక వ్యక్తి ప్రవర్తన ఎందుకు దిగజారుతుంది? దీనికి కారణమేమిటి? దయచేసి సమాధానం చెప్పండి’ అని అడిగాడు. వెంటనే మహావీరుడు సమాధానమిస్తూ.. ‘దీనికి సమాధానం చెప్పేముందు, మీరేమనుకుంటున్నారో చెప్పండి?’ అని అడిగాడు. దీనికి శిష్యుడు సమాధానమిస్తూ ‘అహంకారమే మనిషి పతనానికి ముఖ్య కారణం’ అని అన్నాడు. కొందరు శిష్యులు.. కోరికలే మనిషి పతనానికి కారణమనగా.. మరికొందరు లోభమని, క్రోధమని తెలిపారు. మహావీరుడు శిష్యులు చెప్పిన ఏ ఒక్క సమాధానాన్ని ఖండించకుండా.. ‘మన దగ్గర ఒక కమండలం ఉంటే, దానిని నీటితో నింపి నదిలో వదిలివేస్తే అది మునిగిపోతుంది కదా?’ అని అడిగారు. వెంటనే శిష్యులు కమండలం ఆకారం సరిగా ఉంటే అది మునిగిపోదు.. నీటిపై తేలుతుంది అని అన్నారు.  


వెంటనే మహావీరుడు.. ‘ఒకవేళ ఆ కమండలానికి రంధ్రం ఉంటే?’ అని అడగగానే.. ‘అది మునిగిపోతుందని’ శిష్యులు సమాధానమిచ్చారు... ‘అయితే రంధ్రం పెద్దగా లేదా చిన్నగా ఉంటే?’ అని మహావీరుడు అడగగా.. ‘చిన్నరంధ్రం ఉంటే కమండలం మెల్లగా మునిగిపోతుంది.. పెద్ద రంధ్రం ఉంటే త్వరగా మునిగిపోతుంది..’ అని శిష్యులు అన్నారు. వెంటనే మహావీరుడు.. ‘కమండలానికి రంధ్రంపై భాగంలో ఉంటే ఏమవుతుంది?’ అని అడిగారు. దీనికి  శిష్యులు...‘కమండలంలో రంధ్రం ఏ భాగంలో ఉన్నా అది మునిగిపోతుంది’ అని అన్నారు. వెంటనే మహావీరుడు సమాధానమిస్తూ.. ‘మనం శరీరం కూడా ఒక కమండలం లాంటిదే, చెడు అలవాట్లు రంధ్రాల లాంటివి. మనలోని చెడు అలవాట్లు చిన్నగా ఉన్నా, మన జీవితం పతనమవుతుంది. అందుకే.. కామం, క్రోధం, మోహం, లోభం, అహంకారం మొదలైన అవగుణాలకు దూరంగా ఉండాలి. మన స్వభావంలో ఏ చిన్నపాటి అవగుణం ఉన్నా మనం పతనమైపోతాం. అందుకే చిన్నపాటి తప్పుడు పని అయినా జీవితాన్ని పతనం గావిస్తుందని’ తెలిపారు.

Updated Date - 2021-11-24T17:39:49+05:30 IST