27 వేలతో ఆ ఫోన్‌ పని మటాష్‌!

ABN , First Publish Date - 2020-02-12T21:47:40+05:30 IST

మోటోరోలా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తయారుచేసిన మోటో రేజర్‌ ( Moto Razr ) చూడ్డానికి ఆకర్షణీయంగానే ఉంది. ఈ ఫోన్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌. అంటే మధ్యకి మడత పెట్టుకోవచ్చు.

27 వేలతో ఆ ఫోన్‌ పని మటాష్‌!

మోటోరోలా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తయారుచేసిన మోటో రేజర్‌ ( Moto Razr ) చూడ్డానికి ఆకర్షణీయంగానే ఉంది. ఈ ఫోన్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌. అంటే మధ్యకి మడత పెట్టుకోవచ్చు. ఇప్పటివరకూ శామ్‌సంగ్‌, హ్యువావీలు ఫోల్డింగ్‌ ఫీచర్‌ విషయంలో ముందడుగు వేయగా.. తాజాగా మోటోరోలా కూడా ఫోల్డబుల్‌ ఫోన్‌ తయారీలోకి అడుగుపెట్టింది. చిన్నగా ఉంటూనే పెద్ద స్క్రీన్‌ని అందించగలుగుతున్న ఈ ఫోన్‌ - చూడ్డానికి పాత సింబియన్‌ ఫోన్‌ మాదిరిగా ఉన్నప్పటికీ - ఆ విలక్షణమైన ఫీచర్స్‌ని దృష్టిలో పెట్టుకుని చూస్తే - మడత ఫోన్ల ట్రెండ్‌ని ఇది మళ్లీ రిపీట్‌ చేయగలుగుతుందేమోనని కొందరు భావించారు. అయితే తాజాగా సినెట్‌ టెక్నాలజీ వాళ్లు చేసిన చిన్న ప్రయోగంతో ఈ ఫోన్‌ మీద ఉన్న ఆశలన్నీ ఒక్కసారిగా డౌన్‌ అయిపోయాయి. ఎందుకంటే -


ఫోల్డబుల్‌ ఫోన్‌ అనగానే రోజూ అనేకసార్లు మడత పెట్టి - తెరుస్తూ ఉండాలి. కాబట్టి అసలు ఒక కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ కొన్నాక - దాన్ని జనరల్‌ యూజర్‌ ఎన్నిసార్లు మడత పెట్టి ఓపెన్‌ చేస్తాడు? అసలు ఎన్ని సార్లు మడతపెడితే ఆ ఫోన్‌ తట్టుకుంటుంది? ఎన్ని సార్ల తరవాత పనిచేయడం ఆగిపోతుంది? - అనే విషయంలో సినెట్‌ టెక్నాలజీవాళ్లు ఓ ప్రయోగం చేశారు. ఫోల్డ్‌ బాట్‌ అనే ఓ మిషన్‌లో పెట్టి ఈ ఫోన్‌ని అనేక సార్లు మడతపెట్టి తెరిచి చూశారు. దరిమిలా తేలిందేమిటి? ఈ ఫోన్‌ కొన్ని వందల సార్లు మడత పెట్టినా చక్కగా పనిచేసింది. వేలసార్లు కూడా ఓకే. కానీ సరిగ్గా 27,000 సార్లు మడతపెట్టి ఓపెన్‌ చేశాక - ఇక పనిచేయడం మానేసింది. సో... ఇదండీ ఈ ఫోన్‌ కెపాసిటీ అని వాళ్లు తేల్చేశారు. దాంతో ఈ ఫోన్‌కి ఉన్న క్రేజ్‌ ఒక్కసారిగా దెబ్బతిన్నట్టయింది. అయినా 27 వేలంటే ఎక్కువే కదా? ఈ కాలంలో ఫోన్‌ అంటే కేవలం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మించి ఎవరూ వాడడం లేదు. రోజుకి పదిసార్లు మడతపెట్టి పదిసార్లు ఓపెన్‌ చేసినా - ఈ ఫోన్‌ మూడు మూడున్నరేళ్లవరకూ పనిచేస్తుంది. అది చాలదా? అని కొందరంటున్నారు. చూద్దాం మరి! ఈ మడత గొడవ ఎంతవరకూ పోతుందో!

Updated Date - 2020-02-12T21:47:40+05:30 IST