గుట్టలు.. కాసుల కుప్పలు!

ABN , First Publish Date - 2022-05-02T06:38:13+05:30 IST

జిల్లాలోని గుట్టలు కొందరు అక్రమార్కులు కాసుల కుప్పలుగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా కంకర తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నారు.

గుట్టలు.. కాసుల కుప్పలు!

నిబంధనలకు విరుద్ధంగా కంకర తవ్వకాలు

కరిగిపోతున్న గుట్టలు.. పట్టించుకోని అధికారులు

అక్రమార్కులకు ప్రజాప్రతినిధుల అండదండలు

విజిలెన్సు, పొల్యూషన్‌ కంట్రోల్‌ అధికారులకు స్థానికుల ఫిర్యాదు

నిజామాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని గుట్టలు కొందరు అక్రమార్కులు కాసుల కుప్పలుగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా కంకర తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. పర్యావరణ అనుమతులు లేకున్నా కొన్ని క్వారీల్లో తవ్వకాలు చేపడుతున్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిర్ణయంతో కొన్ని రోజులుగా క్వారీలు మూతబడినా తిరిగి తవ్వకాలు చేపడుతున్నారు. తవ్వకాలు జరిగే సమయంలో ఎవరూ రాకుండా చూసుకుంటున్నారు. ఎవరైనా అధికారులు తనిఖీలకు వెళ్లితే ప్రజాప్రనిధుల అండతో దందా కొనసాగిస్తున్నారు. అయితే కంకరా తవ్వే సమయంలో నిబంధనలు పాటించకపోవడం, ఎక్కువ తవ్వకాలు చేయడంపై పలువురు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డీజీ, పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డుకు ఫిర్యాదు చేశారు.

 34 రోడ్‌ మెటల్‌ క్వారీలకు అనుమతులు..

జిల్లాలో 34 రోడ్‌ మెటల్‌ క్వారీలకు అనుమతులు ఇచ్చారు. జిల్లాలోని కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, మాక్లూర్‌, జక్రాన్‌పల్లి, రుద్రూర్‌, వర్ని, కోటగిరి, డిచిపల్లి, జక్రాన్‌పల్లి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, నవీపేటతో పాటు ఇతర మండలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. గుట్టల పరిధిలో క్వారీలకు అనుమతులిచ్చారు. దీంతో వ్యాపారులు కంకర మిషన్‌లకు కూడా అనుమతులు తీసుకొని తవ్వకాలు చేపట్టారు. వీటి ద్వారా కంకరను రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలకు పంపిస్తున్నారు. అయితే కంకర క్వారీలు ఏర్పాటు చేయాలంటే గనులు, భూగర్భశాఖ, రెవెన్యూ, ఇరిగేషన్‌, అటవీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతులు ఇవ్వాలి. గుట్టలను బ్లాస్ట్‌ చేసి రాయిని తవ్వే సమయంలో, కంకరా చేసే సమయంలో గాలిలో దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలి. ఇళ్ల సమీపంలో వీటిని అనుమతిం చకపోవడంతో పాటు గుట్టను పేల్చి బండ తీసే సమయంలో సమీప పొలాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేయాలి. ఇవన్నీ నిబంధనలు తెలియజేస్తూ అనుమతులు మంజూరు చేయాలి. అయితే సంబంధిత శాఖల కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు జిల్లా స్థాయి కమిటీ అనుమతులు మంజూరు చేస్తోంది. కానీ జిల్లాలో చాల క్వారీలకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతులను ఇవ్వలేదు. కంకర మిషన్‌లు నడిచే సమయంలో ఆ ప్రాంతమంతా గ్రీన్‌ కవర్‌ చేయాలి. మొక్కలు ఎక్కువగా పెంచాలి. వాటర్‌ను నిరంతరం చల్లూతూ ఉండాలి. వేడి తగ్గించే బాయిలర్లు పెట్టాలి. కంకర డస్టు పోసేందుకు బంకర్ల నిర్మాణం చేపట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే క్వారీలలో బ్లాస్టింగులు చేయాలి.

 ప్రజాప్రతినిధుల బంధువుల దందా..

జిల్లాలో కొన్ని క్వారీలు ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులవి కావడంతో అధికారులు కూడా అటువైపు చూడడంలేదు. క్వారీలో ఎన్ని క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు ఇచ్చారు. ఎన్ని మీటర్లు తవ్వారు. ఎన్ని ఏళ్ల వరకు అనుమతులు ఉన్నాయి. క్వారీకి అనుమతి ఇచ్చేటప్పుడు గుట్ట విస్తీర్ణం ఎంత, తవ్వకాలు జరిగిన తర్వాత విస్తీర్ణం ఎంతో పరిశీలించాలి. ఎక్కవ మొత్తంలో తవ్వకాలు చేస్తే పెనాల్టీ వేయాలి. నిబంధనలు పాటించని వాటి అనుమతులు నిలిపి వేయాలి. అయితే క్వారీల అనుమతులు తీసుకున్న వారిలో కొంత మందికి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండడంతో అధికారులు తనిఖీలకు జంకుతున్నారు. గతంలో తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం లేవని నివేదిక ఇచ్చిన అధికారులు బదిలీ కావడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

  క్వారీల నిర్వహణపై ఫిర్యాదు..

జిల్లాలోని కొన్ని క్వారీలపై అధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఏర్గట్ల మండలం బట్టాపూర్‌ క్వారీపై చౌట్‌పల్లికి చెందిన కే.ఆర్‌ సుదర్శన్‌ రెడ్డి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ, ఇతర శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్వారీకి పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతులు లేకున్నా తవ్వకాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గనుల శాఖ 6588 క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు ఇచ్చిన అంతకు మించి వేల క్యూబిక్‌ మీటర్లు అనుమతులు లేకుండా రిజర్వ్‌ ఫారెస్టులో తవ్వకాలు చేశారని పేర్కొన్నారు. దీంతో అధికారులు క్వారీ మూసిఉన్నా తనిఖీ చేపట్టారు. నివేదికను ప్రభుత్వానికి పంపించారు.

నెల రోజులుగా క్వారీల మూసివేత..

ఫ సత్యనారాయణ, జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి 

జిల్లాలో  నెల రోజులకు పైగా కంకర క్వారీలు మూసిఉన్నాయి. ఏ క్వారీలోను తవ్వకాలు జరగడం లేదు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామం. బట్టాపూర్‌ క్వారీలతో ఇతర క్వారీలలో అనుమతులు ఇచ్చిన మేరకే తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల సమయంలో ఎవ్వరికీ ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు తెలియజేశాం.

Updated Date - 2022-05-02T06:38:13+05:30 IST