Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెలుగుల పర్వం

‘ఉత్సవ ప్రియః మానవః’ అన్నాడు మహాకవి కాళిదాసు. స్వభావరీత్యా మానవులు సంబరాల ప్రియులు. ఉత్సవాలు, సంబరాలు లేదా పండుగలు మనలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువస్తాయి. బహుశా ఈ కారణంతోనే భారతీయులు ప్రతీ సందర్భానికీ ఒక విశిష్టతను ఆపాదించి ఉత్సవంలా జరుపుకొంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజాన్ని తమలో నింపుకొంటారు. మన దేశంలో ప్రతి పండుగకూ ఒక ప్రత్యేకత ఉంది. దీపావళి వాటిలో ప్రధానమైనది. దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ ... అంటే ‘చీకటి నుంచి వెలుగు వైపు పయనించాలి’ అంటున్నాయి ఉపనిషత్తులు. ఆ ఉపనిషద్వాక్యానికి ప్రతీకగా నిలిచే వేడుక దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున దేశమంతటా ఈ దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొంటారు. 


పురాణ గాథల్లో... వివిధ మతాల్లో...

త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసాన్ని, రావణ సంహారాన్నీ పూర్తి చేసి, ఆశ్వయుజ అమావాస్య నాడు అయోధ్య చేరినప్పుడు... అయోధ్య వాసులు నేతితో దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికారట. అప్పటినుంచి ఈ రోజున ఈ వేడుకను జరుపుకొంటున్నారని  పురాణ గాథలు చెబుతున్నాయి. నరకాసురుణ్ణి సత్యభామా శ్రీకృష్ణులు వధించగా, ఆ సంతోషంలో ప్రజలు దీపావళిని సంబరంగా చేసుకున్నారనీ, నాటి నుంచి ఏటా ఈ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీ అయిందనీ బహుళ ప్రచారంలో ఉన్న మరో కథ వెల్లడిస్తోంది. క్షీరసాగగర మథనంలో లక్ష్మీ దేవి ఉద్భవించిన రోజు ఇదేనంటారు. అలాగే, ఇతర మతాల్లోనూ ఈ రోజుకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. 24వ జైన తీర్థంకరుడైన మహావీరుడు నిర్యాణం చెందిన రోజు ఇది. కాబట్టి దీన్ని మహావీరుడి ‘మోక్షప్రాప్తి దినం’గా జైనులు పాటిస్తారు. ఇక, సిక్కుల ప్రధాన మందిరమైన అమృతసర్‌లోని స్వర్ణదేవాలయ శంకుస్థాపన 500 ఏళ్ళకు పూర్వం ఈ రోజునే జరిగింది. అలాగే సిక్కుల ఆరవ గురువు హరగోవింద్‌ సింగ్‌ బంధిఖానా నుంచి విడుదలైన రోజు ఇదే. దీన్ని సిక్కులు ‘బందీఛోడ్‌’గా జరుపుకొంటారు. 


దక్షిణాదిన మూడు... ఉత్తరాదిలో అయిదు

ఎవరు ఏ పేరుతో పిలిచినా... దీపావళిని  చెడుపై మంచి సాధించిన విజయంగా, ‘అజ్ఞానం’ అనే చీకటిని ‘జ్ఞానం’ అనే వెలుగుతో తరిమెయ్యాలనే సందేశ స్ఫూర్తితో నిర్వహించుకుంటారు. దక్షిణాదివారికి దీపావళి మూడు రోజుల పండుగ. మొదటి రోజును ‘నరక చతుర్దశి’గా, రెండో రోజును ‘దీపావళి’గా, మూడో రోజును ‘బలి పాడ్యమి’గా పాటిస్తారు. బలిచక్రవర్తి రాజ్య దానం, విక్రమార్కుడి పట్టాభిషేకం ఉదంతాలు దీపావళితో ముడిపడి ఉన్నాయి. కార్తిక పాడ్యమి నాడు విక్రమార్కుడి పట్టాభిషేకం జరిగిందనీ, ఆనాటి నుంచే విక్రమ శకం ప్రారంభమైందనీ చెబుతారు. ఉత్తరాదిలో ఇది అయిదు రోజుల పండుగ. నరకచతుర్దశి ముందు రోజును ‘ధన త్రయోదశి’ లేదా ‘ధన్‌ తేర్‌స’గా, బలి పాడ్యమి తదుపరి రోజును ‘యమ ద్వితీయ’ లేదా ‘భాతృ విదియ’గా జరుపుకొంటారు.


ఆరోగ్యమే పరమార్థం...

భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఏదో ఒక పరమార్థం ఉంటుంది. అది తెలుసుకుంటే మన పెద్దల శాస్త్రీయ దృక్పథం అవగతమవుతుంది. దీపావళికి ఇళ్ళకు సున్నాలు వేసి, ఇంటిని అలంకరిస్తారు. వర్షాకాలంలో ఇళ్ళలో, ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలనూ, మురికినీ తొలగించి, సున్నాలు వేయడం వల్ల... సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఆరోగ్యం చేకూరుతుంది. వర్షాకాలం ముగిసి... చలికాలం ప్రారంభమయ్యే దశలో ఆశ్వయుజ మాసం వస్తుంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతటా దీపాలు వెలిగించడం వల్ల పరిసరాలు వెచ్చబడతాయి. వర్షపు చిత్తడి వల్ల పుట్టిన క్రిములు దీపాల పొగవల్లా, కీటకాలు వాటికి దగ్గిరగా వచ్చి కాలిపోయి నశిస్తాయి. దీపాల వెలుగు మనిషిపై సకారాత్మకమైన ప్రభావం చూపిస్తుంది. వివిధ ధార్మిక క్రతువుల్లో నేతితో, రకరకాల నూనెలతో దీపాలు వెలిగించడానికి కారణం ఇలాంటి ప్రభావాన్ని ఆశించే కావచ్చు. అలాగే, చలికాలం రాకతో చర్మం పొడిబారుతుంది. దీపావళికి నువ్వుల నూనె శరీరానికి రాసుకొని, నువ్వుల పిండితో అభ్యంగన స్నానం చేస్తారు. నువ్వుల నూనె మాశ్చరయిజర్‌గా పని చేసి, శరీరానికి కాంతినిస్తుంది. అలాగే బద్ధకాన్ని పోగొట్టి, చురుకుదనం కలిగిస్తుంది.

 

దీపావళి రోజున లక్ష్మీ పూజ చేయడం ఆనవాయితీ. గౌరీదేవి నోము నోచుకొనే ఆచారం కూడా ఉంది. నోములు, పూజలు, వంటల కన్నా... దీపావళి పేరువింటే గుర్తుకొచ్చేది టపాసులే. ఒక రకంగా ‘దీపావళి అంటే టపాసులు కాల్చడమే’ అనేలా పరిస్థితి మారిపోయింది. నిజానికి దీపావళి అంటే చీకటిని చీల్చే వేడుక. ఈ రోజు కాలుష్య జనితంగా, ప్రమాదాలను ఆహ్వానించేదిగా, నష్టాలు పెంచేదిగా ఉండకూడదు. సపరివారంగా, ఆనందంతో, దీపాల వెలుగుల్లో, పర్యావరణాన్ని కాపాడుతూ, సమాజహితంగా జరుపుకోవాలి.

Advertisement
Advertisement