పోలీసు కస్టడీలో నోరు విప్పని ‘సృష్టి’ నిందితులు

ABN , First Publish Date - 2020-08-12T10:10:14+05:30 IST

పసి పిల్లల అక్రమ రవాణా, విక్రయాల కేసులో సృష్టి ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ నమ్రత, డాక్టర్‌ తిరుమల, ఏజెంట్‌గా ..

పోలీసు కస్టడీలో నోరు విప్పని ‘సృష్టి’ నిందితులు

దర్యాప్తునకు సహకరించలేదని పోలీసుల ఆవేదన


విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పసి పిల్లల అక్రమ రవాణా, విక్రయాల కేసులో సృష్టి ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ నమ్రత, డాక్టర్‌ తిరుమల, ఏజెంట్‌గా వ్యవహరించిన రామకృష్ణను ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణలో ఏమీ రాబట్టలేకపోయినట్టు తెలిసింది. సరోగసీ పేరుతో అమాయకుల నుంచి పసిపిల్లలను, ఇతరులకు అక్రమంగా విక్రయిస్తున్నట్టు తేలడంతో నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ నమ్రత, డాక్టర్‌ తిరుమల, ఏజెంట్‌ రామకృష్ణను మహరాణిపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


అయితే సృష్టి ఆస్పత్రి ద్వారా గత మూడేళ్లలో సుమారు 63 మంది చిన్నారులను ఇతరులకు విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడంతో వీరిని ఎవరు కొన్నారు, ఎవరు విక్రయించారు అనే వివరాలతోపాటు, ముఠాలో ఇంకెవరి పాత్ర ఉందనేదానిని రాబట్టేందుకు పోలీసులు నిందితులను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు.న్యాయవాదుల సమక్షంలో ఐదు రోజులపాటు వారిని విచారించిన పోలీసులు నిందితుల వద్ద నుంచి కొత్త విషయాలను రాబట్టలేకపోయారని తెలిసింది. దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌, టూ టౌన్‌ సీఐ వెంకటరావు ఆథ్వర్యంలో పోలీసులు  శ్రమించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ కేసులో చిక్కుముడులను ఎలా ఛేదించాలనేదానిపై పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోసారి కస్టడీకి కోరే యోచన లేదని పోలీసు అధికారులు పేర్కొంటుండడం కేసు దర్యాప్తు ఇక్కడితో ముగిసిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-08-12T10:10:14+05:30 IST