Abn logo
Sep 24 2021 @ 00:15AM

‘సాగు’ సమరభేరికి కదలిరండి

కేంద్రప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్) ‘భారత్ బంద్’కి పిలుపునిచ్చింది. రైతులు, విశాల ప్రజానీకం ప్రయోజనాలను బలపరచడం కోసం ఈ బంద్‌కు ‘కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం’ (కెవిపిఎస్) పూర్తి మద్దతును ప్రకటిస్తోంది. మనదేశం లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారందరూ పాల్గొని ఈ ‘భారత్ బంద్’ ను జయప్రదం చేయాలి. ఉద్యమిస్తున్న రైతులతో చర్చలను మోదీ ప్రభుత్వం నిలిపివేసిన తీరు వల్లనే ఎస్‌కెఎమ్ మూడో విడత ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆదర్శంగా తీసుకుని శాసనసభలో మూడు వ్యవసాయ నల్ల చట్టాల ఉపసంహరణ కోసం తీర్మానం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని ప్రకటన చెయ్యాలి. అన్ని రకాల రిజర్వేషన్లు అడ్డుకోవడానికే లాభాలు వచ్చే ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను విక్రయించడానికి కేంద్రం పూనుకుంది. ఈ ప్రజావ్యతిరేక చర్యను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. విద్యుత్ సంస్కరణల బిల్లు- 2020ని వెనక్కి తీసుకోవాలి. కార్మికుల హక్కులను హరించే లేబర్‌‌కోడ్‌లను ఉపసంహరించుకోవాలి


కొత్త వ్యవసాయ చట్టాలు - ‘రైతుల ఉత్పత్తి వాణిజ్యం సులభతర చట్టం’, ‘ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టం’, ‘రైతుల సాధికారత, రక్షణ ఒప్పందం’ మూడూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. చిన్నకారు, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను తీసుకువచ్చామని పాలకులు చెబుతున్నా దానిలో నిజం లేదు. కనుకనే ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధానిలోని వివిధ సరిహద్దుల వద్ద రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల శ్రేయస్సు విషయంలో కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్‌ఎస్ స్వామినాధన్ కమిషన్ సిఫారసులను సంపూర్ణంగా అమలు పరచాలి. 


రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడంతో పాటు వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలి. విద్యుత్ సంస్కరణల పేరిట ప్రజలపై మరిన్ని భారాలు వెయ్యడం మానుకోవాలి. లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు విక్రయించే విధానాలు ఉపసంహరించుకోవాలి. ఎస్‌కెఎమ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ‘భారత్ బంద్’లో దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ ప్రజలందరూ విధిగా పాల్గొనాలి. 

అండ్ర మాల్యాద్రి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కులవివక్ష వ్యతిరేక పోరాటసంఘం

ప్రత్యేకంమరిన్ని...