కదిలిన తెలుగు దండు

ABN , First Publish Date - 2021-10-21T04:45:14+05:30 IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం... టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు బుధవారం బంద్‌ పాటించాయి. వివిధ రూపాల్లో నిరసన తెలిపాయి. ఉదయాన్నే పోలీసులు నేతల ఇళ్లకు చేరుకుని గృహ నిర్బంధాలకు దిగారు. అయినా పోలీసు వలయాన్ని చేధించుకుని ర్యాలీలు, ధర్నాలు చేశారు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కదిలిన తెలుగు దండు
విజయనగరం టీడీపీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

వైసీపీ దాడులపై టీడీపీ ఆందోళన

జిల్లా వ్యాప్తంగా బంద్‌

శ్రేణుల ర్యాలీలు, ధర్నాలు

నేతల హౌస్‌ అరెస్టు


తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం... టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు బుధవారం బంద్‌ పాటించాయి. వివిధ రూపాల్లో నిరసన తెలిపాయి. ఉదయాన్నే పోలీసులు నేతల ఇళ్లకు చేరుకుని గృహ నిర్బంధాలకు దిగారు. అయినా పోలీసు వలయాన్ని చేధించుకుని ర్యాలీలు, ధర్నాలు చేశారు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయనగరంలో పార్టీ కార్యాలయం నుంచి శ్రేణులను బయటకు రానీయలేదు. గేటు నెట్టుకుంటూ బయటకు వచ్చేందుకు కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పోలీసులు నిలువరించారు. కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘర్షణ వాతావరణం కనిపించింది.


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

తమ కార్యాలయాలపై వైసీపీ దాడులను... ప్రభుత్వ తీరును టీడీపీ శ్రేణులు తీవ్రంగా నిరసించాయి. జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో ఆందోళనకు దిగారు. ఇదంతా ముందే ఊహించిన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గృహ నిర్బంధాలకు దిగారు. బంద్‌ పాటించకుండా పోలీస్‌ శాఖ చేపట్టిన చర్యలను తిప్పికొట్టేందుకు కార్యకర్తలు, నాయకులు గట్టిగానే ప్రయత్నించారు. ఉదయం 5 గంటలకే పోలీసులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు చేరుకుని వారు రోడ్లుపైకి రాకుండా నిర్బంధించారు. అయినప్పటికీ కొన్ని చోట్ల పోలీసు చర్యలను ఎదురించి.. రోడ్లుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయనగరం, సాలూరు, ఎస్‌.కోట, పార్వతీపురం, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ నాయకులు పోలీసులతో పోరాడి బంద్‌ పాటించేందుకు ప్రయత్నించారు. సాలూరులో ఉదయం 5.30కే టీడీపీ శ్రేణులు రోడ్లుపైకి వచ్చారు. అప్పటికే తెరిచిన దుకాణాలను మూయించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఎస్‌.కోటలో కూడా టీడీపీ నాయకులు షాపులు మూయించి బంద్‌ పాటించేందుకు వీధుల్లో తిరుగుతూ దేవీబొమ్మ కూడలి వద్ద రాస్తారోకో చేశారు. చీపురుపల్లిలో టీడీపీ నాయకులను నిర్భంధించినప్పటికీ పార్టీ అధ్యక్షునితో పాటు కార్యకర్తలు గోడ దూకి రోడ్లుపైకి వచ్చి నిరసన తెలిపారు. 

  విజయనగరంలో ఉద్రిక్తం

విజయనగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయం అశోక్‌ బంగ్లాలో ఉదయం నుంచే పోలీసులు పహారా కాశారు. కార్యకర్తలు, నాయకులను రోడ్లుపైకి రాకుండా అడ్డుకున్నారు. అశోక్‌ను ఇంటి నుంచి బయటకు రానీయలేదు. అయినప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జి అతిది గజపతిరాజు ఆధ్వర్యంలో నాయకులు, శ్రేణులు కార్యాలయంలో కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గేటు వైపుగా బయలుదేరారు. అప్పటికే అక్కడున్న పోలీసులు వారిని గేటు వద్ద నిలువరించారు. టీడీపీ శ్రేణులు  గేటును బలంగా నెట్టారు. పోలీసులు కూడా అడ్డుకున్నారు. దీంతో  ఒకానొక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని నిరసిస్తూ గేటు ముందు కొద్దిసేపు టీడీపీ శ్రేణులు బైఠాయించాయి. ప్రభుత్వ తీరుపై వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-10-21T04:45:14+05:30 IST