Abn logo
Nov 19 2020 @ 00:44AM

కశ్మీర్‌లో కదలిక

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వరుస ట్వీట్లు, పరుష వ్యాఖ్యలు జమ్మూకశ్మీర్‌లో విపక్షాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయట. డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (డీడీసీ) ఎన్నికల బరిలో తాము తప్ప వేరెవ్వరూ ఉండరని అమిత్‌ షా లెక్కలేసుకున్నారనీ, ఇప్పుడు కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలూ పోటీకి సిద్ధపడుతుండటంతో అంచనాలు తలకిందులై కేంద్ర మంత్రి ఘాటైన విమర్శలకు దిగుతున్నారని కొందరి విశ్లేషణ. అమిత్‌ షా వరుస విమర్శలు ఆయన నిరాశానిస్పృహలకూ, రాబోయే ఫలితాలకూ సంకేతాలని వారి అంచనా. ఏడు పార్టీల ‘పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌’ (పీఏజిడి) ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుస్తుందన్నది అటుంచితే, ఆర్టికల్‌ 370, 35 (ఎ) పునరుద్ధరణ ప్రధాన లక్ష్యంగా ఆవిర్భవించిన ఈ కూటమి ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధపడటం ద్వారా రాజీ సంకేతాలు ఇచ్చిందన్న విమర్శలూ ఎదుర్కొంటోంది.


ఎన్నికల్లో పోటీకి సై అని అన్నప్పటినుంచీ ఈ కూటమిపై ‘గుప్కర్‌ గ్యాంగ్‌’ అంటూ బీజేపీ నాయకులు విమర్శలు తీవ్రతరం చేశారు. జమ్మూకశ్మీర్‌లో విదేశీశక్తుల జోక్యాన్ని ఈ కూటమి కోరుతోందనీ, త్రివర్ణ పతాకాన్ని అవమానిస్తోందనీ, ఈ గ్యాంగ్‌ చర్యలను దేశప్రజలంతా తీవ్రంగా గర్హిస్తుంటే, కాంగ్రెస్‌ నిస్సిగ్గుగా దీనితో చేతులు కలుపుతున్నదనీ విమర్శ. బీజేపీ నాయకుల విమర్శలకు పీఏజీడీ నాయకులు ధీటుగానే సమాధానాలు చెబుతున్నారు. ‘కశ్మీర్‌లో మీరు పెట్టుకున్న పొత్తులన్నీ పవిత్రం, మావి అపవిత్ర కలయికలా?’ అని మెహబూబా ముఫ్తీవంటివారు ఘాటుగానే అడుగుతున్నారు. కాంగ్రెస్‌ ఒక్కటే అంత దూకుడుగా ఉండలేకపోతున్నదనీ, కూటమిలో చేరే విషయంలో చివరివరకూ ఎంతో ఊగిసలాడిన ఈ పార్టీ, కొన్ని స్థానాల్లో సీట్ల సర్దుబాటుతో పోటీకి సిద్ధపడుతూ కూడా తన స్థానాన్ని విస్పష్టంగా చెప్పుకోలేకపోతున్నదన్నది విమర్శ. ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న కూటమితో రాసుకుపూసుకు తిరిగితే మిగతా దేశంలో అప్రదిష్టరావచ్చని కాంగ్రెస్‌ భయపడుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీ ఘాటు విమర్శలకు కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిపోవడాన్ని మెహబూబా ముఫ్తీ కూడా తప్పుపడుతున్నారు. 


అమిత్‌ షా శపిస్తున్నట్టుగా ఈ ‘గుప్కర్‌ గ్యాంగ్‌’ను జమ్మూకశ్మీర్‌ ప్రజలు మరో పదిరోజుల్లో జరగబోయే డీడీసీ ఎన్నికల్లో ముంచుతారో, తేల్చుతారో చూడాలి. ఏదేమైనప్పటికీ, గత ఏడాది కేంద్రం జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు చేయడానికి ఒకరోజు ముందే బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పక్షాలూ గుప్కర్‌ రోడ్డులో ఉన్న ఫరూక్‌ అబ్దుల్లా ఇంట్లో సమావేశమై ఆర్టికల్‌ 370ని సమర్థించి, ఇకపై కలసికట్టుగా వ్యవహరించాలన్న నిర్ణయానికి అనుగుణంగానే ఈ అడుగులు పడ్డాయి. 


కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌లో ఈ ఎన్నికలు ఓ కదలిక. మొన్న అక్టోబర్‌లో పంచాయితీరాజ్‌ చట్టానికి మార్పుచేర్పులు చేసి, ప్రతీ జిల్లాకూ 14 కౌన్సిల్స్‌ చొప్పున దాదాపు 280 డీడీసీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలు జమ్మూకశ్మీర్‌లో అసలుసిసలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికేనని కేంద్రం చెబుతుంటే, ఈ హడావుడి వెనుక మిగతా పార్టీలన్నింటినీ పక్కకునెట్టి తానే అంతా ఆక్రమించుకొనే వ్యూహం ఉన్నదని విపక్షాల విమర్శ. ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న పీఏజీడీ ఈ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేసి, స్థానిక సంస్థలను తమకు పళ్ళెంలో పెట్టి అప్పగిస్తుందని బీజేపీ ఆశించినట్టు చెబుతున్నారు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకూ ఈ కూటమి ఎన్నికల జోలికి రాదన్న భరోసాతో డీడీసీ ఎన్నికలకు నడుంబిగించిన బీజేపీకి అట్టడుగు స్థాయిలో సులువుగా బలపడాలన్న కోరిక సునాయాసంగా నెరవేరకపోవచ్చు. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసిన వెంటనే జమ్మూలో ఏర్పడిన అనుకూల పరిస్థితి కూడా ఇటీవలి కాలంలో మరింత క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా మంచి ఎత్తుగడే కావచ్చును కానీ, ఈ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా పీఏజీడీ కేంద్రంతో రాజీపడిందన్న తప్పుడు సంకేతాలు ఇచ్చిందన్న విమర్శలూ ఉన్నాయి.