కార్పొరేషన్‌ ఎన్నికలపై కదలిక

ABN , First Publish Date - 2021-08-04T05:26:10+05:30 IST

నెల్లూరు నగరంలో త్వరలోనే ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) సన్నాహాలు చేస్తోంది. మొదటి విడతలో పలు కారణాలతో ఎన్నికలు జరగకుండా ఆగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిస్థితిపై ఎస్‌ఈసీ దృష్టి పెట్టింది.

కార్పొరేషన్‌ ఎన్నికలపై కదలిక

అధికారులతో సమీక్షించిన ఎస్‌ఈసీ

నిర్వహణకు అడ్డంకులు లేవని అధికారుల నివేదిక

సిద్ధమైన ఓటర్ల జాబితా.. ఖరారైన రిజర్వేషన్లు

త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశాలు

మళ్లీ నగరంలో రాజకీయ వేడి


నెల్లూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : 

నెల్లూరు నగరంలో త్వరలోనే ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) సన్నాహాలు చేస్తోంది. మొదటి విడతలో పలు కారణాలతో ఎన్నికలు జరగకుండా ఆగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిస్థితిపై ఎస్‌ఈసీ దృష్టి పెట్టింది. తాజా పరిస్థితిపై మూడు రోజుల క్రితం ఉన్నతాధికారులతో సమావేశమైంది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏర్పడిన ఆటంకాలన్నీ తొలగిపోయాయని, ఇక ఎన్నికలు నిర్వహించవచ్చని అధికారులు ఎస్‌ఈసీకి నివేదించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులకు అనుగుణంగా త్వరలోనే ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మరో మారు జిల్లా కేంద్రంలో రాజకీయ వేడి మొదలవుతుంది. 


పునర్విభజనతో ఆలస్యం

పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి ఉంటే గతేడాది ప్రకటించిన మున్సిపల్‌ నోటిఫికేషన్‌ ద్వారానే నెల్లూరు కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు జరిగి ఉండేవి. అయితే పొట్టేపాళెం ప్రాంతాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన అనివార్యమైంది. మొత్తం 54 డివిజన్లను పునర్విభజించి ఓటర్ల జాబితాను కూడా ప్రకటించారు. అయితే ఈ డివిజన్ల పునర్విభజన నిబంధనల ప్రకారం జరగలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం మరోసారి కొత్తగా డివిజన్ల పునర్విభజన చేయాలంటూ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించింది. దీంతో ఽఅధికారులు మరోమారు పునర్విభజన చేయాల్సి వచ్చింది. దీని కారణంగానే కార్పొరేషన్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 


ముందస్తు ఏర్పాట్లు పూర్తి

గతంలో కార్పొరేషన్‌ ఎన్నికలు వాయిదాపడినప్పటికీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చాలా వరకు పూర్తయ్యాయి. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు. అదే క్రమంలో రిజర్వేషన్లను కూడా ప్రకటించారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే నేరుగా ఎన్నికలకు వెళ్లడమే తరువాయి. ఈ దఫా కార్పొరేషన్‌ మేయర్‌ సీటును ఎస్టీలకు కేటాయించారు. దీంతో ఆ వర్గానికి కేటాయించిన మూడు డివిజన్ల నుంచి ఒకరు మేయర్‌ కానున్నారు. కాగా, కార్పొరేషన్‌ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో రాజకీయ హడావిడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.



నగరంలో ఓటర్లు

ఓటర్లు  4,78,207 

పురుషులు          2,33,724 

స్త్రీలు          2,44,408 

ఇతరులు          75 



రిజర్వేషన్‌ ఇలా...

నగరంలో డివిజన్లు  54

ఎస్టీ          3

ఎస్సీ         7

బీసీ         17

జనరల్‌         27

మహిళలు         అన్నింటిలో కలిపి 50 శాతం

Updated Date - 2021-08-04T05:26:10+05:30 IST