ఎల్‌ఆర్‌ఎస్‌లో కదలిక

ABN , First Publish Date - 2021-07-29T06:15:00+05:30 IST

అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరోసారి దృష్టిసారించింది. క్రమబద్ధీకరణ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి అక్టోబరు వరకు ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించడంతో వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌లో కదలిక

-  క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలనకు క్లస్టర్ల ఏర్పాటు 

- నాలుగు శాఖల అధికారులతో బృందాలు 

- ఆగస్టు 4లోగా పరిశీలన పూర్తికి ఆదేశాలు 

- జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 43,149 దరఖాస్తులు

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరోసారి దృష్టిసారించింది. క్రమబద్ధీకరణ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి అక్టోబరు వరకు ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించడంతో వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్లాట్‌కు మార్కెట్‌ విలువలో 33 శాతం జరిమానా వేసి క్రమబద్ధీకరించాలనే ఆదేశాలు ఉన్నాయి. కొత్తగా మార్కెట్‌ ధరలు పెంచడంతో మళ్లీ ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో తెలియని పరిస్థితి ఉంది. జిల్లాలో వచ్చిన క్రమబద్ధీకరణ దరఖాస్తులను 15 రోజుల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆగస్టు 4వ తేదీ లోగా జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం సర్వే నంబర్లు, స్థల వీస్తీర్ణాన్ని బట్టి క్లస్టర్లుగా విభజించి సర్వే చేయనున్నారు. రెవెన్యూ ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో బృందాలను   ఏర్పాటు చేస్తున్నారు.  ప్రస్తుతం దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తిరస్కరణ, జరిమానా వంటివి అమలు చేయనున్నారు. 

జిల్లాలో 43,149 దరఖాస్తులు 

ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో క్రమబద్ధీకరణ పథకం కింద వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి.  గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో 43,149 మంది దరఖాస్తు చేసుకున్నారు. 179 గ్రామ పంచాయతీల పరిధిలో 16,355 దరఖాస్తులు, సిరిసిల్ల మున్సిపాలిటీలో 10,524 దరఖాస్తులు, వేములవాడలో 16,270 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా రాలేదు. జిల్లాలోని బోయినపల్లి మండలంలో 20 గ్రామ పంచాయతీల్లో 645 దరఖాస్తులు, చందుర్తిలోని 15 గ్రామ పంచాయతీల్లో 213 దరఖాస్తులు, ఇల్లంతకుంటలోని 24 గ్రామపంచాయతీల్లో 1054 దరఖాస్తులు, గంభీరావుపేట మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో 861 దరఖాస్తులు, కోనరావుపేటలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో 277 దరఖాస్తులు, వేములవాడ అర్బన్‌ మండలంలోని 9 గ్రామ పంచాయతీల్లో 3,909 దరఖాస్తులు, ఎల్లారెడ్డిపేట మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 3949 దరఖాస్తులు, తంగళ్లపల్లిలోని 26 గ్రామ పంచాయతీల్లో 3,784 దరఖాస్తులు, వేములవాడ రూరల్‌లో 15 గ్రామ పంచాయతీల్లో 214 దరఖాస్తులు, రుద్రంగిలో 2 గ్రామ పంచాయతీల్లో 304 దరఖాస్తులు, వీర్నపల్లిలో 3 గ్రామ పంచాయతీల్లో 71 దరఖాస్తులు వచ్చాయి.  దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌ అంశం హైకోర్టులో ఉండడంతో కోర్టు ఇచ్చే ఉత్తర్వుల మేరకు క్రమబద్ధీకరణలు జరగనున్నాయి. 


Updated Date - 2021-07-29T06:15:00+05:30 IST