పోడు భూములపై కదలిక

ABN , First Publish Date - 2021-10-27T06:22:16+05:30 IST

కొన్నేళ్లుగా కొందరు రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించేందుకు కదలిక మొదలయ్యింది.

పోడు భూములపై కదలిక
మంథని మండలం గోపాల్‌పూర్‌లో సర్వే చేస్తున్న అటవీ, రెవెన్యూ శాఖాధికారులు (ఫైల్‌)

- పలు గ్రామాల్లో అటవీ, రెవెన్యూ శాఖల జాయింట్‌ సర్వే

- వచ్చేనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కొన్నేళ్లుగా కొందరు రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించేందుకు కదలిక మొదలయ్యింది. ఇందుకోసం జిల్లాలో పలు గ్రామాల్లో అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్‌ సర్వేను చేపట్టారు. వచ్చేనెల 8వ తేదీ నుంచి నెలరోజుల పాటు అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో అటవీ శాఖ పరిధిలో 76,720.85 ఎకరాల భూములు ఉన్నాయి. మంథని, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్‌, రామగిరి, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో అడవులు అధికంగా ఉండగా, ధర్మారం, కమాన్‌పూర్‌, పెద్దపల్లి, జూలపల్లి మండలాల్లో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నది. చాలా ఏళ్లుగా అనేక మంది గిరిజనులు, ఆదివాసులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అటవీ భూములను పోడుగా మార్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూములకు సంబంధించి రైతులకు ఎలాంటి పట్టాలు లేకపోయినా ఆ భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అప్పుడప్పుడు అటవీ శాఖాధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు ఆ భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నాలు చేసిన సందర్భాల్లో వివాదాలు చోటుచేసుకున్నాయి. పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆ భూములపై అధికారికంగా వారికి ఎలాంటి హక్కులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు దక్కకుండా పోతున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు కావాల్సినన్నీ అడవులు ఉండాలి. ఆ అడవులను నరికి పోడు భూములుగా మారుస్తున్నారనే కారణంతో పలుసార్లు ప్రభుత్వాలు ఆ చర్యలను అడ్డుకున్నాయి. ఏళ్ల తరబడి ఆ భూములపై తాము ఆధారపడి జీవిస్తున్నామని, వాటిపై తమకు హక్కులు కల్పించాలని పోరాటాలు చేస్తున్నారు. 

జిల్లాలో 6,312 ఎకరాల్లో పోడు..

జిల్లాలో మంథని మండలం చిన్న ఓదాల, గోపాల్‌పూర్‌, ముత్తారం మండలం మైదంబండ, ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్‌, రామగిరి మండలం బేగంపేట్‌, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో అటవీ భూములను పలువురు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. అటవీ శాఖాధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 6,312 ఎకరాల అటవీ భూములను పోడు భూములుగా మార్చి సాగు చేసుకుంటున్నారని అంచనా. మరో 4,669 ఎకరాల భూములు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయని గుర్తించారు. అటవీ భూములను రక్షించడంతో పాటు పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా శాఖల అధికారులతో విస్తృతంగా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అటవీ లోపల భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వ భూములను కేటాయించాలని, లేనట్లయితే అటవీ చివరి అంచున ఉండే భూములను కేటాయించాలని సీఎం పేర్కొన్నారు. వచ్చేనెల 8 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఈలోపు వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని అటవీ శాఖాధికారులను ఆదేశించారు. అటవీ హక్కుల చట్టంను అనుసరించి గ్రామ కమిటీలను నియమించాలని, రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక నోడల్‌ అధికారిని, సబ్‌ డివిజన్‌ స్థాయిలో ఆర్‌డీఓను నియమించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అఖిలపక్ష నాయకులతో జిల్లా కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంథని మండలం గోపాల్‌పూర్‌, ముత్తారం మండలం మైదంబండ గ్రామాల్లో అటవీశాఖ, రెవెన్యూ శాఖాధికారులు కలిసి జాయింట్‌ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న వివాదాస్పద భూములను తేల్చడంతో పాటు ఎక్కడెక్కడ ఎంతవరకు అటవీ భూమి పోడుగా మారిందని తేలనున్నది. దరఖాస్తుల స్వీకరణకు మరో 13రోజులు ఉండడంతో ఈలోపు సర్వేను, సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-27T06:22:16+05:30 IST