Advertisement

గాడ్సే జీవితంపై సినిమా... గాంధీ పుట్టినరోజున ప్రకటన

ముంబై: మహాత్మ గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేపై సినిమా తీయనున్నారు. ‘గాడ్సే’ అనే పేరుతో నిర్మించనున్న ఈ సినిమాను మహాత్ముడి జన్మదినం రోజునే ప్రకటించడం విశేషం. ఫిల్మ్ మేకర్ మంజ్రేకర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ప్రకటన చేశారు. ఈ సినిమాకు సందీప్ సింగ్, రాజ్ షాందిల్యా నిర్మాతలుగా వ్యవహరించనున్నట్లు మంజ్రేకర్ తెలిపారు. సందీప్ సింగ్, మహేష్ మంజ్రేకర్ కలయికలో ఇది వరకు ‘స్వతంత్ర వీర్ సావర్కర్’, ‘వైట్’ అనే సినిమాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం వీరి కలయికలో చేస్తున్నది మూడో చిత్రం.


ఈ సినిమాకు సంబంధించి చిన్న ప్రోమోను కూడా విడుదల చేశారు. బాపూకు (గాంధీకి) నాథూరాం గాడ్సే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా ఉన్న ప్రోమోను మంజ్రేకర్ తన ట్విట్టర్ ఖాతాలో వదిలారు. ‘‘హర్ధిక జన్మదిన శుభాకాంక్షలు బాపూ.. ఇట్లు మీ నాథూరాం గాడ్సే’’ అన్న టెక్స్ట్ రాశారు. దాని కిందే ‘గాడ్సే’ అనే సినిమా టైటిల్‌ను పెట్టారు.


ఈ సినిమా గురించి మహేష్ మంజ్రేకర్ మాట్లాడుతూ ‘‘నాథూరాం గాడ్సే కథ నా గుండెను తాకింది. ఇలాంటి సినిమాను తెరక్కించడానికి చాలా ధైర్యం కావాలి. నేను ఎప్పుడూ రాజీ పడని, బాగా కష్టపడే కథలను నమ్ముతాను. ఇలాంటివి నాకు ఆర్థికంగా లాభపడేవి కూడా కావు. కానీ ప్రజలకు గాడ్సే గురించి గాంధీని కాల్చడం తప్ప ఇంకేం తెలియదు. గాడ్సే కథను చెప్పడం తప్ప.. ఎవరినీ వ్యతిరేకించాలని కానీ ఎవరికో ప్రత్యేకంగా వత్తాసు పలికాలని కాని చేయడం లేదు. ఎవరు తప్పు, ఎవరు సరైనవారు అనేది ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు’’ అని అన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మధ్యలో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement