ఎందుకో ఆ తొందర!

ABN , First Publish Date - 2021-04-11T05:57:57+05:30 IST

పోలింగ్‌ పూర్తయిన తరువాత ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేయాలి. రూట్ల వారీగా ఏర్పాటు చేసే వాహనాల్లో పటిష్ట బం

ఎందుకో ఆ తొందర!




ప్రైవేటు వాహనంలో  స్ట్రాంగ్‌ రూమ్‌కు  బ్యాలెట్‌ బాక్సుల తరలింపు 

పీవో, ఏపీవో నిర్వాకం

ఆలస్యంగా వెలుగులోకి..

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 10: సాధారణంగా పోలింగ్‌ పూర్తయిన తరువాత ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేయాలి. రూట్ల వారీగా ఏర్పాటు చేసే వాహనాల్లో పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించాలి. నిబంధనలు పక్కాగా పాటించాలి. కానీ మొన్న జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో నెల్లిమర్ల మండలం సారిపల్లిలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఓ బూత్‌లో పీవో, ఏపీవోగా విధులు నిర్వహించిన ఉద్యోగులు మాత్రం తమ సొంత వాహనంలో బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా సమయానికి చేరిందా లేక ఆలస్యమైందా అనే విషయంపై స్పష్టత లేదు. గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలో సారిపల్లి శివారు గ్రామం. పోలింగ్‌ బూత్‌ల వారీగా కూడా చివరిదే. గురువారం పోలింగ్‌ కేంద్రం 31లో.. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆ ఇద్దరు ఉద్యోగులు హడావుడిగా సీల్‌ వేశారు. ఫారాలను నింపి అతికించారు. ప్రైవేటు వాహనంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో పోలింగ్‌ సిబ్బంది, బ్యాలెట్‌ బాక్సులను తీసుకెళ్లడానికి వాహనంలో రూట్‌ అధికారులు వచ్చారు. మూడు బ్యాలెట్‌ బాక్సులకు బదులు రెండు మాత్రమే ఉండడంతో షాక్‌కు గురయ్యారు. అటు తరువాత గ్రామంలో ఇదే విషయమై రచ్చ జరిగింది. అధికారుల ఫిర్యాదు వరకూ వెళ్లింది. కానీ ఈ విషయం బయటకు పొక్కకపోవడం విశేషం. ఆ ఇద్దరు ఉద్యోగులు ఎందుకు తొందరపడ్డారు? నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తే స్ర్టాంగ్‌ రూమ్‌ వద్ద ఎందుకు అనుమతించారు? ఎవరు అనుమతించారు ? రూట్‌ ఆఫీసర్‌, జోనల్‌ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ?మార్గమధ్యలో ఎవరైనా దుండగులు అటకాయిస్తే ఏం జరిగి ఉండేది? దీనికి ఎవరు బాధ్యులు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లేకుండా పోతోంది. దీనిపై ఇద్దరు ఉద్యోగులు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. ఏపీవో విధులు నిర్వహించిన ఉద్యోగి తల్లికి తీవ్ర అనారోగ్యం కారణంగానే బ్యాలెట్‌ బాక్సులను తరలించాల్సి వచ్చిందని చెబుతున్నారు. అలా అయితే పీవోగా ఉన్న ఉద్యోగి ఎందుకు వెళ్లిపోయారన్నది ప్రశ్న. మరోవైపు  ఉద్యోగులిద్దరూ ఓ పార్టీ నాయకుడితో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సమస్య నుంచి గెట్టిక్కించాలని కోరినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎంపీడీవో రాజ్‌కుమార్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా సారిపల్లి పోలింగ్‌ కేంద్రం 31లో బ్యాలెట్‌ బాక్సును నేరుగా స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించడానికి అనుమతించినట్టు చెప్పారు. ఏపీవోగా విధులు నిర్వహించిన ఉద్యోగి కుటుంబసభ్యుడికి తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో ఆయన అభ్యర్థన మేరకు అనుమతించినట్టు పేర్కొన్నారు. 




Updated Date - 2021-04-11T05:57:57+05:30 IST