ఈ 3 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఫ్రీ..

ABN , First Publish Date - 2021-04-21T23:34:03+05:30 IST

రాష్ట్రంలో పెద్దలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇవ్వనున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలూ కూడా ఇటీవల ఇదే ప్రకటన చేశాయి.

ఈ 3 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఫ్రీ..

న్యూఢిల్లీ: రాష్ట్రంలో పెద్దలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇవ్వనున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలూ కూడా ఇటీవల ఇదే ప్రకటన చేశాయి. దీంతో..మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉచిత టీకా ప్రకటన చేసినట్టైంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో.. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా ఇస్తామని కేంద్రం ఏప్రిల్ 19న ప్రకటించింది. మే 1 నుంచీ టీకా పంపిణీ ప్రారంభం కానుంది. అయితే..టీకా కొనుగోలు నిబంధనలను కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా సడలించింది. ప్రైవేటు ఆస్పత్రులు టీకా తయారీదారుల నుంచి నేరుగా టీకా కొనుగోళ్లు చేపట్టవచ్చని పేర్కొంది. ఇక టీకా తయారీదారులు కూడా మొత్తం టీకా ఉత్పత్తుల్లో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడంతో పాటూ బహిరంగ మార్కెట్లలోనూ విక్రయించవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో కంపెనీలు టీకా ధరలను మే 1కి మునుపే ప్రకటించాలని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్‌ ఒక డోసు రూ. 400కు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 600కు విక్రయిస్తామని ప్రకటించింది. 

Updated Date - 2021-04-21T23:34:03+05:30 IST