మరో కరోనా పాజిటివ్‌ రాకూడదు

ABN , First Publish Date - 2020-03-30T10:59:09+05:30 IST

కరోనా తొలి పాజిటివ్‌ కేసు నమోదైన తర్వాత కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ కర్నూలు ప్రజా వైద్యశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మరో కరోనా పాజిటివ్‌ రాకూడదు

సమీక్షా సమావేశంలో కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌


కర్నూలు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కరోనా తొలి పాజిటివ్‌ కేసు నమోదైన తర్వాత కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ కర్నూలు ప్రజా వైద్యశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ప్రజా వైద్యశాలలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆదివారం ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనంత మాత్రాన ఎవరూ భయపడాల్సిన పనిలేదని, అందరం కలిసి దీనిపై పోరాడుదామని అన్నారు. కరోనాపై పోరుకు ఏమేం చేయాలో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. నిధుల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తన ఎంపీ ల్యాడ్స్‌లో దాదాపు రూ.2 కోట్ల 40 లక్షలు ఉన్నాయని, అవసరమైతే అవి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.


ఎవరికి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా అడగాలన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందుబాటులో ఉన్న పర్సనల్‌ ప్రొటెక్షన్‌ మాస్కులు, ఎన్‌ 95 మాస్కులు, శానిటైజర్లు వెంటనే కోవిడ్‌ విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి అందజేయాలని డీఎంహెచ్‌వో రామగిడ్డయ్యను ఆదేశించారు. కోవిడ్‌ విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్లు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. కరోనా వార్డులకు అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడి అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడంలో కర్నూలు మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి త్వరలోనే కోలుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో మాత్రమే కరోనాను ఎదుర్కోగలమని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి. రామప్రసాద్‌, డెప్యూటీ సూపరింటెండెంట్లు డా. నర్సింహులు, డా. భగవాన్‌, డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య, కోవిడ్‌ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, జూనియర్‌ వైద్యులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, శానిటేషన్‌ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T10:59:09+05:30 IST