తిరుమలలో జగన్‌ను చూసి.. క్రిస్టియన్ల కన్ఫ్యూజ్: రఘురామ

ABN , First Publish Date - 2020-09-24T19:39:46+05:30 IST

జగన్మోహన్ రెడ్డి స్వామిజీల చుట్టూ తిరిగి గంగలో స్నానం చేసి.. ఎన్నికల ముందు..

తిరుమలలో జగన్‌ను చూసి.. క్రిస్టియన్ల కన్ఫ్యూజ్: రఘురామ

న్యూఢిల్లీ: జగన్మోహన్ రెడ్డి స్వామిజీల చుట్టూ తిరిగి గంగలో స్నానం చేసి.. ఎన్నికల ముందు ప్రచారం చేసుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ హిందు మతానికి తిరిగివచ్చారని వైసీపీ ప్రచారం చేసి నమ్మించిందన్నారు. ముఖ్యమంత్రికి మార్గదర్శనం చేస్తున్న స్వరూపానంద.. ఆలయాలపై దాడులు ఆపేందుకు దారి చూపితే బాగుంటుందని రఘురామ అన్నారు. ఇప్పటి వరకు హిందువులే జగన్ విషయంలో అయోమయంలో ఉన్నారని, తిరుమలలో జగన్‌ను చూసి క్రిస్టియన్లు కూడా కన్ఫ్యూజన్‌లో పడ్డారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అసలు జగన్ ఏ మతం.. ఏమనుకుంటున్నారనేది స్వరూపనంద ఒక్కరే చెప్పగలరేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. దానిపై ఇప్పటికైనా స్పష్టత ఇస్తే మంచిదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.


ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రే నిబంధనలను తుంగలో తొక్కితే.. ఈ ప్రభుత్వం ఇచ్చే జీవోలపై ఎవరికి మర్యాద ఉంటుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో తిరుమలలో అందరూ మాస్కులు పెట్టుకున్నారని, సీఎం జగన్ మాత్రం పెట్టుకోలేదన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను సీఎం పాటించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది చూసిన ప్రజలు కూడా నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రే తమకు ఆదర్శమని అంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అభిమానించే ప్రజలే.. ఆయనపై వేలుపెట్టి చూపిస్తే దానికి జగన్ ఏం సమాధానం చెబుతారని రఘురామ నిలదీశారు.

Updated Date - 2020-09-24T19:39:46+05:30 IST