రఘురామ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-05-15T09:19:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న... అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. అధికార వర్గాలు, ఇతరులు అందించిన సమాచారం ప్రకారం... శుక్రవారం రఘురామకృష్ణంరాజు పుట్టిన రోజు.

రఘురామ అరెస్ట్‌

  • పుట్టినరోజున ఇంట్లో ఉండగా అదుపులోకి!
  • హైదరాబాద్‌కు 35 మంది ఏపీ సీఐడీ పోలీసులు
  • కుట్రలు చేశారని, విద్వేషాలు రెచ్చగొట్టారని...
  • ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీశారని అభియోగాలు
  • ఇంటి గోడకు నోటీసు అంటించిన సీఐడీ
  • గచ్చిబౌలి నుంచి గుంటూరుకు తరలింపు
  • నవంబరులోనే నాన్నకు హార్ట్‌ సర్జరీ జరిగింది
  • మందులు వేసుకునేందుకూ అనుమతించలేదు
  • ఎంపీ తనయుడు భరత్‌ ఆవేదన


హైదరాబాద్‌/అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న... అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. అధికార వర్గాలు, ఇతరులు అందించిన సమాచారం ప్రకారం... శుక్రవారం రఘురామకృష్ణంరాజు పుట్టిన రోజు. హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. కుటుంబ సభ్యులు, కొందరు  సన్నిహితులతో మాట్లాడుతుండగా... మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో  30 నుంచి 35 మంది సీఐడీ పోలీసులు అక్కడికి వచ్చారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించి... వారిని కూడా తమ వెంటతీసుకొచ్చారు. ‘‘ఆంధ్రా పోలీస్‌... ఏపీ గవర్నమెంట్‌...’ అంటూ ఐడీ కార్డులు చూపిస్తూ నేరుగా రఘురామకృష్ణంరాజును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఎంపీకి కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. రక్షణగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు రఘురామకృకష్ణం రాజు చుట్టూ వలయంలా నిలబడ్డారు.  అరెస్టు వారంటు చూపాలని కోరారు. అది లేకుండా రఘురామను అరెస్టు చేసేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు.


అటు రఘురామ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా అరెస్టును ప్రతిఘటించారు. దీంతో సుమారు గంటసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐడీ అధికారులు సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు రఘురామ అరెస్టుకు జవాన్లు సహకరించారు. ఆ వెంటనే .. రఘురామను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సొంత వాహనంలో వస్తానని రఘురామ చెప్పినా వినిపించుకోలేదు. ఆయనను బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఒక దశలో ఆయనను వాహనంలోకి బలవంతంగా తోసేశారు. ఎంపీ తనయుడు సీఐడీ పోలీసులను అడ్డుకోగా... ‘కోర్టులోనే తేల్చుకోండి’ అని స్పష్టం చేశారు.  ఈ సమయంలో ‘నేను మందులు వేసుకోవాలి’ అని రఘురామకృష్ణరాజు గట్టిగా  అరవడం వినిపించింది. అయినా... పట్టించుకోకుండా సీఐడీ పోలీసులు ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రికి ఆయనను గుంటూరుకు తీసుకొచ్చారు. ఆయనను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి... రిమాండ్‌కు తరలించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.


ఇంటి గోడకు నోటీసు... 

ఇతరులతో కలసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్‌ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. అయితే... ఆ నోటీసును తీసుకునేందుకుగానీ సంతకం చేసేందుకుగానీ రఘురామ అంగీకరించలేదని, ఆయన భార్య రమాదేవి కూడా నోటీసు తీసుకునేందుకు నిరాకరించడంతో... ఇంటి గోడకు అంటించామని పోలీసులు దానిపై రాశారు. ఆయనపై మంగళగిరి సీఐడీపోలీసులు కేసు (12/2021) నమోదు చేసినట్లు నోటీసులో ఉంది. 


పోలీసులో, రౌడీలో: రఘురామ తనయుడు

వారంటు లేకుండానే తన తండ్రి రఘురామను అరెస్టు చేశారని ఆయన తనయుడు భరత్‌ మీడియాకు తెలిపారు. ‘‘మాకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. మా ఇంటికి వచ్చినవారు సీఐడీ పోలీసులో, గూండాలో, రౌడీలో అర్థం కాలేదు. మా నాన్నకు గుండెలో ఐదు రంధ్రాలున్నాయి. ఆయనకు నవంబరులోనే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగింది. ఈ సమయంలో ఆయనను అరెస్టు చేయకూడదు. చివరికి... మందులు కూడా వేసుకోనివ్వలేదు. అరెస్టుకు కారణాలు చెప్పాలని, వారంటు లేదా నోటీసు చూపాలన్నా పట్టించుకోలేదు. ఏదైనా సందేహాలుంటే కోర్టులోనే తేల్చుకోవాలంటూ బెదిరించారు’’ అని భరత్‌ వివరించారు. లోక్‌సభ సభ్యుడని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారని భరత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రౌడీల్లా ప్రవర్తించారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లను కూడా పక్కకు నెట్టేశారు. నాన్నగారు లాయర్‌తో మాట్లాడుతుంటే ఫోన్‌ లాక్కున్నారు. భద్రతా సిబ్బంది గట్టిగా వారించి గొడవ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడే సరికి అప్పుడు ఫోన్‌ ఇచ్చారు. వై-కేటగిరీ భద్రత ఉన్న ఎంపీని ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది కారు ఎక్కబోతుంటే వారిని పక్కకు లాగేశారు. ఎందుకు అరెస్టు చేశారో? ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పలేదు’’ అని తెలిపారు. కుట్ర పూరితంగా, పక్కా స్కెచ్‌ ప్రకారమే పుట్టినరోజు నాడే తన తండ్రిని అరెస్టు చేశారన్నారు. ‘‘వాళ్లు వచ్చినప్పుడు నాకు మాస్కు కూడా లేదు. మాస్కు పెట్టుకుందామని పైకి వెళ్తుంటే నన్ను కూడా అడ్డుకున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో రూల్‌ ఆఫ్‌ లా అనేది ఉందా... లేదా.. అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారు చేస్తున్న తప్పుల్ని వ్యతిరేకిస్తే అరెస్టులు చేస్తారా?’’ అని నిలదీశారు. తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, మీడియా వచ్చిన అనంతరం అప్పటికప్పుడు తయారు చేసిన నోటీసులు గోడకు అంటించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అరెస్టు చేయడమంటే... కరోనా అంటించాలని చూడటమే అని భరత్‌ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.


కేసు ఇందుకే... 

రఘురామపై కేసు నమోదు, అరెస్టుకు సీఐడీ మూడు కారణాలు చూపించినట్లు తెలిసింది. అవేమిటంటే... 1) ముఖ్యమంత్రికి పిచ్చి పట్టింది... ఆయన విదేశాల్లో చికిత్స చేసుకున్నారు. 2) ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలను ‘బిజ్జల’ అని సంబోధించారు. 3) ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కాదు, ఆయన కాపు. అంటూ కులాల మధ్య అంతరాలు సృష్టించారు. అని పేర్కొన్నట్లు సమాచారం.

Updated Date - 2021-05-15T09:19:50+05:30 IST