మంత్రిగారూ.. ‘ఆర్టికల్-164’ చదువుకోండి: రఘురామ

ABN , First Publish Date - 2021-09-01T20:27:19+05:30 IST

ఢిల్లీ: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. సుభాషితాలు చెప్తున్నారని ఎంపీ రఘురామకృష్ణమరాజు ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం ఎక్కడ ఉంటే.. అక్కడే రాజధాని అంటూ మంత్రి మాట్లాడటం ఏంటని

మంత్రిగారూ.. ‘ఆర్టికల్-164’ చదువుకోండి: రఘురామ

ఢిల్లీ: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. సుభాషితాలు చెప్తున్నారని ఎంపీ రఘురామకృష్ణమరాజు ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం ఎక్కడ ఉంటే.. అక్కడే రాజధాని అంటూ మంత్రి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. సీఎం విధుల గురించి ఆర్టికల్-164ను.. గౌతమ్ రెడ్డి చదువుకోవాలని సూచించారు. మంత్రి మేకపాటి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. శ్రీబాగ్ ఒప్పందాలపై సీఎంకే తెలుసనుకోవడం సరైనది కాదని హితవుపలికారు. రాష్ట్రంలోని మార్పులపై కేంద్రానికి అధికారం ఉందనే విషయం.. ఆర్టికల్-3లో చూసుకోవాలని చెప్పారు. రాజ్యాంగంలోని 153, 154 నిబంధనల ప్రకారం రాష్ట్రాల కార్యనిర్వాహక వ్యవస్థలో గవర్నరే సుప్రీమ్‌గా పేర్కొన్నారని గుర్తుచేశారు. మంత్రుల కంటే సీఎం.. కొంచెం మాత్రమే ఎక్కువని తెలిపారు.


1937 నవంబర్‌లో శ్రీభాగ్ అనే పేరున్న భవనంలో ప్రముఖులు చర్చలు జరిపారని.. ఆ సమావేశం అనంతరం 16 ఏళ్ల తర్వాత అంధ్రప్రదేశ్ ఏర్పడిందని తెలిపారు. రాజధాని గురించి చర్చ వచ్చినప్పుడు.. సర్కారులో ఒకటి, రాయలసీమలో ఒకటి ఉండాలని ఆ సమావేశంలో మాట్లాడుకున్నట్లు వివరించారు. ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక.. కర్నూలులో రాజధాని,  గుంటూరులో కోర్టును ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయాక 2014, 15 అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండడానికి సీఎం జగన్.. ఓకే చెప్పారన్నారు. అలాగే అధికారంలోకి రాగానే ఉద్యోగుల ఆకాంక్ష మేరకు.. సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేస్తామని జగన్ చెప్పినట్లు గుర్తుచేశారు. వృద్ధులకు వలంటీర్ వ్యవస్థ నుంచి విముక్తి కలిగించి పింఛన్లను నేరుగా బదిలీ చేయాలని రఘురామ పేర్కొన్నారు.

Updated Date - 2021-09-01T20:27:19+05:30 IST