సుప్రీం చీవాట్లు పెట్టిన వ్యక్తికి పదవిచ్చిన జగన్‌

ABN , First Publish Date - 2020-10-16T08:59:17+05:30 IST

జగన్‌ ప్రభుత్వానికి త్వరలో దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి అక్షింతలు, మందలింపు తప్పవని వైసీపీ అసమ్మతి ఎంపీ ..

సుప్రీం చీవాట్లు పెట్టిన వ్యక్తికి పదవిచ్చిన జగన్‌

సుప్రీం జడ్జిపై 2011లోనే కుట్ర.. లేఖపై సీఎంకు అక్షింతలే: రఘురామ


న్యూఢిల్లీ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వానికి త్వరలో దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి అక్షింతలు, మందలింపు తప్పవని వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. జగన్‌ అధికార దుర్వినియోగంపై దాఖలైన న్యాయవాదుల పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుందని, ఈ వ్యవహారంలో కచ్చితంగా ఆయన మందలింపునకు గురవుతారన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2012లో అప్పట్లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కొన్ని ఆరోపణలు చేస్తూ, అబద్ధాలతో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది ఎం.మనోహర్‌రెడ్డికి జగన్‌ ప్రభుత్వంలో కీలక పదవి లభించిందన్నారు ‘‘సత్యమేవ జయతే అని చెప్పుకొనే ఓ పత్రికలో(జగన్‌ పత్రిక) సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై 2011 డిసెంబరు 27న ఒక కథనం ప్రచురించారు. దాని ఆధారంగా మనోహర్‌రెడ్డి సహా ఇద్దరు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు చీవాట్లుపెట్టింది.


దానిని కొట్టివేస్తూ, ఆ ఇద్దరికీ చెరో రూ.50వేలు వంతున జరిమానా విధించింది. అలాంటి మనోహర్‌రెడ్డిని మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖకు ప్రభుత్వ న్యాయవాదిగా జగన్‌ నియమించారు. దీన్నిబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు 2011లోనే ప్రణాళిక రచించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది’’ అని రఘురామ వివరించారు. కాగా, ఆపరేషన్‌ చేయించుకొని, రక్తస్రావం అవుతున్నా టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడును కారులో శ్రీకాకుళం నుంచి విజయవాడ తెచ్చారని, అదే ఓ మంత్రి అనారోగ్యానికి గురయితే, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారని విమర్శించారు. అచ్చెన్నాయుడుకో న్యాయం, మంత్రులకు మరొక న్యాయమా అని మండిపడ్డారు. 

Updated Date - 2020-10-16T08:59:17+05:30 IST