Abn logo
Apr 11 2021 @ 11:13AM

జగన్‌ పర్యటన రద్దు చేసుకోవడానికి కారణమిదే..!

లోకేశ్‌ సవాలుకు జడిసే జగన్‌ పర్యటన రద్దు

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు


తిరుపతి, ఆంధ్రజ్యోతి: తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు హఠాన్మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌ నాయుడు 26 ఏళ్లకే పార్లమెంట్‌ మెట్లు ఎక్కారు. లోక్‌సభలో తనదైన ముద్ర వేసుకున్నారు. శ్రీకాకుళం ప్రజలు సిక్కోలు సింహంగా పిలుచుకుంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్లమెంట్‌ సింహంగా కీర్తిస్తుంటారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బాధ్యతల్లో తలమునకలై ఉన్న రామ్మోహన్‌ నాయుడు  ఆంధ్రజ్యోతితో ‘ఫటాఫట్‌’గా మాట్లాడారు.  


జగన్‌ పర్యటన రద్దుపై మీ కామెంట్‌?

బాబాయి వివేకా హత్య కేసుతో సంబంధం లేదని భగవంతుడి ముందు ప్రమాణం చేసుకుందాం రమ్మని లోకేశ్‌బాబు విసిరిన సవాలుకు భయపడే తిరుపతి పర్యటనను కొవిడ్‌పై నెట్టి రద్దు చేసుకున్నారు. 


ప్రత్యేక హోదాపై మీ పోరాటం ఎలా ఉండబోతోంది?

రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రధానితో కూడా చంద్రబాబు విబేధించారు. భవిష్యత్‌లో కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. వైసీపీ ఎంపీలు పుదుచ్చేరిలో ప్రత్యేక హోదా ఇస్తామంటే అక్కడకు వెళ్లి బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన రాజకీయం ఎక్కడైనా ఉంటుందా? 


రాష్ట్ర సమస్యలపై ఎంపీలు పార్లమెంటులో ఏం చేస్తున్నారు?

ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని జగన్‌ చెప్పారు. ప్రజలు కూడా 22మంది ఎంపీలను గెలిపించారు. మాకు ఐదు నిమిషాలు మించి సమయం ఇవ్వరు. అర్ధగంట సమయం ఉన్నా వైసీపీ ఎంపీలు ఒక్క నిమిషం కూడా సమస్యలను ప్రస్తావించరు. ఒక్కసారైనా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి హోదా గురించి మాట్లాడలేదు. పోలవరం, రైల్వేజోన్‌, పోర్టుల నిర్మాణాలకు నిధులు తీసుకురాలేని పరిస్థితి. విశాఖ స్టీల్‌ప్లాంటు సాధనకు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు.ఒక్క ఎంపీ కూడా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. జగన్‌పై ఉన్న కేసుల భయంతో సీఎం తన ఎంపీలతో లాబీయింగ్‌ చేస్తున్నారు. మోదీని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే జగన్‌ జైలుకు వెళతారని ఆ పార్టీ ఎంపీలు భయపడుతున్నారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?

రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి నెలకొంది.  ప్రభుత్వ భూములు అమ్ముకునే దుస్థితి నెలకొంది. విశాఖలో పరిశ్రమల కోసం కేటాయించిన భూములను కూడా అమ్ముకుంటోంది. అవసరమైతే తిరుమల ఏడుకొండలను కూడా అమ్ముకునేందుకు ఈ నాయకులు వెనకాడరు. తిరుపతి ప్రజలు దీనిని గుర్తించాలి. తిరుపతి ఉప ఎన్నికలు వైసీపీకి గుణపాఠం కావాలి.


అధికార బలం ముందు మీ గెలుపు సాధ్యమేనా?

స్థానిక సంస్థల ఎన్నికల్లాగే ఉప ఎన్నిక కూడా ఉంటుందనుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తుందని నమ్ముతున్నాం. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలపై అవగాహన ఉన్న పనబాక లక్ష్మిని ఎంపీ చేస్తే ఈ ప్రాంతానికి చాలా మేలు జరుగుతుంది. పార్లమెంటులో టీడీపీ బలం పెరిగితే మా పోరాటం ఇంకా పటిష్టంగా సాగుతుంది. తిరుపతి ప్రజలు మా ఆలోచనలను గౌరవిస్తారని ఆశిస్తున్నా. 


Advertisement
Advertisement
Advertisement