CM Jagan నా సలహాలు వింటే బీజేపీని ఒప్పించే బాధ్యత నాది: టీజీ వెంకటేష్

ABN , First Publish Date - 2021-11-23T21:05:56+05:30 IST

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు.

CM Jagan నా సలహాలు వింటే బీజేపీని ఒప్పించే బాధ్యత నాది: టీజీ వెంకటేష్

కర్నూలు: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో టీజీ వెంకటేష్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ పెట్టాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని తెలిపారు. 


అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదని, తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీకి తెలియజేశామని చెప్పారు. వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి, తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలని, లేకపోతే రెండూ పోతాయని టీజీ సూచించారు. విశాఖలో సెక్రటేరియట్ పెడితే తమ ప్రాంతానికి దూరం అవుతుందని, కాబట్టి కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలని కోరారు.


‘‘మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుకు వెళ్లితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అమరావతినే క్యాపిటల్‌గా ఉంచాలి. పేరు ఏదైనా పెట్టుకొండి.. కానీ అభివృద్ధి మాత్రం చేయండి. ముఖ్యమంత్రి గందరగోళంలో పరిపాలన చేస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదు. రాజధానిని ముక్కలు చేయకుండా ఒక చోట సెక్రటేరియట్, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ నా సలహాలు వింటే బీజేపీని ఒప్పించే బాధ్యత నాది.’’ అంటూ టీజీ వెంకటేష్ ప్రకటించారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.



Updated Date - 2021-11-23T21:05:56+05:30 IST