Abn logo
Sep 24 2021 @ 00:49AM

వెనక్కు తగ్గిన ఎంపీటీసీ

ఉదయం రాజీనామా చేస్తానంటూ ప్రకటన

ఎమ్మెల్యేపై విమర్శలు.. సాయంత్రానికి సర్దుబాటు

కదిరి, సెప్టెంబరు 23: మండలంలో ఎంపీపీ పదవికి శుక్రవారం ఎంపిక జరుగనున్న సందర్భంగా కదిరిరూరల్‌ మండలంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎంపీపీ పదవి కోసం మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఉత్కంఠ కొనసాగింది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ఎంపీటీసీ 1 బత్తల రామలక్ష్మమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె భర్త ఆదినారాయణతో కలసి గురువారం ఉదయం  మీడియాకు వెల్లడించారు. ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి ఎంపీపీ పదవి ఇస్తామని మోసం చేశారని అందువల్లే తాము ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపింది. తీరా పదవి చేతికి వచ్చే సమయానికి మీకు కాదంటూ మరొకరికి ఆ పదవి కట్టబెడుతున్నట్లు చెప్పారన్నారు. దీంతో తాము తీవ్ర మనస్తాపానికి గురయ్యామని కష్టపడి పని చేసిన తమకు ఎమ్మెల్యే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటీన మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ లింగాల మధుసూదన్‌రెడ్డిని వారి వద్దకు పంపారు. ఆయనతోపాటు బీజేపీ నాయకుడు వెంకటేష్‌ కూడా వారితో చర్చలు జరిపి మొత్తం మీద వారిని రాజీనామా చేయడం లేదని తిరిగి మీడియాకు చెప్పే విధంగా సర్దుబాటు చేశారు. .