మిస్టర్‌ మోదీ.. నేను భయపడను: స్టాలిన్‌

ABN , First Publish Date - 2021-04-03T07:14:43+05:30 IST

‘‘మిస్టర్‌ మోదీ! నేను స్టాలిన్‌ను.. కరుణానిధి కుమారుడిని. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు. ఐటీ, సీబీఐ

మిస్టర్‌ మోదీ.. నేను భయపడను: స్టాలిన్‌

‘‘మిస్టర్‌  మోదీ! నేను స్టాలిన్‌ను.. కరుణానిధి కుమారుడిని. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు. ఐటీ, సీబీఐ దాడులు చూసి అన్నాడీఎంకే నేతలు భయపడవచ్చేమో కానీ నేను భయపడే రకం కాదు. మీసా చట్టం, ఎమర్జెన్సీని కూడా ఎదుర్కొన్నాను. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీరు ఎన్ని రకాల దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదు’’ అని డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ అన్నారు. తన కుటుంబీకులతో పాటు తమ పార్టీ నేతలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడాన్ని ఖండించారు.


శుక్రవారం త్రిచీ జిల్లా జయంకొండాంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. తాను ప్రచారానికి వస్తుండగా తన కుమార్తె నివాసంలో వందమంది పోలీసులు, 30 మందికి పైగా ఆదాయపన్ను శాఖ అధికారులు కలిసి తనిఖీ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇలాంటి దాడులకు అధికార పార్టీ నేతలు భయపడి రాష్ట్ర హక్కులను తాకట్టుపెట్టవచ్చు గానీ డీఎంకే మాత్రం బెదరదని స్పష్టం చేశారు. విపక్షాలను లొంగదీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీ, సీబీఐ దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు.


తమిళనాడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ ప్రధాన కార్యదర్శి నివాసాల్లో ఇలాంటి సోదాలు జరిపే వారిని గుప్పెట్లో పెట్టుకుందని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. స్టాలిన్‌ కుమార్తె ఇంట్లో ఐటీ దాడులు రాజకీయ కుట్ర అని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమరుగన్‌ విమర్శించారు. 


Updated Date - 2021-04-03T07:14:43+05:30 IST